20, ఏప్రిల్ 2017, గురువారం

ప్రేమ ఋతువులు

ప్రేమ ఋతువులు
--------------------------
భావరాజు పద్మిని - 20/4/17

నిలువెల్లా పరిమళించే నీ తలపులే,
ఈ వసంతంలో విరులతో జతచేరి,
తెమ్మరతో నా విరహాన్ని నీకు విన్నవించనీ!

శ్వాసలో డోలలూగే నీనామమే
ఈ గ్రీష్మ తాపంతో కలిసి ఆవిరై,
నీ ఊపిరిలో చేరి ప్రతిధ్వనించనీ!

నీ లలిత స్పర్శకోసం తపించే మనసు,
ఆర్ధ్రమై, నిండు మేఘమై, వర్షమై కురిసి,
నీ హృదయసీమను ఆసాంతం తడపనీ !

నువ్వు దూరంగా ఉన్నావని తెలిసినా,
నీతో ఉన్నట్లే జీవించే ప్రతి క్షణమూ,
నీలో శరత్ కాల పూర్ణచంద్రికలై వెలగనీ!


నీ స్మృతితో సంపన్నమయ్యే క్షణాలన్నీ,
కదలనని మొరాయించి హిమబిందువులై,
ఈ హేమంతంలో మంచుతెరలై నిన్ను కమ్ముకోనీ!

నీ నిరీక్షణలో యుగాలైన క్షణాలన్నీ
శిశిర మౌనరాగాల ధూళిని నింపుకుని,
ఏ గోధూళివేళో నీ పాదాలను తాకనీ!

వసంతం ధరణి నాసాంతం సింగారించాకా,
గ్రీష్మతాపంగా భువి తన విరహాన్ని విన్నవిస్తే,
వర్షమై దివి వలపులు కురిపిస్తుందని,
ఆ వలపు పంట శరత్ చంద్రికలై కళలొలుకుతుందని,
తుషారమై హేమంతలో ముగ్ధంగా ఘనీభవించి,
శిశిరంలో రాలిన ఆకుల రావాల్లో పాడుతుందని,
కావ్యాల్లో చదివాను కానీ...

వలపు తలపుల విరులే వసంతమని,
కణకణమున కవోష్ణజ్వాలలే గ్రీష్మమని,
భారమైన ఎదలో కురిసే జాలే వర్షమని,
అనురాగదీప్తమైన కలయికే వెన్నెలని, 

నిలచిపోయి నీహారికలైన నిముషాలే హేమంతమని, 
నీ విరహంలో రాలే నిరాశల ఆకులే శిశిరమని, 
ఇంతగా నిన్ను ఆరాధించాకేగా తెలిసింది! 
ఈ కృష్ణారాధిక తృష్ణ దీర్చవా కృష్ణా!