13, జనవరి 2017, శుక్రవారం

ప్రకృతి నేర్పే పాఠాలు

ప్రకృతి నేర్పే పాఠాలు
*******************
భావరాజు పద్మిని - 01/01/17


మౌనంగానే ఉంటుంది, కానీ...
జీవిత సత్యాల గుప్తనిధి ఇది,
మనసుతో నిశితంగా పరిశీలిస్తే,
ఎన్నో పాఠాలు నేర్పుతుంది,
అందరినీ పోషించే అమ్మ ప్రకృతి.


పల్లవించే సత్తా నీలో ఉంటే,
కొండైనా లోయైనా బండైనా,
తలవంచుకు ఒగ్గి నీకనువుగా,
దారి ఇవ్వాల్సిందేనంటుంది,
తలెత్తుకు నిలబడ్డ చిన్నచిగురు.


ఎన్ని అనుకోని విపత్తులెదురైనా,
ఎన్ని జాడ్యాలు మొదలంటా తొల్చినా,
నువ్వు ధృడంగా స్థిరంగా నిలబడి,
ఆశల చిగురులేస్తున్న లతలకు,
ఆలంబన కమ్మంటుందో వృద్ధ వృక్షం.


ప్రతిధ్వనించే స్వనం నీలో ఉంటే,
గాలి వాటు నీకు వాహికవుతుందని,
కొమ్మ మాటు నీకు వేదికవుతుందని,
కొండ వాలు నీకు వంత పాడుతుందని,
చెబుతుంది కొమ్మమాటు చిన్నిపిట్ట.

Image may contain: tree, plant, outdoor and nature


దారున్నప్పుడు పయనం గొప్ప కాదని,
బండలనైనా కరిగించే సంకల్పబలంతో,
ఓపికతో ఒరిపిడిని ఓర్చుకుంటూ,
దారిచేసుకుని దాహార్తిని తీర్చమని,
గలగలలతో బోధిస్తుంది సెలయేరు.


నువ్వు బండబారిపోయినా సరే,
కొండకు ఉనికినిచ్చే శకలానివి కమ్మని,
మరో జీవిని ఎదగనిచ్చే సోపానం కమ్మని,
దైవానికి రూపమిచ్చే మూలానివికమ్మని,
అంటుంది బాధలెన్నో మోసిన బండరాయి.


చిక్కుముడిలా పెనవేసుకున్న వనాలు,
మొక్కకి మొక్క ఎన్నడూ అడ్డం కాదని,
ప్రాణి ప్రాణికెన్నడూ అడ్డంకి కాదని,
మరి మనిషికి మనిషే అడ్డమెందుకని,
మీలో తేడాలెందుకని సూటిగా ప్రశ్నిస్తుంది.


అమ్మ చెప్పే పాఠాలు విని ఆచరిస్తే,
అసూయాద్వేషాలన్నీ మరువమా?
అమ్మ పెట్టే అన్నమే ఆధారమైన మనం,
వసుధైక కుటుంబకంలాగా మెలగమా?
ఆటవికుల నుండి మానవులమైన మనం,
ప్రకృతి నేర్పే కనీస పాఠాలు నేర్చేందుకు,
మళ్ళీ అడవితల్లి ఒడిలోకి వెళ్ళాలేమో !


(అద్భుతమైన, దట్టమైన, సహజమైన అహోబిల అడవుల్లో స్వామి దర్శనానికి కొన్ని మైళ్ళు కాలినడకన వెళ్ళినప్పుడు నాలో కలిగిన భావనలు. దృశ్యాలు కూడా అక్కడివే.)

22, డిసెంబర్ 2016, గురువారం

కాలం తేల్చాల్సిన లెక్కలు

కాలం తేల్చాల్సిన లెక్కలు
————————————
భావరాజు పద్మిని - 22/12/16

కాలమెంత గొప్పది?
ఏ మలుపుల్లోనో పరిచయాలు చేస్తుంది,
ఏవేవో మనసుల్ని ముడివేస్తుంది,
ఏ దారుల్లోనో పయనింపజేస్తుంది,
జతకట్టాలని చూస్తే విడదీస్తుంది,
విడిపోవాలనుకుంటే కలిపేస్తుంది.

గుండె గాయలను మాన్పుతుంది,
మానిన గాయాలను రేపుతుంది,
చీకట్లో ఆశాకిరణం చూపుతుంది,
కాంతికి కారుమబ్బై కమ్మేస్తుంది,
బాధే కాదు ఆనందాన్నీ మింగేస్తుంది,
జీవితాలతో చెలగాటమాడుతుంది.

నాదనుకున్నది తన్నుకుపోతుంది,
కాదనుకున్నది తెచ్చిపడేస్తుంది,
ఆపదల్లో అమ్మై ఓదారుస్తుంది,
నిద్రపుచ్చి కల్లో కనికట్టు చేస్తుంది,
రేపటిమీద ఆశ వీడద్దంటుంది,
నీకు నేనున్నానంటూ నిలబడుతుంది.



ఎవరికెవరు ఈ లోకంలో...
ఎందుకోసమో ఈ తపనలు,
ఎంతకాలమో ఈ మమతలు,
ప్రశ్నలే తప్ప జవాబుల్లేవిక్కడ,
మజిలీలే తప్ప మార్గం తెలీదిక్కడ,
మాటలెందుకులే వృథా మిత్రమా!

గుండె లోతుల్లో అనురాగమెంతో,
బయటపెట్టలేని అసహ్యమెంతో,
బేరీజు వేసిచూసి కాలాన్నేతేల్చనీ !
పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలో,
దూరంగా నెట్టివేసిన పంతాలో,
ఏవి నిలవాలో కాలాన్నే తేల్చనీ!
ఎందుకంటే ...
కొన్నిసార్లు మాటలకంటే మౌనమే బాగుంటుంది.
కొన్నిలెక్కలు కాలం తేల్చినప్పుడే బాగుంటుంది.

29, ఆగస్టు 2016, సోమవారం

వర్షావతరణం

వర్షావతరణం
---------------------
భావరాజు పద్మిని - 30/8/16

గాఢపు మబ్బులు గగనము కమ్మెను
మరలక తప్పని సూర్యుడు దాగెను
ఆర్తిగ సెగలతొ అవని వేచెను
గాలుల సవ్వడి సేదను దీర్చెను
ఎప్పుడెప్పుడని ఎదసడి అడిగెను
తొలకరి తపనలు తీర్చే తరుణం !

జీవుల కన్నులు మింటినె జూచెను
తూనీగల రొదలు రాకను జెప్పెను
పురులు విప్పుకుని నెమళ్ళు ఆడెను
కప్పలు బెకబెక సందడి జేసెను
పక్షులు గూటిన గుట్టుగ దాగెను
నీటి ముత్యముల నడిగెను నయనం !

ధనధనధనధన ఉరుములు ఉరిమగ
మిలమిలమిలమిల మెరుపులు మెరవగ
జలజలజలజల చినుకులు రాలగ
తడిసిన మట్టి సుగంధము రేగగ
మనసు మనసునా పులకలు పూయగ
ఇలను వెలసె నవ వర్షావతరణం !

కొబ్బరాకుల చిటపట జల్లు
చిట్టి పిట్టల కువకువ జల్లు
కొండకోనల రవళించే జల్లు
ఎండన బంగరు జిలుగుల జల్లు
వెన్నెలలో జలతారుల జల్లు
స్వాతి చినుకుగా మారెడి ముత్యం
కోటి వన్నెలతొ కులికెడి మురిపెం !



వాన చినుకులా వన్నె దొంగలా?
పూవుల మధువుల గ్రోలుచు రాలెను
తరువుల ఓషధులన్నీ తడిమెను
పడతుల వంపుల నిగ్గులు తేల్చెను
పక్షుల గొంతుల లోతులు తాకెను
జగతిన కణకణమును మెరిపించెడి
తుషారముల వాసంత విలాసం !

ఎదిగిన మనసున దాగిన బాల్యము
వేసిన ముసుగుల వలిచి వేసెను
పసిడి పసితనమును వెలికి తీయుచు
పన్నా పడవల సొబగుగ ఆడెను
గొడుగుల దాగినా తడిపే సరసం
ఆత్మ లోతులను తడుమునువర్షం !

నింగికి నేలకు వంతెన వేసెను
సప్త వర్ణముల సొగసులు పోయెను
మంచుగ గిరులకు మకుటము బెట్టెను
వడగళ్ళతొ తెలి పూలే పూచెను
రంగుల రంగరించుకు చేసెను
సోలిన జగమున సందడినాట్యం!

సంద్రము నుండి ఎగసిన నీరే
లవణము వీడి జలజల కురిసెను
మన్నూమిన్నూ కలుపుతు ముంచెను
వేసవి గాడ్పులు తీర్చుచు మురిసి,
వాగులవంకల నదులను గూడి,
తిరిగి సంద్రమున కలియుట చోద్యం !

వాన చినుకుల తడియుట తప్పట
రోగాములన్నీ చెంత చేరునట !
రైను డాన్సుల ఎగురుట ఒప్పట ?
మురికి నీట సయ్యాటలు మేలట !
నవీన పోకడల నటనలు నమ్మక
తడిసి పొందుమా మరియొక జన్మం !

***

21, ఆగస్టు 2016, ఆదివారం

//అడ్డుగోడలు//

//అడ్డుగోడలు//
------------------
భావరాజు పద్మిని - 22/816

వేయి కనుల వెన్నెలకి - వర్ణమేదొ వెతుకులాట
కోటి గుండెల హర్షానికి - కులమేదని కుమ్ములాట
పల్లవించు పయనానికి - తల్లివేరు తవ్వులాట
'సింధువైన' బిందువమ్మ - మేఘమేదో తెలపాలట !
రాకెట్టుల కాలంలో, ఓ మనిషీ నీ పయనం ఎటు?

విశ్వమంతా - దేశమంటూ, రాష్ట్రమంటూ, జిల్లా అంటూ,
మండలాలు, పట్టణాలు, పల్లెలుగా విభజించి...
కులాలని, మతాలని, ప్రాంతాలని, జాతులనీ,
తలవెంట్రుక చీలినట్టు చీలిపోవు తరుణాన...
మనిషేక్కడ మరుగాయెనో మరి,
మనిషిని మనిషిగ చూసే...
మనసెక్కడ మరుగాయెనో ?

నీకింతే గాలంటూ, నీకింతే నీరంటూ,
నీకింతే నేలంటూ, నీకింతే తిండంటూ,
కులానికో జగాన్ని, మనిషికింత ముక్కను
గిరిగీసుకునిచ్చాడా, భువిని మనకు విధాత ?



బారెడు దేహంలో, బండెడు మాంసానివి,
యెర్రని రక్తం పారే, సప్తధాతు సౌధానివి,
ఎక్కువేమి తక్కువేమి ఎన్నడూ లేదిక్కడ !
ఉన్నవెన్ని వన్నెలైన వెంటరావు నీతోన,
ప్రాణముంటె శివానివి, లేకపోతె శవానివి
కాలే కట్టెకు కులాలు ఎన్నద్దిన ఒకటేలే !
గూగులమ్మ వేట మాని, గుండెలోన వెతుక్కో !


ఒక్కగొంతు కేక జతగ మరిన్ని కూడి కేరింత,
ఒక్క అడుగు నడకైతె మరిన్ని కలిపి కొత్తబాట,
ఒంటిగొచ్చి ఒంటరిగా వెళ్ళిపోవు జీవితాన,
ఒంటరితనమును తీర్చే ఆసరాయె జనమంతా !
గీసుకున్న గిరులు నిన్ను కుంచించే తరుణాన,
కళ్ళు తెరవకుంటే, కడకు నిన్నూ విభాజిస్తారోయ్,
కట్లు తెంచుకోవోయ్, నీ కుటుంబమే ఈ జగమంతా!

మానవతే మన మతం, కలుపుగోలు మన కులం,
సేవ కొరకె జీవితం, సమతే మన సుగంధం,
మమత పంచుకుంటు పొతే మనుగడ ఇక మధువనే !
స్వార్ధమంటు వీడి చూడు స్వర్గముంది భువిలోనే !
అడ్డుగోడ కూల్చి చూడు అందరుంది నీలానే !
నిన్ను నువ్వు నెగ్గి చూడు అంతా ఇక నీలోనే !



9, జులై 2016, శనివారం

‘దివ్యాగ్ని’ హృదయజ్యోతి

అబ్దుల్ కలాం గారికి తెలుగువారి కవితా నివాళిగా మద్రాస్ విశ్వవిద్యాలయం 'ఒక విజేత ' అనే పుస్తకాన్ని ప్రచురించింది. అందిలో అచ్చైన నా కవిత... మీ కోసం...

‘దివ్యాగ్ని’ హృదయజ్యోతి 
-------------------------
భావరాజు పద్మిని – 1/9/15.

ఎగురుతున్న చిట్టి పక్షిరెక్కల్ని, 
ఆశగా చుసాయా చిన్నారి కళ్ళు.
తనూ రెక్కలు కట్టుకుఎగరాలని, 
గాలిలోకి ఎగిరాయి అతని కాళ్ళు.

అందనంత ఎత్తుకు ఎదగాలంటే,
పేదరికానికి ఎదురొడ్డి పోరాడాలి,
ఉక్కులాంటి సంకల్పబలం కావాలి,
కష్టాలనుంచి శక్తిని మధించాలి,
అణువణువునూ తపన దహించాలి,
స్వీయశిల్పిగా వ్యక్తిత్వం దిద్దుకోవాలి,
మంచినే చూసుకుంటూ సాగిపోవాలి,
హృదయంలో నిజాయితీ ఉండాలి.



లోకం రువ్విన రాళ్ళతో సోపానాలు కట్టి,
‘శక్తై’న వ్యక్తి’ముందు ఓటమే ఓడిపోయింది,
ఏరోస్పేస్ ఇంజనీర్ గా అతన్ని మార్చింది.
‘రోహిణి’, ‘అగ్ని’, ‘పృథ్వి’ క్షిపణులు తీర్చిన,
భరతమాతకు తొలి క్షిపణి అందించిన,
అణ్వస్త్ర రాజ్యాలతో అమ్మను కూర్చోబెట్టిన, 
‘మిస్సైల్ మాన్‘ గా అతనికి పేరు తెచ్చింది.
‘రాష్ట్రపతి’గా జాతి ఆయన్ను గౌరవించింది.
అట్టడుగు నుంచి ఆకాశం వరకూ ఎదిగినా,
పసి హృదయాన్ని పదిలంగా కాపాడుకున్నారు,
కులమతాల హద్దులుదాటిన భారతీయుడయ్యారు,
నిస్వార్దుడిగా ఉండాలనే బ్రహ్మచారయ్యారు,
నిరాడంబరతకు నిలువెత్తు దర్పణమయ్యారు,
అధ్యాపకుడినేనంటూ అందరికీ చేరువయ్యారు,
మనసుల్ని మలిచే స్వదేశీ స్వాప్నికుడయ్యారు,
సహచరుడిగా మెలిగే ఆదర్శనాయకుడయ్యారు,
ఇతరులలోని శక్తిని వెలికి తీసిన స్రష్టయ్యారు.

సుతిమెత్తని హృదయజనితమైన కళాదృష్టి,
వాడిగల మేధోజనితమైన వైజ్ఞానిక దృష్టి,
మానవీయదృక్పధంతో మెలిగిన పరమేష్టి,
ఆయన జీవితమే ఒక గొప్ప సందేశంగా, 
ఆయన జీవితమే ఒక మహా గ్రంధంగా,
అందించి, దేశంకోసం పాటుపడమని చెప్తూ,
ప్రజలమదిలోని నిరంతర చైతన్య స్రవంతి,
ఏ అమరాలోకానికో తరలి వెళ్ళారు.

ఒక్క గుండెలో దీపం వెలిగిస్తే అది,
మరెన్నింటినో ఉద్దీపనం చేస్తుంది.
యువహృదయాల్లో ఈ ఆరని ఈ దివిటీ,
దిక్సూచిగా వారికి మార్గదర్శనం చేస్తూ, 
‘దివ్యాగ్ని’ హృదయజ్యోతిగా జ్వలిస్తూ,
కాలాన్ని జయించిన ‘కలాం’ గా మారి,
చరిత్ర పుటల్లో చిరాయువయ్యింది.

'ఎస్కిమో'వతరణం

'ఎస్కిమో'వతరణం
------------------------
భావరాజు పద్మిని - 3.2.16


కరకరకర చలి ఎముకలు కొరకగ
గజగజ గజగజ తనువులువణుకగ
బిరబిరబిరబిర పరుగులు తీయుచు
చకచచకచక తొడుగుల దూరుచు
వడివడిగ జడియె రదియె కనుము
అభినవ 'ఎస్కిమో'వతరణం.



టకటకటకటక నడుములు పట్టెను
సరసర గాలికి నరములు వాచెను
జరజర నీరే తగిలిన కాల్చెను
చలిపులి దాడికి తపనలు హెచ్చెను
ఉష్ణపు పెట్టెకై తృష్ణయు రేగెను

అజగరముల వలె కదలక నుండుచు
అరగని తిండితొ ఇరుకున పడియుచు
దొరికిన బట్టల నన్నియు కప్పుచు
చరచరచరచర ముసుగులు తన్నుచు
గడబిడ పాట్లవి గండము తీరుగ

దొరలను సైతము దొంగల జేయుచు
ముసుగుల మాటున ముఖములు దాచుచు
మండుటెండకై మనసులు రగిలెను
కాని కాలమున కడగండ్లు పడుచు
ఎస్కేపులేక ఎస్కిమోలే వేచెను.

( మనిషి స్ధబ్దంగా అదే భావనలో ఉండిపోతే ఎలా విసుగొస్తుందో, ఏ ఋతువైనా కొన్నాళ్ళకు బోర్ కొడుతుందేమో. చలికి తాళలేక రాసిన ఈ కవిత, చలికే అంకితం)

ఓ బొమ్మ ఆత్మకధ

ఓ బొమ్మ ఆత్మకధ 
---------------------------
భావరాజు పద్మిని- 13.2.16


నేనొక బొమ్మనే...
జీవం లేని దారాల ముద్దనే...
కానీ, నాకే మాటలొస్తే,
నా కధను చెబుతాను వింటారా?

ఏవేవో దూది పింజలు వడికి
మెత్తని తోలులో కూరి, కుట్టి,
గాజు కళ్ళు, ముక్కు అతికి,
గొలుసులతో ముస్తాబు చేసి,
నన్నేదో అంగడి గదికి పంపారు.

ఒక పాప పిలిస్తే తెలిసింది ...
నన్ను టెడ్డీ బేర్ అంటారట.
మరి నాకంటే ముద్దుగా ఉన్న
పాపేమో పింకీ అట.
తనంత ఎత్తున్న నన్ను,
కొనేదాకా మారం చేసింది.
నాకూ సంతోషమేగా...
నాకో అమ్మ దొరికింది.
బొమ్మకు పాపే అమ్మ కదా!



చాలా బొమ్మలు ఉన్నాయక్కడ,
వాటిలో నేనూ ఒక మూలన.
ఎప్పుడో ఆడేందుకు తీసినా, 
వేరే బొమ్మలతో పోటీనే నాకు.
ఒకరోజు పాలగ్లాసు ఒలికింది,
నా పేరు డర్టీ బేర్ అయ్యింది.
అప్పటిదాకా నా అందాన్ని,
అందరికీ చూపి మురిసిన పాప,
నన్ను తాకడమే మానేసింది.

పాప పుట్టినరోజు వచ్చింది
కొత్త బొమ్మల కొండ మధ్య
నేనో దిష్టి బొమ్మనయ్యాను.
మర్నాడు ఓ బీద బాబుకు 
నన్ను కానుకగా ఇచ్చేసారు,
బాధగా పాపనొదిలి వెళ్ళాను.

అదొక చిన్న పూరిగుడిసె...
అదేవిటో, అసలు బొమ్మలే లేవక్కడ .
ఒక్కగానొక్క బొమ్మనని యెంత అపురూపమో !
స్నానం చేయించేసారు, మళ్ళీ మెరిసిపోసాగాను,
నన్ను చూసిన బాబు కళ్ళూ మెరిసాయి. 
బాబుకు నేనే లోకం ...
పాలు త్రాగే దగ్గరినుంచి, పడుకునే దాకా !
నాకూ పెట్టమంటూ నన్ను చూపేవాడు, 
రోజంతా నాతో మాట్లాడుతూ ఉండేవాడు, 
ఎక్కడికి వెళ్ళినా నన్నూ తీసుకువెళ్ళేవాడు, 
నామీద ఎక్కి కూర్చుని, గుర్రం ఆట ఆడేవాడు, 
నామీదే వాలిపోయి, నిద్రపోయేవాడు, 
మళ్ళీ లేవగానే, నాకోసమే వెతుక్కునేవాడు, 
మాసిపోడం, మళ్ళీ స్నానం చేయించడం...

నల్లబడిపోతున్నాను... 
కుట్లు ఊడిపోయి, దూది బైటికొస్తోంది 
అయినా నా అందంతో వాడికి పనిలేదు 
అవే ఆటలు, అదే ప్రేమ, అవే కబుర్లు. 
పింకీ మనసు మినరల్ వాటర్ అయితే,
మలినాలు ఎన్నున్నా అంటని,
గంగానది వంటిది బాబుమనసు.

నాకు తెలిసిపోతోంది...
నా ప్రాణాలు గాల్లో కలవబోతున్నాయి. 
నాలోని దూదంతా క్రమంగా ఎగిరిపోతోంది. 
కాని, నానుంచి విడివడే ప్రతి దూదిపింజ, 
బాబు ప్రేమతో తడిసినదే !
పుట్టిన ప్రతి ప్రాణి కోరుకునేది ప్రేమేనట !
కణకణమూ ప్రేమతో రాగరంజితమవడమే,
జన్మకు సార్ధకత అని అంటారట !నిజమేనా?
అయితే, నా జన్మా తరించినట్లేగా...
తృప్తిగా లోకానికి వీడ్కోలు పలుకుతూ,
చెత్త మంటల్లో చెత్తగా కాలిపోతూ...
బాబు జ్ఞాపకాలతో హాయిగా వెళ్ళిపోతున్నాను.

( అపురూపంగా చిన్నారులు చూసుకునే బొమ్మలకు ప్రేమతో అంకితం...)