22, ఏప్రిల్ 2016, శుక్రవారం

ప్రాయమెరుగని పసిపాప

ప్రాయమెరుగని పసిపాప
----------------------------
భావరాజు పద్మిని - 23/04/16

పాట పాడేందుకు ఆవిడ పుట్టడంకాదు,
పాటే ఆవిడకోసం పుట్టినట్లు ఉంటుంది.
అందుకేనేమో దైవం ఆవిడ తనువుకేగాని,
గొంతుకు ప్రాయం పెట్టడం మర్చిపోయారు.

పసిపాపలా మాట్లాడి మురిపిస్తుంది,
ప్రౌఢలా గొంతులో వలపునొలికిస్తుంది,
విరహిణిలా మనసును నలిపేస్తుంది,
ప్రణయినిలా స్వరంతోనే కవ్విస్తుంది,
వెల్లువలా 'వెన్నెల్లో గోదార'వుతుంది,
ముదుసలిలా మారి అలరిస్తుంది,
భక్తురాలిగా భగవంతుడిని కరిగిస్తుంది,
సంగీత యోధులకే సవాలవుతుంది.

ఏ రాగాన్నైనా సొంతం చేసుకుంటుంది,
ఏ భావాన్నైనా ప్రాణంతో నడిపిస్తుంది,
ఏ భాషైనా సొంతం చేసుకుపలికేస్తుంది,
కధకు, ఎదకు, వ్యధకు, నటనకు,
గణపతిప్రతిమను చేసిన జగదంబలా,
ఆలంబనగా జీవంపోసే స్వరాంబ ఈమె.
భామలా, బామ్మలా, పసిబొమ్మలా,
పసిడి మనసుతో అందరినీ దోచుకుంది.

'రామ ప్రసాదమైన' ఈ అమ్మజానకి,
రాముని కొలువులో అరుణకమలమై,
రాముడు జానకిలో లయమవగానే,
తన మనసురంగు వలువల్నిధరించింది.
అవునండీ! ఈ అమ్మ మనసు తెలుపు,
స్వచ్చతకు ప్రతిరూపమీ శ్వేతకమలం.
అందుకే అంతా అయ్యారీమెకు దాసోహం.తియ్యగా మధురవంలా పలుకరిస్తూ,
గలగల గోదారిలా నిండుగా నవ్వుతూ,
సమభావనతో అందరినీ ఆదరిస్తూ,
ఎదిగినా ఒదిగిఉండడమే తత్వమని,
ఆచరణతో నడవడి చూపించింది.
పెట్టే పెద్దచెయ్యితో మౌనగీతంలా,
ఎందరినో అజ్ఞాతంగా ఆదుకుంది.

ఓంకారమే గానమని నమ్మింది కనుక,
పాటను దైవంగా ఆరాధించింది కనుక,
ఆస్తమానైనా సవాలు చెయ్యగలిగింది.
కష్టాలు ఎదురైనా పాటను వదలద్దని,
గానం గాయకుల మనసు ఆర్ద్రతతో,
శ్రోతల గుండెను తడిపే ప్రాణదీపమని,
కొత్త తరానికి గొప్ప సందేశమిచ్చింది.

సారస్వతాన్ని,స్వరంతో సర్వస్వాన్ని,
గెలుచుకున్నఈ ప్రత్యక్ష సరస్వతి...
ముత్యానికి ముస్తాబెందుకనేమో,
పద్మానికి "భూషణం" వద్దనేసింది.
"అజాత శత్రువ"ని పేరుపొంది,
గుండెగుండెను గెల్చుకున్నఈమె,
గొప్ప పెన్నిధులున్నమహారాణి !

పాటతోనే సమ్మోహితుల్ని చేసే,
మా తెలుగింటి వసంతపు"స్వరరాణి"
నిండునూరేళ్ళు నవ్వుతూ జీవించాలని,
స్వరంతో మనసుసంతకాలు చేసి,
పాటను చిరంజీవిగా దీవించాలని,
ప్రతిమనసు ఆశిస్తూ అభినందిస్తోంది,
పుట్టినరోజు శుభాకాంక్షలు కోకిలమ్మ!


('కలైమామాణి' తెలుగింటి కోకిలమ్మ 'జానకమ్మ' కు పుట్టినరోజు సందర్భంగా భక్తితో అంకితం.)

21, ఏప్రిల్ 2016, గురువారం

తోట మూగవోయింది

తోట మూగవోయింది
-------------------------
భావరాజు పద్మిని- 21/4/16

ఆ రెండు చేతుల స్పర్శ మాకింకా గుర్తే...
నిమ్నమైన గడ్డిని, ఉన్నతమైన వృక్షాల్ని,
భేదభావం లేకుండా తాకిన చేతులవి...
సృష్టికి ప్రతిసృష్టి చేసే మరోబ్రహ్మ వంటి,
పచ్చదనాన్ని పాతే కృషీవలుడి చేతులవి...
మీరంతా ఏవో భాషలు గొప్పవంటారు కానీ,
మా మౌనాన్ని కూడా చదివిన చేతులవి...

ఎక్కడో తుప్పల్లో పడున్న మమ్మల్నిపీకి,
భద్రంగా పొదువుకుని తెచ్చిన చేతులవి...
ఎదిగేందుకు తగినంత స్థలం చూపి,
లోతుగా మట్టిలో నాటిన చేతులవి...
నారుపోసిన వాడే నీరు పొయ్యాలని,
అనుక్షణం కాపాడుకున్న చేతులవి...

చీడపీడలు, వేరు పురుగులు మమ్మల్ని
నిలువెల్లా తొలిచేందుకు ప్రయత్నిస్తే,
తనకే చీడపట్టినట్లు దిగులుపడిపోయి,
మందులతో చికిత్స చేసిన చేతులవి...
కలుపుమొక్క మా సారాన్ని పిండుతుంటే,
పెకిలించి, తృప్తిగా నిట్టూర్చిన చేతులవి...కొమ్మకో రెమ్మ వేస్తూ ఎదుగుతుంటే,
లేతాకుల్లో లేనవ్వుల్నినిమిరిన చేతులవి...
అప్పుడో ఇప్పుడో ఓ పువ్వు పూస్తే,
అపురూపంగా తడిమి మురిసిన చేతులవి...
భూమిని దున్ని, ఎరువులు తెచ్చివేసి,
తన చేతికి ఆశుద్ధాన్ని అలముకుని,
మాకు కొత్తఊపిరి పోసిన చేతులవి...

ప్రకృతి సవాళ్ళను మొండిగా ఎదుర్కుంటూ,
జీవకోటికి ఊపిరి పొయ్యమన్న చేతులవి...
అందరూ మాలో పైనున్నవసంతాన్నిచూస్తే,
లోలోని దాహార్తిని మౌనంగానే గమనించి,
కడుపు నిండేదాకా నీళ్ళు పట్టిన చేతులవి...
వేలెడంత మేము ఆకాశమంత ఎదిగితే,
మామధ్య మహారాజులా దర్పంగా తిరుగుతూ,
నిండు మనసుతో దీవించిన చేతులవి...

అన్నదానం గొప్పదని చెబుతుంటారు...
మరి మాకు, మావల్ల మీకు ఊపిరి పోసి,
రుధిరాన్నిహరితంగా మార్చి తరించాడు...
చమటోడ్చి పట్టెడు మెతుకులు తిన్నాడు...
అలుపెరుగని అలలా ఆ నిత్యశ్రామికుడు
చివరి క్షణందాకా పనిచేస్తూనే ఉన్నాడు.
తాను మౌనంగానే నిష్క్రమించాడు...

అమ్మ లేని అనాధల్లా, అల్లాడుతూ,
కదలలేని మేము, మా నెచ్చెలి చెట్లూ,
ఆ ఆత్మశాంతికై మౌనం పాటిస్తున్నాము.
మేఘమా, ఆ ఆర్తితీరేలా కరుణించి వర్షించు,
మేము తలంటు పోసుకుని, శుద్ధమవ్వాలి.
మూగవోయిన తోట చక్రవాకం పాడుతోంది.
పనే దైవమని నమ్మిన ఆ పుణ్యాత్ముడ్ని,
అక్కున జేర్చుకోమని దైవాన్నిఅర్ధిస్తున్నాము.
మళ్ళీ జన్మంటూ ఉంటే, మేమే అతనిగా పుట్టి,
అతనిలో హరితనందనాన్ని నింపిచూస్తూ,
ఋణం తీర్చుకోవాలని ప్రార్ధిస్తున్నాము.


(నిన్నటిదాకా తోటలో ఆరోగ్యంగా పనిచేసుకున్న మా ఫ్లాట్స్ తోటమాలి, నిన్నహఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మాకీ వసంతాన్ని పంచి తాను శిశిరంలో పండుటాకులా రాలిన అతనికి కృతజ్ఞతాపూర్వక అశ్రునయనాలతో ఈ కవిత అంకితం... ఒక్కక్షణం... కవిత రాసి సరిపెట్టేసారా, అనకండి. కుటుంబానికి నా వంతుగా కాస్త ధనసాయం చేసాను... అంతకు మించి... రోజూ శివాలయం శుభ్రం చేసి, అభిషేకానికి నీళ్ళుపెట్టి, క్రింద పడ్డ నీళ్ళను తుడిచి వస్తాను. ఒకవేళ ఇందులో పుణ్యం ఏదైనా ఉంటే... అదీరోజుకి మా తోటమాలి ఆత్మకు ప్రసాదించమని, అతనికి ఉత్తమ జన్మ కలిగించేలా కరుణించమని, ఆ శివుడిని వేడుకున్నాను. అంతా ఆయన దయ. )

17, ఏప్రిల్ 2016, ఆదివారం

అల్పం కాదు అనల్పం

అల్పం కాదు అనల్పం
-----------------------------
భావరాజు పద్మిని - 18/4/16

ఆఫ్ట్రాల్ గడ్డిపరక...
పీకి పారేస్తే పోలా !
అని మనం అనుకుంటాం.
కాని...
పీకి పారేసినా, వడిలిపోయినా,
ఆశ వేళ్ళల్లో ఎండనంతవరకూ,
చిన్నమట్టికణానికై అన్వేషిన్తుంది.
ఊతం దొరికిందా...
జీవాన్నిమళ్ళీ నాటుకుంటుంది,
కణకణంలో సత్తా నింపుకుంటుంది,
చైతన్యం సంతరించుకుంటుంది,
పచ్చని పచ్చికగా పరుచుకుంటుంది.

అలాగని... గర్విస్తుందా?
తాను నలుగుతున్నా, ఎన్నోపాదాలకు,
తివాసీ పరచి, తలొగ్గి తృప్తిపడుతుంది.
అల్పమనుకున్న గడ్డిపరకల్లో కూడా,
ఎంతటి ఉదారత ?
అందుకే... వానచినుకు మకుటమవుతుంది.
గాలివీవెన బదులుగా సేదదీరుస్తుంది.
పువ్వుల్లో అధమం బంతిపువ్వు,
తోరణంలో భాగమవుతుంది కాని,
స్వామి మెడలో హారం కాలేదు.
అందుకే పండక్కే తెచ్చుకుంటాం,
వడిలాకా విసిరి పారేస్తాం.
కానీ,
వడిలినా ఎంత పంతమో!
పువ్వులోని ప్రతి రెక్కను,
సైన్యంగా మలచుకుంటుంది.
రెక్కకొక మొక్కకు జన్మనిచ్చి,
మొక్కకు బుట్టెడు బంతులిచ్చి,
అవనికే నవవసంతాన్నితెస్తుంది.
విసిరి పారేసినా, విసుగు పుట్టదా?
బహుశా, ఇదొక ప్రకృతి పాఠమేమో!

హ, దూదిపింజ! గాలేస్తే ఎగిరిపోతుంది!
గమ్యం లేని ప్రయాణం దానిది.
ఘనమైన మనముందు అదెంత?
కాని నేస్తమా,
ఆ దూది పింజే...
మరో పదినేస్తాల్ని కలుపుకుని,
దారమై, కలనేతలో వస్త్రమై,
రంగుల్ని నీకోసం పులుముకుని,
నీ ఒంటిని కప్పుతోందని మర్చిపోకు !

ఇప్పుడు అర్ధమయ్యిందా !
సృష్టిలో అల్పమైనది ఏదీ లేదు.
అల్పమని భావించే ప్రతీదీ అనల్పం,
దాని శక్తి ఊహాతీతం...
అల్పత్వం ఉన్నది, ప్రకృతిలో కాదు,
చూసే మన కళ్ళలో...
ఆ అపోహల్ని తొలగించుకున్ననాడు,
అల్పమైనవన్నీదివ్యమైనవిగా గోచరిస్తాయి!
ఇదే తిరుగులేని జీవిత సత్యం !

(ఉదయాన్నేకొత్త సత్యాన్ని బోధించిన అమ్మ ప్రకృతికి అంకితం...)

12, ఏప్రిల్ 2016, మంగళవారం

అంబరాన్నంటిన సంబరం

అంబరాన్నంటిన సంబరం
------------------------------
భావరాజు పద్మిని - 12/4/06

ఒక మౌనప్రభాతం...
కలల వాకిళ్ళను మూసి,
మనసు కన్నులు తెరిచి,
ప్రకృతి ముంగిట నిలిచాను.

ఝుమ్మని చుట్టేసింది...
తుంటరి మలయసమీరం.
సంపెంగల వాసనేమో,
తనతో మోసుకొచ్చింది.
అలా వెళ్లివద్దాం రా, అంటూ
నన్నూ తనతో తీసుకుపోయింది .

అలా వెళ్ళిన నేను...

రాత్రంతా వెన్నెల తరగల్లో తడిసిన
కొబ్బరాకులలో గుసగుసగా మారాను.

పూల రెక్కల సింహాసనంపై దర్జాగా కూర్చున్న
హిమబిందువులో ఇంద్రధనసై మెరిసాను.విరితేనెల మధురిమలన్నీ మౌనంగా దోచే,
భ్రమర నాదంలో చేరి రవళించాను.

పచ్చని పచ్చిక తివాసీని సుతారంగా తాకి,
గడ్డిపూల సోయగాలలో ఒదిగిపోయాను.

ఎక్కడో కొండ లోయల్లో ప్రతిధ్వనించే
శుకపికాల కలరవాల్లో కరిగిపోయాను.

నింగికెగసే గువ్వల రెక్కల్లోని ఆశగా మారి,
దిగంతాల వైశాల్యాన్ని సవాలుచేసాను.

మేఘాల గుండెల్లో బరువైన రాగాన్నై,
కొండల్నిఢీకొని చినుకుగా నేలకు జారాను.

జలజలా జాలువారే జలపాత గీతికలో,
నేనూ ఒక బిందువునై పరుగులుతీసాను.

నదుల గుండెల్లో వలపుసడినై,
సంద్రపు అలల్లో తెలినురుగునై,
ఇసుక తిన్నెలతో ఊసులాడుతూ,
గ్రీష్మ తాపానికి మళ్ళీ ఆవిరయ్యాను.
మలయపవనంలో కలిసి తేలిపోయాను.

అరె...
నేనింకా ఇక్కడే ఉన్నానా?
అయితే...
రవాన్నై, వనాన్నై, స్వనాన్నై,
రాగాన్నై, గీతాన్నై, నాదాన్నైన,
ఈ సందడంతా, ప్రకృతి లాలిత్యానికి,
అంబరాన్నంటిన నా సంబరానిదా?
అవునంటూ, మేనుతాకిన సమీరం,
మళ్ళీవెళ్దాం వస్తావా, అంది చిలిపిగా!

(సమస్త సృష్టిని మైమరపింపచేసే ముగ్ధప్రకృతికి ఈ కవిత అంకితం...)