25, ఆగస్టు 2012, శనివారం

తొలకరికి స్వాగతం!


తొలకరికి స్వాగతం! మబ్బూ మబ్బూ ఆకాశంలో అల్లుకుని,
నింగికి అందాల నీలి ముసుగు కప్పితే,
మెరుపుతీగల జిలుగు వెలుగులతో,ఇదిగో, నే వస్తున్నా, అనే సంకేతంతో,ఎదలోని ఆర్ధ్రతని చినుకులుగా కురిపిస్తే,నేల, ఆ అమృత ప్రణయ వాహినిని--ఆత్రంగా అందుకుని, భద్రంగా పొదువుకుని,తన పులకింతను మట్టివాసనగా మార్చి,చల్లటి మలయ సమీరంతో పంపితే--చంచలగా పురివిప్పిన ప్రతి మనసు,మధురంగా స్పందించి, పరవశిస్తూ ఆహ్వానిస్తుంది,తొలకరికి స్వాగతం!

10, ఏప్రిల్ 2012, మంగళవారం

నిరీక్షణనిరీక్షణ 


అలకు తెలుసు......

ఎంత ఎగసి అలసినా, ఆకాశాన్ని అందుకోలేదని.

చకోరికి తెలుసు.....

చంద్రుడిని ఎంత ప్రేమించినా చేరుకోలేదని.

నెమలికి తెలుసు.....

ఎంత పురివిప్పి నాట్యమాడినా, మేఘాన్ని తాకలేదని .

కోయిలకు తెలుసు,

ఎంత ఆర్తిగా పాడినా, వసంతం తనకోసం ఆగదని.

అయినా నిరీక్షణ....


ఏదో ఒక రోజు...

సునామి వచ్చినప్పుడయినా  అల ఆకాశాన్ని అందుకోగలదని,

వెన్నెల కిరణాలనయినా త్రాగి  చకోరి వలపు పండించుకోవాలని, 


వెండి వానలో తడిసయినా నెమలి మనసు నిండుకోవాలని,


ప్రతి వసంతానికై నిరీక్షిస్తూ, పాడుతూ, కోయిల గొంతు మూగబోవాలని.


నిరీక్షణ ఆశగా, శ్వాసగా  కడతేరిపోవాలని.9, ఏప్రిల్ 2012, సోమవారం

రాతి మనసు


రాతి మనసు 


ప్రియా...

అకాల వసంతానివై వచ్చావు,

అనంత శిశిరాన్ని మిగిల్చావు.

ఉదయ భాస్కరునిలా వచ్చావు,

చిక్కటి నిశీధి మిగిల్చావు.

పున్నమి వెన్నెలవై  వచ్చావు,

అమావాస్య చంద్రుడై కనుమరుగయ్యావు.

ప్రియా..

బండరాతిలోని నీటి లాంటి నీ మనసు, 

నీ హృదయాన్ని తడపదు- మరెవ్వరి దాహం తీర్చదు.

నీటి మీది రాత లాంటి నీ ప్రేమ,

నీకూ అర్ధం కాదు -రాసే చేతికి మమత పంచదు.

నీ కోసం ఆరాటం, ఎండమావి.

నీ ప్రేమ కోసం నిరీక్షణ, వృధాప్రయాస.