15, అక్టోబర్ 2014, బుధవారం

నన్నూ బ్రతకనివ్వండి !

నన్నూ బ్రతకనివ్వండి !
 ---------------------
భావరాజు పద్మిని 

నేనే... అబలని...
అమ్మాయిని... ఆడపిల్లని... 
నీ ఉనికికి మూలాన్ని...
నీ ఇంట్లో అమ్మగా, తోబుట్టువుగా,
నీ ఒంట్లో రక్తంగా ప్రవహిస్తోంది నేనే !
అయితే మృగాళ్ళ మధ్య ఎన్నాళ్ళు 
బ్రతికుంటానో... నాకే తెలీదు...
ప్రతీక్షణం జీవన్మరణాల పోరాటమే !

కడుపులోనే ప్రాణం తీస్తారొకరు 
పురిటిలోనే ఎత్తుకు పోతారొకరు 
గొంతులో బియ్యపుగింజ వేస్తారొకరు 
చిట్టి పాపానే పాడుచేస్తారొకరు
అమ్మాయిని అపహరిస్తారొకరు
స్కూల్లో డేగకళ్ళతో వేచిఉంటారొకరు
బెదిరించి లొంగదీసుకుంటారొకరు 
ఎక్కడో మాటువేసి కాటేస్తారొకరు 
ఉద్యోగాల్లో వేధించి పీక్కుతింటారొకరు 
ఇంటికే వచ్చి కత్తితో భయపెడతారొకరు 
ఇంకెక్కడి భద్రత ? ఏదీ నాకు రక్షణ ? 



ఎంతటి గొప్ప సంగతి !
స్త్రీని దేవతగా పూజించే దేశంలో...
స్త్రీని నిలువునా తగలబెడుతున్నారు 
ఆసిడ్ పోసి ఒళ్ళంతా కాల్చేస్తున్నారు 
గొంతు నొక్కి పూడ్చేస్తున్నారు 
గొంతు కోసి పారేస్తున్నారు 
పొడిచి పొడిచి చంపుతున్నారు 
పైశాచికంగా చెరుస్తున్నారు 
ప్రేమో, పెళ్ళో,పగో, కోరికో... 
పేరు ఏదైతే నేమి ?
ఆటవికంగా తీసేది నా ప్రాణమే !

అవున్లే... కామం కమ్మిన వీళ్ళ కళ్ళకు 
పురుటి బిడ్డైనా ,అమ్మాయైనా, అవ్వైనా ఒకటే !
కొలతలే తప్ప మాలో కలతలు కనబడవు 
మాంసపు ముద్దలు, మెరుగులు తప్ప  
మాలోనూ మనసుందని కనబడదు  
మాకంటూ ఆశలు, ఆశయాలు ఉండవా ?
మాకూ జీవించే హక్కు లేదా ?
మొగ్గలోనే త్రుంచి చీల్చి వినోదించే 
మీరూ అసలు మనుషులేనా ?
చట్టాలు మీ చుట్టాలే కదా !
ఇంకెన్నాళ్ళు ఈ బలవన్మరణాలు ?

అన్నా ! బావా ! బాబాయ్ ! తాతా !
జంతువులైనా తమ జాతినే చంపవు 
పాము కూడా పామును కరవదు...
పులి పులిని వేటాడి పీక్కు తినదు ...
క్రూర జంతువులకైనా లేని కక్ష్య ...
రక్తమాంసాలు పీల్చే కర్కశత్వం ...
అణువణువూ చీల్చే కఠినత్వం 
విసిరి పారేసే కిరాతకత్వం ... 
మనుషుల్లో ఉండడం సిగ్గుచేటు !
ఇకనైనా మేల్కోండి ... ఆలోచించండి...
మమ్మల్ని బ్రతకనివ్వండి !

(ఎన్ని చట్టాలు వచ్చినా... రోజురోజుకూ ఆడపిల్లల స్థితి దయనీయంగా మారుతోంది... ఈ కవిత చదివి, ఒక్క రాతి మనసు మారినా... ఈ అక్షరాలు ధన్యమైనట్టే... ఆలోచించండి... మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే ఆడపిల్లల్ని మీ పిల్లల్లా ఆదరించి కనిపెట్టుకు ఉండండి...)

8, అక్టోబర్ 2014, బుధవారం

శ్రీగురుని చరణాలు

శ్రీగురుని చరణాలు - గేయం 
----------------------------------
భావరాజు పద్మిని - 08/10/2014

శ్రీగురుని చరణాల భజియించు మనసా !
శ్రీధరుడే శరణని స్మరియించు మనసా !

గురు రూపమున నుండు సకల దేవతలు 
గురు వాక్కున నుండు సకల మంత్రాలు 
గురు పాదుకలనుండు సకల తీర్థాలు 
గురునెరింగిన జన్మధన్యమే మనసా !

గురు వరద హస్తమే భవరోగహరణం 
గురు రక్ష కవచమే ఆపన్నివారణం 
గురు కృపా దృష్టియే భవసాగర తరణం 
గురుసేవతో నీవు తరియించు మనసా !

గురు దర్శనమే నీకు శుభదాయకం 
గురు బోధలే నీకు మధు సేవనం 
గురు నామమే నీకు శుభ తారకం  
గురు సన్నిధే సిసలైన పెన్నిధే మనసా !



6, అక్టోబర్ 2014, సోమవారం

నిన్ను చేరాలని...

నిన్ను చేరాలని...
---------------------
(భావరాజు పద్మిని – 06 .10. 2014 ) 

నేనే... యువరాజు ఖుర్రం ను...
అక్బర్ ముద్దుల మనవడిని..
జహంగీరు ప్రియ పుత్రుడిని ...
ఉగ్గుపాలతో పాలన ఔపాసన పట్టాను 
'ప్రపంచపు రాజు ' నని పేరు పొందాను 
చక్రవర్తిని అయిన నా పరిపాలనం ...
మొఘల్ సామ్రాజ్యానికి స్వర్ణ యుగం .

నీవు... అర్జుమంద్ బాను బేగం..
19 వ ఏట నన్ను పెళ్ళాడావు.
నా అర్ధాంగివి,అర్దానివి నీవే అయ్యావు
పాలనలో,మంత్రాంగంలో అండగా నిలిచావు 
రూపం, సుగుణం, యుక్తితో మురిపించావు 
మహలుకే మేటిగా విజ్ఞులనే మెప్పించావు 
'ముంతాజ్ మహల్' గా పేరు పొందావు 


నా కోసం 14 సార్లు నీ ప్రాణం పణంగా పెట్టావు 
14 వె సారి 30 గంటల ప్రసవ వేదన...
చూడలేక నా గుండె లోతుల్లో అరణ్యరోదన ...
ఎన్ని దానాలు చేసామో, ఎన్నిమార్లు ప్రార్ధించామో,
గాలిలో దీపంలా నీ ప్రాణం కొట్టుమిట్టాడుతుండగా 
'అద్భుత సౌధాన్ని' సమాధిగా కట్టించమన్నావు
నీ ఆత్మదీపం నన్ను వీడి అల్లాహ్ ను చేరుకుంది.



రాజస్తాన్ నుండి వచ్చిన తెల్లటి పాలరాయిలో 
28 రకాల రత్నాలు, రత్నఖచితాలు పొదిగారు 
బుఖరా ,సిరియా, పర్షియా, శిల్పులు పిలువబడ్డారు 
అహర్నిశలూ మలచి, ఖురాన్ మంత్రాలు చెక్కారు
37 మంది సృజనాత్మక బృందం మేలి వన్నెలద్దారు
20 వేల శ్రామికుల 22 ఏళ్ళు చెమటోడ్చి కష్టించారు 
పర్షియన్ హిందూ ఇస్లాం శైలితో నగిషీలు దిద్దారు 
అత్యంత సుందరమైన సమాధికి ఆకృతి నిచ్చారు.

వెన్నెల్లో వెండి వెలుగులతో ,
వేకువలో పసిడి జిలుగులతో,
మలిసంధ్యలో నారింజ వన్నెతో,
వానలో జలతారులా మెరుస్తూ,
నల్లటి యమున అలల చిత్రంపై,
తెల్లటి మేఘంలా దోబూచులాడుతూ ,
రమ్యమైన పాలరాతి ప్రేమ సౌధం,
చరిత్ర పుటల్లో ప్రేమ మందిరమయ్యింది. 

కాని, 
మన మూడో కొడుకే ముక్కంటి అయ్యాడు,
ఆగ్రా కోట మిద్దె గదిలో నన్నునిర్బందించాడు.
అనారోగ్యంతో, అసహాయతతో ఉండిపోయాను...
కిటికీ సందుల్లోంచి నా చూపంతా నీవైపే...
చార్ బాగ్  మధ్యన ప్రేమ సౌధం వంక చూస్తూ,
ప్రేమకే నిర్వచనంగా నిలిచిన నిన్నే తలుస్తున్నాను.

జానేమన్...
ఈ లోకంలో రాతి మనసుల తాకిడికి,
ఎంతో మంది సజీవ సమాధుల్లా బ్రతుకుతారు .
కానీ నువ్వు...
బ్రతుకే ఒక నందనవనం చేసావు..
గతించినా ప్రేమకు అమరత్వాన్ని ఇచ్చావు.
తాజ్ మహల్ లో గొప్పతనమంతా , 
మిరుమిట్లు గొలిపే నైపుణ్యానిది కాదు,
మేలి ముత్యం వంటి నీ ఆత్మశక్తిది.

అందుకే...
నీ సమాధి పైనే దృష్టి పెట్టి 
తుది శ్వాస విడుస్తున్నా...
ఎడబాసిన నిన్ను చేరాలని...
ప్రేమ సౌధంలో ఏకమై నిలవాలని...

( తాజ్ మహల్ పై , షా జహాన్ జీవితంపై ,అనేక కధనాలు, వివాదాలు ఉన్నాయి. అయినా అది విశ్వానికి ఒక ప్రేమ సౌధం... వారి గాధకు అక్షర రూపం ఇవ్వాలనే ఈ చిన్ని ప్రయత్నం ...)