19, డిసెంబర్ 2014, శుక్రవారం

వృక్ష గీతం

వృక్ష గీతం 
-------------
భావరాజు పద్మిని - 20/12/14 

మాట్లాడే మనసు, వినే హృదయం ఉంటే...
వృక్షాలు  కూడా మాట్లాడతాయట ...
మీరూ వింటారా...

ఉదయాన్నే టీ త్రాగుతూ 
బాల్కనీ లో నిలబడి ఉన్నాను.
నాలో ఏ భావాలూ లేవు...
శూన్యం, అనంతమైన శూన్యం...
ఎదురుగా ఉన్న పైన్ చెట్లను 
తదేకంగా చూడసాగాను...

మంచుకు తడిసిన పైన్ చెట్టు నుంచి 
రివ్వున వచ్చిన  మలయసమీరం 
సుతారంగా, అమ్మ స్పర్శలా తాకి 
ఆత్మీయంగా చెక్కిలి మీటింది...

ఎంతుకంత నిర్లిప్తత ? 
ఎందుకా భావశూన్యత ?
నేనూ నిల్చున్నా నీలాగే...
ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే, ఇలాగే...అంకురం దశనుంచే నా సమరం ఆరంభం,
నాలోని జీవాన్ని బహిర్గతం చెయ్యాలని,
ఒక్కొక్క మట్టి కణంతోనూ పోరాడాను...
వాటిని చీల్చుకు రాగానే ముందుగా...
నేలతల్లికే తలొంచి నమస్కరించాను.

మొక్కగా ఎదుగుతున్న దశలో,
ఎగసి వచ్చే నాలోని జీవాన్ని చంపాలని,
ఎన్ని ఎడతెగని ప్రయత్నాలో...
మండుటెండ నా ప్రాణాన్ని పీల్చింది, 
సుడిగాలి నా కొమ్మల్ని తెంపింది,
జోరువాన నన్ను ముంచేసింది...
అయినా నేను రాజీపడలేదు...

ఒక్కో జీవకణాన్ని ఒక్కో సైనికుడిగా 
ఒక్కో ఆకునీ ఒక్కో బ్రహ్మాస్త్రంగా మార్చి,
సవాళ్లకే ఎదురుదెబ్బ కొట్టాను...
బలంగా, ధృడంగా చెట్టుగా ఎదిగాను.


ఇప్పుడు నాపైకి ఎన్నో పిట్టలు వాలతాయి 
కొన్ని సందడి చేస్తాయి, కొన్ని రెట్టలు వేస్తాయి 
ఉడుతలు, చిన్న చిన్న జీవాలు, ఎన్నో...
నా నీడలో ఆశ్రయం పొంది...
ఎప్పుడో అప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతాయి.

అయినా నేను ఆలోచించను,
రాలే ఆకులైనా, వేసే చిగురులైనా నాకొక్కటే.
విధాత ఆజ్ఞ ఉన్నంతవరకూ నిలవాలి,
ఇలాగే ధృడంగా, అంబరాన్ని తాకుతూ!
అందుకే అవరోధాల్ని అధిగమించు...
ఆశ చిగురులు తొడిగి, పరిమళించు.

ఈ విశాల సృష్టిలో తలెత్తుకు నిల్చోవాలంటే, 
నీ తలదించి వినోదించాలన్న ప్రతీ దానితో,
నిబ్బరంగా అనుక్షణం పోరాడాల్సిందే !
ఒక గొప్ప ఆశయం కోసం నిలబడాల్సిందే !
అందుకే నీకు బాధ కలిగినప్పుడల్లా ,
నన్ను చూసి స్పూర్తి తెచ్చుకో, 
అలుపెరుగక పోరాడుతూ, ముందుకు సాగిపో !


18, డిసెంబర్ 2014, గురువారం

నేనొక జీవనదిని

నేనొక జీవనదిని 
--------------------
భావరాజు పద్మిని - 18/12/14

నేనొక జీవనదిని...
సవాళ్ళనే ఎత్తైన కొండల్నీ,
అడ్డంకులనే లోతైన లోయల్ని,
ఒంటిగా తెగించి దాటుకు మళ్ళుతూ,
అంచెలంచెలుగా ముందుకు సాగే...
మౌన సజీవ స్రవంతిని.

కొందరు నన్ను నదీమతల్లి అంటారు...
చెయ్యెత్తి మొక్కి, హారతులు ఇస్తారు...
కొందరు నా మొహమ్మీదే ఉమ్మేస్తారు..
కొందరు నా పైకి రాళ్ళు విసురుతారు...
ఏదీ ఇమ్మని అడగలేదు, అందుకే...
అదైనా ఒకటే, ఇదైనా ఒకటే నాకు.కొత్తగా వచ్చి చేరతాయ్ కొన్ని పాయలు 
విడిపోయి వెళ్తుంటాయ్ కొన్ని పాయలు 
దుడుగ్గా దూకి నొప్పిస్తాయ్ జలపాతాలు  
వచ్చాయని పొంగను, పోయాయని కుంగను 
పయనమే శ్వాసగా నడిచే పాదచారిని,
గమనమే బాసటై కదిలే బాటసారిని.

దాహార్తి తీర్చినప్పుడు దేవతని,
పైరుకు జీవాన్ని అందిస్తే అన్నపూర్ణని,
ఉద్వేగాల ఉప్పైనై ముంచితే దెయ్యాన్ని,
గుండె మండి ఎండితే మురుగునీటి చెలమని,
ఏదైనా, ఏమన్నా...
చూసే కళ్ళలో తేడా, కాని నేనెప్పుడూ ఒక్కటే !

నేటి 'యూస్ అండ్ త్రో ' తరంలో 
ఏరు దాటేదాకే ఏ బంధమైనా...
మందుల మీద బతికే మనుషుల బంధాలకు కూడా,
ఆ మందుల్లాగే ఇప్పుడు ఎక్ష్పైరీ డేట్లు ఉంటాయేమో!
అందుకే నాలో సుడిగుండాలున్నా గర్భంలోనే దాచి,
గట్టు దాటే ఉద్వేగాలను గుండెలోతుల్లోనే అదిమి,
సాగిపోతూనే ఉంటాను...

నా గమ్యం ఒక్కటే...
ఏ నాటికైనా ఆ విధాత పాదాలు కడిగాలని,
మలినాలని, పాపాలని, ప్రతి జీవ కణాన్ని,
ఆనందంగా మోసుకెళ్ళి ఆయనలో లయమవ్వాలని, 
సంద్రం వంటి ఆయన స్పర్శతో పునీతమవ్వాలని !


4, డిసెంబర్ 2014, గురువారం

వేకువ గీతం

వేకువ గీతం 
----------------
భావరాజు పద్మిని - 5/12/14

చీకటి కాటుక రెప్పలు తెరిచి 
వేకువ కాంత కొత్త వెలుగులు స్వాగతిస్తోంది. 

తెలిమబ్బుల పరదాలు తీసి,
తొలిపొద్దు నుదుట తిలకం దిద్దుకుంటోంది .

మంచుముత్యాల్లో స్నానమాడిన ప్రకృతి 
మిసిమి పచ్చ చీర కట్టుకుని పరవశిస్తోంది.

గూటిలో దాగిన చిట్టి గువ్వలన్నీ 
రెక్కలతో దిక్కులు దాటేందుకు సన్నద్ధమయ్యాయి.

ప్రతిరోజూ  సృష్టి  మౌనంగానే పోరాటం చేస్తోంది,
చీకటితో, మబ్బు తెరలతో, అవరోధాలతో.లే నేస్తమా...
మరో ఉదయంలో తడిసి ముద్దయ్యి, 
నీ హృదయానికి కొత్త ఊపిరి పోసుకో. 


అదిగో నవోదయం పిలుస్తోంది,
కొత్త ప్రస్థానానికి నాంది పలకమంటోంది,
కలలను సాకారం చేసుకోమంటోంది.

కదులు నేస్తమా !
సవాళ్లకే సవాలుగా మారు...
ఓటమికే గెలుపు చూపించు ...
నవలోకానికి ద్వారాలు తెరిచి,
సంకల్పమే సాయుధంగా తలచి,
నీకున్న సత్తా నిరూపించు.