21, నవంబర్ 2015, శనివారం

గెలుపొక లెక్కా ?

గెలుపొక లెక్కా ?
--------------------------
భావరాజు పద్మిని - 22/11/15 

ఎప్పుడైనా ఉదయాన్ని గమనించారా ?
రాత్రంతా చీకటితో పోరాడి,
కొన ఊపిరిని  కూడదీసుకుని,
చావో రేవో తేల్చుకోవాలని,
ఆఖరిపోరు కోసం సిద్ధమైన,  
సైనికుడిలా ఉంటుంది నాకు.

కాస్తంత గెలుపు ఛాయలు కనబడగానే,
తనలోని వెలుగనే చైతన్యాన్ని ...
కొండాకోనల్లో, చేట్టూచేమల్లో,
నదీనదాల్లో, నట్టడవుల్లో,
సృష్టిలోని అణువణువునా నింపి,
తృప్తిగా చూసుకుని నిట్టూరుస్తుంది.

నీటి అలలల్లో వేయి తళుకులై,
తనను చూసుకుని మురిసిపోతుంది.
చిగురుటాకుపై మంచుబిందువులో,
హరివిల్లై అనేక రంగులతో ప్రభవిస్తుంది.
మబ్బులమాటున దోబూచులాడుతూనే,
మౌనంగా జగతిలో వ్యాపిస్తుంది.


చీకట్లనే చీల్చడమే కాదు, 
మంచు తెరల్నీ కరిగిస్తుంది.
అంధకారంలో ఉన్న జగతికి,
అదే చెయ్యిపట్టి దారి చూపుతుంది.

తన ఆత్మజ్యోతిని వెలిగించుకుని,
ఇతరులకి వెలుగులు పంచగల,
ప్రతివ్యక్తీ ఒక కాంతి పుంజమే,
కదిలే ఉదయభానుడి తేజమే.
ఒక్క గెలుపుతోనే వెలుతురు ఆగదు,
మరోరోజు మరో పోరాటానికీ సిద్ధం.

వెలుతురు మనకు ఆదర్శమైతే,
ప్రతిరోజూ కొత్త పుట్టుకే అనుకుని,
మనలో చైతన్యాన్ని నింపుకుని,
చివరిదాకా ప్రయత్నిస్తూనే ఉంటే,
ఒక్క గెలుపుతో అడుగు ఆగిపోక,
మరలా సాగుతూ ప్రయత్నిస్తే,
గెలుపొక లెక్కా ?
పదండి నేస్తాలూ...
వెలుతురులా ప్రభవిద్దాం,
వేకువలా మనసుల్లో వ్యాపిద్దాం.

20, నవంబర్ 2015, శుక్రవారం

సాగిపో నేస్తమా...

సాగిపో నేస్తమా...
-------------------
భావరాజు పద్మిని - 21/11/15

జలపాత ఉరవడి కావాలంటే,
బండరాళ్ళ రాపిడిని తట్టుకోవాలి.
చిన్నవిత్తైనా మొలకెత్తాలంటే
గట్టి తొడుగును ఛేదించాలి.

హరివిల్లు విరియాలంటే,
ఎండా-వానా ఢీ- కొనాలి.
సాగర గాంభీర్యం కావాలంటే,
బడబాగ్నిని లోనే దాచాలి.

తొలకరివై కురియాలంటే,
గుండెల్లో ఆర్ద్రత దాచుకోవాలి.
గడ్డిపువ్వైనా వికసించాలంటే,
ఋతువుల పరీక్షల్లో గెలవాలి.

బురదపానుపు లేనిదే,
పద్మం ఉనికి ఉంటుందా ?
ఎదురుదెబ్బలు తగలనిదే
కుదురైన నడక వస్తుందా ?



ఎడారి జాడలు లేకుంటే,
ఒయాసిస్సుకు విలువుందా ?
చీకటి పరదా లేనిదే,
వెన్నెల కానవస్తుందా ?

లోలోన తపన రగలనిదే
సూర్యుడైనా వెలగలేడు.
చెరిసగం చీకటి వెలుగులు
ఈ భూగోళానికే తప్పలేదు.

అందుకే...
అపహాస్యాలే ఆశీర్వాదాలుగా,
అవరోధాలనే సోపానాలుగా,
అడ్డంకులనే ఆహ్వానాలుగా,
అపజయాలనే ఆలంబనగా.
మార్చుకుని...
ప్రతిరోజూ కొత్తపాఠాలు నేర్చుకుని,
సాగిపో నేస్తమా !

8, అక్టోబర్ 2015, గురువారం

నయనమనోహరం

నయనమనోహరం 
---------------------
భావరాజు పద్మిని - 9/10/15.

అరుణ కాంతుల అమ్మ అరుదెంచె 
పున్నమి జిలుగుల శివుడటకొచ్చే 
చూచు వారలకులుల్లము ఝల్లన 
మొదలాయెను ఆనంద తాండవం 

మధుసూదనుడి మద్దెల నాదం 
అమరానాదమే లక్ష్మీ గానం 
విరించి వేసెను తకధిమి తాళం 
వాణీ అత్యద్భుత వీణారావం 

ఢమఢమ మ్రోగెను ఢమరుకనాదం 
ఝణఝణ మన్నది అందెల రావం 
మెరుపుల కదలిక ఇరువురి లాస్యం 
శివునికి శివయే సరియను నాట్యం 


సరిసరి నటనలు సిరిసిరి నగవులు 
రసమయ నడకలు ఒడుపుగ బిగువులు 
ఇరువురి శిఖలన నున్న చంద్రుడు 
జతపడి విడివడి నవ్వసాగెను 

వడిగ కదిలేటి అంబ జడను కాంచి 
నడయాడే మిన్నాగుయని భ్రమసి 
శివుని తనువున చుట్టిన నాగులు 
పడగలెత్తి మరి నాట్యమాడెను 

నవపంచావరం మారు మ్రోగెను
తాళలయగతులె తాండవించెను 
గంగ ఉప్పొంగి ఉరకలెత్తెను 
హిమశైలములే కరిగిపోయెను 

నందీ భృంగీ గణపతి స్కందులు 
పతంజలీ వ్యాఘ్రపాదాదులు 
సనకసనందన మునిగణాదులు 
అచ్చెరువొందుచు ఓలలాడిరి 

దివ్య లాస్యమును దిగ్భ్రమతోడ 
దేవతలంతా కానచుచుండగా 
సింధూరధూళి ధవళ కాంతితో 
మిళితమై కనుల మిరుమిట్లుగొలిపె 

ఆదిదంపతుల నెచట గానక 
నలుదిశలా పరికించుచుండగా 
ఒకే తనువున చెరుసగమ్ములై 
నగుపించిరి చిరునగవుమోమున 

పున్నమియలలా మనసులుప్పొంగ 
మోకరిల్లినవి యఖిలజగమ్ములు 
మధురం మధురం మధురసభరితం 
నయనమనోహారమర్ధనారీశ్వరం !

(ఊహా జగతిలో కళ్ళముందు నాట్యమాడి, ఈ కవిత రాసేలా ప్రేరణ కల్పించిన  ఆదిదంపతుల చరణారవిందాలకు ఈ కవిత భక్తిప్రపత్తులతో అంకితం...)

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఇదేనా అద్వైతమంటే ???

ఇదేనా అద్వైతమంటే ???

భావరాజు పద్మిని - 29/9/15.

నిర్మల మానస సరోవరంలో 
విరిసిందీ హృదయకమలం 

ఒళ్ళంతా కళ్ళుచేసుకుని 
తన జన్మెందుకోనని వెతికింది
వెలుగు, చీకటి, దిక్కులూ, దిగంతాలు
సమస్త ప్రకృతితో మౌనంగా సంభాషించింది 

చివరికి అన్వేషణే తపస్సు అయింది 
ధ్యానంతో దైవాన్నిలా వేడుకుంది 
ప్రతి జీవి పుట్టుకకూ కారణముంటే 
అదేమిటో దయతో తెలుపు స్వామీ!

ప్రతి అడుగుకూ ఒక గమ్యముంటే 
తడబడు అడుగులను దిద్దుకుని,
నా గమ్యం దిశగా సాగే మార్గం చూపే,
మార్గ దర్శిని అనుగ్రహించు ప్రభూ ! 



ఎట్టకేలకు ప్రార్ధనలకు జవాబులా 
గురువనే భృంగం తరలి వచ్చింది.
వెతకాల్సింది బయట కాదని,
కమలం లోలోనే మధువుందని,
తన ఝుంకారంతో గుర్తుచేసింది.

సంగం, బంధం, అహం శోకమూలాలని,
తామరాకు మీద నీటిబొట్టును చూపింది.
అలల అలజడులు తాత్కాలికమని,
దైవమనే వెళ్ళనే పట్టుకు తేలమంది.

బురదలో సైతం వికసిస్తేనే పద్మమని,
నేడు వికసించిందన్నపొగడ్త వెంటే, 
రేపు వసివాడిందన్న తెగడ్త వస్తుందని,
ద్వంద్వాలకు అతీతంగా ఎదగమంది.

స్వచ్చతే, వెలుగే నిజమైన ఉనికని,
అది మరచేలా మాయ కప్పుతుందని,
భక్తనే సూర్యకాంతికే అది విడుతుందని,
తెలిసుకుని జాగృతితో మెలగమంది. 

అన్ని అడుగులూ దైవం నిర్ణయిస్తే,
తడబాటులు సమత్వం కోసమేనని,
కర్తృత్వమే అసలైన అవరోధమని,
ప్రార్ధనతో క్షణక్షణం పునీతం కమ్మంది.

హృదయకమలంలో భ్రమరనాదం 
భ్రమర నామంతో మార్మ్రోగుతోంది.
'అహం బ్రహ్మస్మి' అని గుర్తుచేస్తూ,
అన్నిటా, అంతటా దైవాన్నే చూస్తూ,
నిస్సంగం వైపు పయనిస్తోంది.

దృశ్యమానజగతిలో విహరిస్తున్నా, 
పరమాత్మలో లయమైన ఆత్మ,
అన్నింటినీ మరచి, మాధుర్యంతో 
అంతర్లీనంగా ఆనందనాట్యం చేస్తోంది.
ఇదేనా అద్వైతానుభూతి అంటే ??

12, సెప్టెంబర్ 2015, శనివారం

కలం చెక్కిన శిల్పం

కలం చెక్కిన శిల్పం 

- భావరాజు పద్మిని - 12/9/15 

శిల్పం చెక్కాలంటే... ఉలే ఉండాలేమో,
కాని... శిలవంటి నా మనసుని,
భావోద్వేగాల ఉప్పెనతో తడిపిన 
కలమే నన్ను కవయిత్రిగా మలిచింది.

ముందు నేనూ రాతివంటి నాతినే !
ఎప్పుడో కదిలే మేఘాలు వర్షిస్తే,
పురివిప్పిన మనసు చంచలై ఆడేది.
ఆర్ద్రమైన గుండెపై వర్షపు చారికలు 
బండపై నీటి గుర్తుల్లా మిగిలిపోయేవి.

అప్పుడెప్పుడో అరాచాకాల్ని చూసి,
బండగుండెలోతుల్లోని నీటి ఊట,
లావాలా మరిగేది, లోలోనే రగిలేది.
అసహాయత, ఆవేశం ఎన్నాళ్ళకో,
చల్లారి మళ్ళీ బండబారిపోయేవి.

విచిత్రమైన కొందరి నడత చూసి,
చాటుగా పగలబడి నవ్వేదాన్ని,
తల్చుకుని, పంచుకుని నవ్వి,
ఆ జ్ఞాపకాలన్నీ మనసుపెట్టెలోనే,
భద్రంగా గుట్టుగా నిక్షిప్తమైపోయేవి.

కాని కాలం చేసిన గాయాలవల్లో,
మాటలు విసిరిన తూటాలవల్లో,
మనుషుల్లో చచ్చిన మనసువల్లో,
అంతరాత్మలో ఉన్న అగ్నిపర్వతం,
బద్దలై భావాల లావా పై కెగసింది,
నువ్వూ మనిషివేనని గుర్తుచేసింది.


రాయాలన్న కసికి కలం తోడైంది,
దహించే తపనకు ఆజ్యం పోసింది,
ఎగసిన భావపరంపర అక్షరాలై,
పదాలై, వాక్యాలై, కవితలై, కధలై,
పద్యాలై, పురుడు పోసుకుంది.

ఇప్పుడు...
వెయ్యి ఆలోచనల విహంగాలు, 
కలం పట్టగానే రెక్కలు విప్పుతాయి,
గువ్వలై ఏ గుండె గూటినో స్పృశిస్తాయి,
స్పందించిన మనసులు శాశ్వతంగా,
నాక్కూడా కాస్త చోటిచ్చి సత్కరిస్తాయి.

నిజమే...
చివరికి కలమే నాకు చెప్పింది,
కలమే అసలు గుట్టు విప్పింది,
స్పందించే మనసుంటే, ప్రతివ్యక్తి,
ఒక కలం చెక్కిన శిల్పం కాగలడని.

అలా...
మరికొన్ని శిల్పాల్ని చెక్కుదాం రమ్మని,
ప్రోత్సాహంతో వారి రెక్కలు విప్పమని,
చరిత్రలో కొత్త శిల్పాలకు రూపుదిద్ది,
తనకు గురుదక్షిణగా సమర్పించమని,
మౌనంగానే చెవిలో మనవి చేసింది. 
'కలం చెక్కిన శిల్పాల'వుదాం రండి.

4, ఏప్రిల్ 2015, శనివారం

మూడు చక్రాల బండి

మూడు చక్రాల బండి
------------------------
భావరాజు పద్మిని - 4/4/15 

మూడు చక్రాల బండి ... అదే ఇప్పుడు...
మూడుకాళ్ళ ఈ ముదుసలికి ఆలంబన...

ఊహతెలియనప్పుడు అమ్మ చూపింది నాకు,
గమ్మత్తుగా మోగే దీని గంటే నా గిలకయ్యింది,
గిరగిర తిరిగే చక్రాలు నా ఆటబొమ్మలయ్యాయి,
ఆడి ఆడి అలసిన నన్ను, జోకొట్టి నిద్రపుచ్చేది.
అమ్మకు దీటైన మరో అమ్మలా ఆదరించేది.

తాగుడుకు బానిసైన తండ్రి హఠాత్తుగా చనిపోతే,
ఇదే రిక్షా ఆయన చివరి యాత్రకు రధమయ్యింది.
ఎలా బతకాలో తెలియక ఏడుస్తున్న అమ్మకు,
నా చిట్టికాళ్ళ బలంతో తొక్కే రిక్షా దారిచూపింది,
పెరుగకనే కరిగే కండల శక్తే మా ఆధరామయ్యింది.

మండే ఎండలో కాసిన్ని కాసులకోసం చూస్తుంటే,
వేచివేచీ విసిగిన తనువును పరిచే పానుపయ్యింది. 
ఉన్నట్టుండి జడివాన కురిస్తే, నాకు గొడుగయ్యింది.
ఒణికే చలిలో ముడుచుకుపొతే, వెచ్చని తోడయ్యింది.
ఈదురుగాలికి ఎదురీదుతుంటే, నాకు నీడయ్యింది.
బేరాలాడే దొరల్ని చూసి, నాతో ఇదీ నవ్వుకునేది.



నాతో పాటు ఎందరు అతిధులో దీనికి...
బోసి నవ్వుల పాపలు, ఆటపాటల పిల్లలు,
రిక్షా అంతా నిండే సేట్ లు, బక్కచిక్కిన పేదలు,
కాలుకదలని వృద్ధులు, బడలిన ఉద్యోగులు,
ఇంటిపనితో విసిగిన ఇల్లాళ్ళు... ఇలా... 
బరువు మోయలేనివారిని ఇదే మోసింది.
అడుగు వెయ్యలేని వారిని గమ్యం చేర్చింది.

నా పెళ్ళికి ఇదీ ముస్తాబయ్యింది...
నా భార్యను స్వాగతించే పల్లకీ అయింది,
మా అచ్చట్లూ ముచ్చట్లకు వేదికయ్యింది.
మా పాపలకు ఊయలై ఓలలాడించింది.
ఎదిగే అవసరాలకు మా జీవిక అయ్యింది.
అదేమిటో, నా ఆకలీ తెలుసు దీనికి...
కడుపు మాడుతుంటే ఓదార్చి దారి చూపేది.

రెక్కలొచ్చిన పిల్లలు రివ్వున ఎగిరిపోతే,
అమ్మ, ఆలి గాలిలో కలిసిపోతే...
ఇక నాకు మిగిలిన తోడూనీడ ఇదే !
కాలంతో మనిషీ పరిగెడుతుంటే...
నాలాగే ఇదీ పనిలేక మూలపడింది.
ఎప్పుడో కాలగర్భంలో నేను,
కీలు విరిగి ఇదీ, కలిసిపోతామని తెలుసు.

అయినా, 
పిడికెడు గుండెనిండా గంపెడు జ్ఞాపకాలు...
వాటిని రిక్షా నిండా రాశిగా పోసుకుని నేను...
పేదల రధం ఎక్కే పెద్దల కోసం నిరీక్షిస్తూ...
మమ్మల్ని, ఇంకా ఎవరైనా గమనిస్తారని....
కాసేపైనా పలకరిస్తారని, మాతో వస్తారని,
ఎక్కడో ఒకమూల చేరి ఎదురుచూస్తున్నాం...
ఆశే శ్వాసగా మార్చుకుంటూ బ్రతుకుతున్నాం.
మాతో వస్తారా మరి ?

8, మార్చి 2015, ఆదివారం

ఇంటిదేవత

 ఇంటిదేవత 
--------------
భావరాజు పద్మిని - 8/3/15

మొహంలో లక్ష్మీకళ చూడడం దగ్గరినుంచి 
మోహంతో స్త్రీ ఒళ్ళంతా కొలిచే స్థాయికి 
దిగజారిపోయిందీ సమాజం !!

కల్చర్ పేరుతో కనువిందు చేసే బొమ్మలు 
నీకు కళ్ళతో కొలతలు తియ్యడం నేర్పాయేమో 
కాని...
సిసలైన స్త్రీని ఎప్పుడైనా చూసావా ?

ఆమె ఎత్తు...
బిడ్డగా ఉన్న నీకోసం ఎన్నోమార్లు ఒదిగినంత 
సోదరుడివైన నీకై కరుగుతూ ఊతమందించినంత 
భర్తవైన నీ ఉన్నతి కోసం నేలకైనా ఒరిగినంత 
మేరు పర్వతమంత.  



ఆమె అందం వర్చస్సు ...
అందం తరుగుతుందని తెలిసినా నీకు అమ్మైనంత 
తన శ్రమను చిరునవ్వు మాటున దాచి, 
నీవారికై క్షణక్షణం సేవలు అందిస్తున్నంత.
అహపు పొరలు తొలగించుకుని చూస్తే...
నీకళ్ళు తట్టుకోలేనంత.

ఆమె మనసు లోతు...
నీ ఆత్మీయ స్పర్శకోసం యెదలో ఆర్తిగా తపించినంత, 
నీ తియ్యటి పిలుపు కోసం ఆశగా వేచి చూసినంత, 
కాస్తంత నీ ప్రేమకోసం ఎన్నోమార్లు ఎదురుచూసినంత.
ప్రాణాన్ని పణంగా పెట్టి, నిన్ను తండ్రిని చేసినంత.
నువ్వు జన్మలో కొలవలేనంత.

ఆమె తనువు ఒంపులు ..
నీ కోపాన్ని, విసుగును, చిరాకును, అహాన్ని,
పుడమి పుత్రిలా మోస్తూ, లోలోనే దాచేసి, 
"మా వారు బంగారమండీ ..." అని స్వచ్చంగా చెప్పినంత.
నిర్మల నదీగమనమంత.

ఆ సిసలైన స్త్రీ అందం...
కొలతలో లేదు... నడతలో ఉంది.
ఆమె...
నీ ఇంట్లోనే కొలువై ఉంది...
అమ్మగా, అక్కగా ,ఆలిగా... 
నీ ఇంటి దేవతలా వెలుగుతోంది.

ఆ అనురాగదేవత ఒడిలో...
ఒక్కక్షణం తలవాల్చి చూడు,
స్వర్గమే దిగివచ్చినట్లు ఉంటుంది.
ఆ అమృతమయి లాలనలోని 
దివ్యశాంతిని అనుభూతి చెంది చూడు,
సిసలైన స్త్రీత్వం గోచరమవుతుంది.

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... మహిళా లోకానికి అంకితం.)

6, మార్చి 2015, శుక్రవారం

వర్ణ రంజితం

వర్ణ రంజితం 
----------------
భావరాజు పద్మిని - 6/3/15

రంగులే రంగులు...
తెలుపు ... ఎరుపు... నలుపు ...
తెల్లగా ఉంటే పాల మీగడ రంగని,
ఎర్రగా ఉంటే గులాబి రేకల ఛాయని,
నలుపు నారాయణుడు మెచ్చునని,
పొగిడి పొగడ చెట్టు ఎక్కిస్తారు, లేక ..
తెగిడి అగాధంలోకి తోసేస్తారు...

రంగులే రంగులు...
మనిషికో ముసుగు తొడుక్కుంటూ,
క్షణక్షణం నటన పులుముకుంటూ,
నటిస్తూ జీవించడమే మానుకుంటూ,
ఆస్తిని బట్టీ మన్నన మార్చుకుంటూ,
ఊసరవల్లికి దీటైన రంగుల మార్పిడి.


ఆ రంగుల వివక్ష తలకెక్కరాదనో,
ఈ రంగుల నటనను ఏమార్చాలనో,
రంగుల పండుగ సృష్టించారు దైవం.

రంగుల్లో రంగరిస్తే...
అన్ని మేని ఛాయలకు ఒకటే రంగు,
కళలేని మోములైనా ఒకటే వెలుగు.
అన్ని అంతరాలకు రంగుతో మరుగు,
మిధ్యాభేషజాలు అన్నీ రంగుతో కరుగు.

ఈ వసుధైక కుటుంబకం వర్ణరంజితం !
హోలీ రంగులకేళి సకల జనరంజకం!
ఆదమరచి ఆడిపాడినవారికి మనోరంజనం!
ఇది మనసులపై చేసే వసంత సంతకం !

(ఇవాళ ముఖాలకి హోలీ రంగులు పులుముకుని వెళ్తున్న పాదచారులు,  సైకిల్, స్కూటర్, ఆటో, కార్, వాహన చోదకుల్ని చూసినప్పుడు మనసులో కలిగిన భావనలు )

12, ఫిబ్రవరి 2015, గురువారం

ప్రకృతి ఒడిలోకి...

 ప్రకృతి ఒడిలోకి...
భావరాజు పద్మిని 

నునులేత భానుకిరణాలు, 
మబ్బుల మంచుముసుగు కరిగించే వేళ....

కరిగిన మంచు ముత్యాలు,
చెట్ల ఆకులపై చిరుసవ్వడి చేస్తూ జారే వేళ...

చినుకు స్పర్శ పులకలు,
పక్షుల కిలకిల రావాలై పల్లవించే వేళ....

కొండ లోయల్లో పక్షుల రావాలు,
కమ్మగా ప్రతిధ్వనిస్తూ మురిపించే వేళ....

పిల్లగాలి అలలపై తేలుతూ ,
ఔషధ సుగంధాలు తరలివచ్చే వేళ...



వింత పూవుల సోబగులేవో,
వర్ణాల తోరణాలు కట్టి స్వాగతించే వేళ...

మట్టి దారుల్లో, రాళ్ల బాటల్లో, 
అల్లుకున్న లతల్లో, అడవి చెట్లలో,
మనసు మురిసే  మధుర సడిలో,
ఆలోచనల అలజడిని శాంతపరచి,
ఎప్పుడైనా ....
ప్రకృతి ఒడిలోకి పయనిస్తే....

ఉదయరాగం హృదయరాగమై వ్యాపిస్తుంది,
అంతరంగం ఆనందతరంగాలలో తేలుతుంది, 
మౌన మునిలా ఆత్మ నాట్యమాడుతుంది,
ఆ అనుభూతి శాశ్వతంగా నిక్షిప్తమైపోతుంది.

(అహోబిలంలో 26/12/2013 ఉదయాన్నే పావన నృసింహుని దర్శనానికి అడవి దారుల్లో నడచినప్పుడు కలిగిన భావనలు... )

స్త్రీ జన్మ


స్త్రీ జన్మ 
------------
భావరాజు పద్మిని - 20/6/14 
వేలు తెగింది లోతుగా...
బొటబొటా రక్తం నేల కారింది ...
చప్పున చిటికెడు పసుపు అద్ది,
రక్తం, గాయం నోరు నొక్కేసా.
ఆశ్చర్యం...
కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క రాలలేదు,
'అమ్మా' అన్నకేక కూడా గొంతుదాటి రాలేదు.
అంతగా బండబారిపోయావా ?
సూటిగా ప్రశ్నించింది అంతరంగం...

ఒక్క క్షణం ఆలోచన, 
మరుక్షణం నిర్వేదంగా ఓ చిరునవ్వు...
నేనేంటి , ఈ పవిత్ర భారతావనిలో 
పుట్టిన ప్రతీ స్త్రీ బండరాయే... 
ప్రతీ ఇల్లాలు ఉలి దెబ్బలు తిన్న శిల్పమే...

ఎందుకంటే...
అమ్మానాన్న ఒడిలో అపురూపంగా పెరుగుతుంది,
అడుగేసినా, ఆడినా, పాడినా వాళ్లకు వేడుకే !
చిన్న దెబ్బ తగిలినా, గాయమైనా వారి కంటనీరే !
బిడ్డ కష్టం తట్టుకోలేని మనసులు, కంటికి రెప్పలా కాచి,
వెయ్యి దేవుళ్ళకి మొక్కి, తగ్గేదాకా తల్లడిల్లిపోతారు,
బిడ్డ కష్టాన్ని, బాధని మరపించేలా మురిపిస్తారు.
పెంచి పెళ్లి చెయ్యగానే మరో అధ్యాయం మొదలౌతుంది...
ఆడ జ్వరాలు, మగ జ్వరాలు ఉంటాయని, 
కొడుకు-కూతురు బాధలు, కోడలి బాధలు వేరని, 
కొత్తగా తెలుస్తుంది...
తిన్నా తినకున్నా అడిగేవారు ఉండరని అర్ధమౌతుంది.



మాటల అస్త్రాలు, నిందల శరాలు,
అహాల, అధికారాల దాహాలు,మిధ్యాదర్పాలు,
నిత్యం కొన్ని వేల మైళ్ళ వేగంతో దూసుకువచ్చి,
మనసు అద్దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాయి.
మళ్ళీ ఆశ చిగురులు తొడుక్కుని, 
అద్దపు ముక్కల్ని ఒక్కొక్కటే కూడగట్టుకుని,
అతుక్కుని, ఆ ముక్కలైన అద్దంలో చూస్తూ,
తన పాపిట సింధూరం దిద్దుకుంటుంది.

భర్త కోసమో, కాపురం కోసమో,
వాళ్ళ వంశం నిలబెట్టటడం కోసమో,
తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది...
కడుపులోని బిడ్డ కోసం కన్నీరు మింగేసి,
ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది ....
మరిన్ని సవాళ్లు, మరిన్ని మాటల తూటాలు,
పగిలిన అద్దానికి ఇక ఎన్ని గాయాలైనా ఒకటే!

అందుకేనేమో...
స్త్రీకి భూమాత అంత సహనం అంటారు.
తవ్వినా, కోసినా, కొట్టినా, కాల్చినా,
మరలా పైపొరలు ఆత్రంగా కప్పుకుని,
నొప్పి, బాధ మౌనంగా తట్టుకుని,
తనలోని జీవానికి ప్రాణం పోస్తుంది.
హరితవనంలా చిరునవ్వులు రువ్వుతుంది.

నేనూ స్త్రీనేగా...
కాకపొతే, నట్టేట మంధర పర్వతంలాంటి నన్ను,
గురువనే కూర్మం తన కటాక్షంతో నిలబెట్టి,
నా భారాలన్నీ ఆయన మోస్తూ, 
జీవితసాగర మధనం చేయిస్తున్నారు...
ఒక ప్రక్క దేవతలు, ఒక ప్రక్క రాక్షసులు,
ఎవరు ఎప్పుడు ఎటు మారతారో తెలియకున్నా,
నన్ను ఆసరాగా పాముతో పట్టుకున్న వాళ్ళకు,
అమృతం అందించాలని,అంతర్మధనానికి గురౌతాను.
అవును, నేను, బండను, పర్వతాన్ని,
ఎన్నో వృక్షాలకు, వలస పక్షులకు ఆసరాని.

అందుకే,
గాయమైనా, గేయమైనా,
వడిలినా, కాలినా, రాలినా,
నేను ఏ మాత్రం చలించను...
అవన్నీ నా స్పూర్తిని చలింపచెయ్యలేవు,
నేను భారత స్త్రీని... మొక్కవోని ధైర్యాన్ని.

|| తమసోమా జ్యోతిర్గమయ ||

|| తమసోమా జ్యోతిర్గమయ || 
------------------------------------
భావరాజు పద్మిని 

ఏమైపోయావు కన్నా ?
ఎందుకిలా చెప్పకుండా వెళ్ళిపోయావు ?

అప్పుడెప్పుడో నువ్వు నా కడుపులో 
తొలిసారి కలుక్కుమని కదలగానే,
నాలో నా ప్రాణం ఊపిరిపోసుకుంటోందని,
నన్ను "అమ్మ"ను చేస్తుందని మురిసిపోయాను.

నా కలలపంటగా నువ్వొచ్చావు,
నా ప్రేమనంతా చనుబాలుగా అందించాను,
నాకోసం నవ్వితే, నిలువెల్లా పులకించాను,
నువ్వు తొలి సారి మ్మ, మ్మ మ్మా...అంటే,
ప్రపంచాన్ని జయించినంత ఆనందించాను.
నీ ముద్దు మాటలు, బుడిబుడి అడుగులు,
నీ వడివడి పరుగులు, దాగుడుమూతలు,
కాలం ఎలా గడిచిపోయిందో తెలీదు...
నీ రాకతో నా లోకమే మారిపోయింది.

నీకు జలుబు చేసినా, జ్వరం వచ్చినా,
దెబ్బతగిలినా, బొప్పికట్టినా, నొప్పిపెట్టినా,
నీ కంటి నీరు ఉప్పెనై నన్ను ముంచేసేది.
నీ కోసం వెయ్యి దేవుళ్ళకు మ్రొక్కేదాన్ని,
ప్రతి క్షణం నీ మేలు కోసం తపించేదాన్ని.
ఒక్కగానొక్క బిడ్డ సంతోషంగా ఉండాలని,
నేనెంత బాధపడ్డా కనబడకుండా తిరిగేదాన్ని.

ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి,
రేపోమాపో మా బిడ్డ ఇంజనీర్ అనే లోపే,
చేతికి అందివచ్చిన నిన్ను దీవించే లోపే,
నాకు చెప్పకుండా అడుగెయ్యని నువ్వు,
అందనంత దూరం వెళ్ళిపోయావట....
పదిహేనురోజులు ఆశనిరాశల ఊగిసలాట,
నువ్వు బ్రతికేఉంటావన్న వెర్రి ఆశ...
నువ్వు తిరిగి రావాలన్న తీరని కాంక్ష,
అది కూడా ఇవాళ కొట్టుకుపోయింది,
నీ శవం దొరకగానే అమ్మ చచ్చిపోయింది.

ఇక ఏం మిగిలిందని నాకు...
నా లోకమంతా శూన్యం,నా బ్రతుకంతా చీకటి.
గుండెలవిసేలా ఏడ్చినా బాధ తీరదు,
నువ్వులేవన్న నిజం నా మనసు నమ్మదు.
సుడులు తిరిగేబాధతో నా గుండె ఆగిపోదే ?
నా ఊపిరి తీగలు తెగిపోయినా ప్రాణం పోదే ?

హే భగవాన్ ! ఒక్క క్షణం...
నా బిడ్డ ప్రాణం బదులు నా ప్రాణం ఇవ్వమంటే,
ఆనందంగా ఇచ్చేసేదాన్ని...
ఎందుకు నీకు మనుషులంటే ఇంత అలుసు?
కడుపుకోత ఏమిటో కన్నపెగుకే తెలుసు.
నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డే పోయాకా,
ఇక నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ?
నన్ను తీసుకుపో... తీసుకుపో...

*************************************************


అమ్మా ! ఏడవకమ్మా !
నేను ఎక్కడికీ పోలేదు, ఇదిగో చూడు,
నా చేతులతో నిన్ను అల్లుకుంటున్నా,
అమ్మా, అమ్మా, అని గొంతెత్తి పిలుస్తున్నా...
అయినా...నువ్వు చూడలేవు, వినలేవు.

ఆనందంగా కేరింతలు కొడుతున్న నన్ను,
నీటి ఉప్పెన ఒక్కపట్టున ముంచేసింది,
ఆ క్షణంలో నువ్వు, నీ నవ్వు గుర్తొచ్చాయి,
ఊపిరితిత్తులలోకి నీళ్ళు నిండుతుంటే,
కొడిగట్టే దీపంలా ప్రాణం కొట్టుకుంటుంటే,
చివరి ఆశతో అమ్మా,అమ్మా అంటూ వేదన,
జాలి, దయ చూపని విధిచేతిలో అరణ్యరోదన.
మరణం చేతిలో నేను ఓడిపోయానమ్మా...

అయినా నిన్ను చూడాలని, మాట్లాడాలని,
నీ ఒళ్లో తలపెట్టుకు పడుకోవాలని,
నా ఆత్మ వడివడిగా నీ వద్దకు వచ్చింది.
నీ ప్రక్కనే ఉన్నా, నీ కన్నీళ్లు తుడవలేను,
నీ దుఃఖం చూస్తున్నా, ఓదార్చలేను.
నీకొకటి తెలుసామ్మా ?
చివరి క్షణంలో నేను పడ్డ నరకయాతన,
నిన్ను చూసి ఇప్పుడు ప్రతీ క్షణం పడుతున్నా,
పగలనకా రాత్రనకా కుమిలే నిన్నుచూసి,
నిముషానికోసారి చచ్చిపోతున్నా...
నీ వేదన చూడలేక, నా ఆత్మ క్షోభిస్తోంది.

మా అమ్మ, ఎప్పటిలా నవ్వుతూ ఉండాలి,
వికసించిన పద్మంలా, విరగాసిన వెన్నెలలా,
అల్లరి కెరటంలా ,అందరి తల్లోనాలుకలా ఉండాలి.
ఎన్ని జన్మలెత్తినా ఈ అమ్మ కడుపునే పుట్టాలి.
ఇదే నా కోరిక... 
నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా...
ఇదివరకు నువ్వూ, నేనూ ఇద్దరం,
ఇప్పుడు నీలోనే నేను, నువ్వు నవ్వితే నవ్వుతా,
ఏడిస్తే ఏడుస్తా, నువ్వు తింటే నేనూ తింటా.
నీకు తోడుగా, నీడగా నీవెంట నేనుంటా.

ఒక్కోసారి మనిషి హృదయ వైశాల్యం పెంచేందుకు,
దేవుడిలా పరీక్షిస్తాడేమో !
పోయిన నీ బిడ్డ దగ్గరే ఆగద్దమ్మా,
అమ్మ లేని ఎందరో బిడ్డల్ని అక్కున చేర్చుకో,
వాళ్ళ నవ్వుల్లో నన్ను చూసుకో...
సేవాభావంతో వేదన కరిగించుకో,
అందరికి తిరిగి అమ్మవైన నిన్నుచూసి, 
నాకు ఆత్మశాంతి కలుగుతుంది. 
ఏ మనిషి పయనమైనా ఇంతేనమ్మా..
“ తమసోమా జ్యోతిర్గమయ “
అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుకు...

భావరాజు పద్మిని,
22/06/2014.

(మా మేనల్లుడి ప్రాణ నేస్తం జూన్ 8 న కులుమనాలి లో కొట్టుకుపోయాడు. దాదాపు 20 ఏళ్ళ స్నేహం వాళ్ళది. ఇవాళ అతని శవం దొరికింది. ఒక్కగానొక్క కొడుకు కోసం ఇన్నాళ్ళూ ఆ తల్లి పడ్డ మనోవేదన విన్నప్పుడు, ఊహించినప్పుడు కలిగిన భావాలకు అక్షర రూపం ఈ కవిత. కులు మనాలి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు అంకితం... ఇది చదివి,వారిలో ఏ ఒక్కరైనా కోలుకుంటే, నా అక్షరాలు ధన్యమైనట్లే ! )