17, జనవరి 2017, మంగళవారం

కొన్ని నవ్వులు... (కవిత)

కొన్ని నవ్వులు... (కవిత)
పద్మిని భావరాజు.(11 /8/13 )

కొన్ని నవ్వులు...
పెదాలు విచ్చుకునీ విచ్చుకోనట్టు,
ప్లాస్టిక్, మొహమాటం నవ్వులు.

కొన్ని నవ్వులు...
మనసులోని విషపు ఆలోచనలని,
కప్పేసే, పెదవి విరుపు నవ్వులు.

కొన్ని నవ్వులు...
అవసరాన్ని గడుపుకోవడానికి,
వచ్చే,నవజాత అవసరార్ధం నవ్వులు.

కొన్ని నవ్వులు...
అసూయను కప్పిపుచ్చుకునే,
మెచ్చుకోలు, కపటపు నవ్వులు.

కొన్ని నవ్వులు...
గెలవలేక,ఏడవలేక నవ్వే,
నిస్సహాయపు నవ్వులు.
ఇన్ని నవ్వుల మధ్య నా అన్వేషణ దేనికోసం?ఆత్మ స్వచ్చతను,
మనసు అద్దంపైకి,
మనసు అద్దం నుంచీ,
పెదవి హరివిల్లు పైకి,
పరావర్తనం చెందించి,
ఏడు రంగులు కలిసిన,
ఆత్మ అద్భుత చిత్రాన్ని,
ఎదుటివారి కళ్ళలో మెరిపించే,
మనోహరమైన నవ్వులకోసం.

చూసాను... ఆ నవ్వులను...
పసిపాపల బోసి నవ్వుల్లో.
తల్లిదండ్రుల నిస్వార్ధ ప్రేమలో,
అండగా నిలిచే ఆత్మీయుల్లో,
గురుమూర్తి వాత్సల్య వదనంలో.

కళ్ళలో మెరిసే ఆ నవ్వులకు,
తారలు దిగదుడుపు.
విరుల తేనెల ఆ నవ్వులే,

నాకు ప్రతీరోజూ మేలుకొలుపు.

16, జనవరి 2017, సోమవారం

మరో ఉదయం

మరో ఉదయం
------------------
భావరాజు పద్మిని - 17/1/2015

మలిపోద్దులో సంజె చీకట్లు కమ్మితే,
వెలుగు తలఒగ్గి ఓడినట్లు కనిపిస్తుంది.
చీకటి ముసుగులో మునిగిన జగతి,
మరుగునపడి, మౌనంగా విశ్రమిస్తుంది.

అయితేనేం ?
నీలో సడలని సంకల్పబలం ఉంటే...
మరో ఉదయానికై వేచి చూస్తూనే...
చీకట్లోనే పున్నమిలా పుయ్యచ్చు,
నిశీధిలో నక్షత్రంలా తళుక్కుమనచ్చు,
మిణుగురులు మిలమిలా మెరవచ్చు.

చీకటి అంటే ఓటమి సమయం కాదు,
లోలోని జ్ఞానజ్యోతిని దర్శించే తరుణం ,
నీలోని కాంతి రేఖలకు మరో పార్శ్వం ,
తీరుమార్చి మెరిసేందుకు ఇంకో అవకాశం !


రేయిలో సంయమనం పాటిస్తూ నడిస్తే,
వచ్చే ఉదయం మరింత ప్రకాశవంతం !
తడబడే అడుగులే తీరైన నడకలయ్యే,
బంగారు భవితకు సరికొత్త సోపానం .

పద నేస్తమా,
మరో ఉదయం పిలుస్తోంది...
కలల ద్వారాలు తెరిచి స్వాగతిస్తోంది.
అందుకుని అనుసరించి, ఆస్వాదిద్దాం,
మరో కొత్త అధ్యాయానికి తెర తీద్దాం !
చరిత్రలో మనకంటూ చెదరని ముద్రవేద్దాం !

13, జనవరి 2017, శుక్రవారం

వెన్నెలెంత ముద్దు

వెన్నెలెంత ముద్దు
————————
భావరాజు పద్మిని - 13/12/16

చల్లని ఈ రేయంతా నిదురమాని,
నీతో ఊసులాడాలనుంది.
కొబ్బరాకుల ఊయలలూగే నిన్ను
కోసుకొచ్చుకోవాలనుంది.

వెలుగు బంతిని తీసుకొచ్చి
పసిపాపనై ఆటలాడాలనుంది.
మబ్బుల మాటున దాగేనీతో
దాగుడుమూతలాడాలనుంది.


పున్నమిలో సాగరం ఎందుకు పొంగుతుందో
ఎన్నెలంతా ఏరెందుకు నెమరేస్తుందో,
కలువ కన్నులు నీకోసం ఎందుకు ఎదురుచూస్తాయో,
చకోరపక్షులు నీ నిండుబింబం కోసం ఎందుకు పరితపిస్తాయో,
తారకలు నీ చుట్టూ ఎందుకు పరిభ్రమిస్తాయో,
వెన్నెల్లో తాజ్మహల్ చూడాలని ప్రేమికులెందుకు కలలు కంటారో,
నాకు తెలీదు కానీ,
ఓ జాబిలి దీపమా,
నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం.

వెన్నెల దారాలతో నిన్ను చుట్టుకోవాలని,
వెన్నెల్లో తడిసిన జాజులు తురుముకోవాలని,
వెన్నెల రసాన్నంతా మానసంలో నిక్షిప్తం చేసుకోవాలని,
వెన్నెల్లో కరిగిపోవాలని, కలిసిపోవాలని,
చెప్పలేని ఆరాటం.
పెరిగినా తరిగినా చీకట్లో దాగినా...
నువ్వెలా ఉన్నా నాకు ముద్దే మరి.

ప్రకృతి నేర్పే పాఠాలు

ప్రకృతి నేర్పే పాఠాలు
*******************
భావరాజు పద్మిని - 01/01/17


మౌనంగానే ఉంటుంది, కానీ...
జీవిత సత్యాల గుప్తనిధి ఇది,
మనసుతో నిశితంగా పరిశీలిస్తే,
ఎన్నో పాఠాలు నేర్పుతుంది,
అందరినీ పోషించే అమ్మ ప్రకృతి.


పల్లవించే సత్తా నీలో ఉంటే,
కొండైనా లోయైనా బండైనా,
తలవంచుకు ఒగ్గి నీకనువుగా,
దారి ఇవ్వాల్సిందేనంటుంది,
తలెత్తుకు నిలబడ్డ చిన్నచిగురు.


ఎన్ని అనుకోని విపత్తులెదురైనా,
ఎన్ని జాడ్యాలు మొదలంటా తొల్చినా,
నువ్వు ధృడంగా స్థిరంగా నిలబడి,
ఆశల చిగురులేస్తున్న లతలకు,
ఆలంబన కమ్మంటుందో వృద్ధ వృక్షం.


ప్రతిధ్వనించే స్వనం నీలో ఉంటే,
గాలి వాటు నీకు వాహికవుతుందని,
కొమ్మ మాటు నీకు వేదికవుతుందని,
కొండ వాలు నీకు వంత పాడుతుందని,
చెబుతుంది కొమ్మమాటు చిన్నిపిట్ట.

Image may contain: tree, plant, outdoor and nature


దారున్నప్పుడు పయనం గొప్ప కాదని,
బండలనైనా కరిగించే సంకల్పబలంతో,
ఓపికతో ఒరిపిడిని ఓర్చుకుంటూ,
దారిచేసుకుని దాహార్తిని తీర్చమని,
గలగలలతో బోధిస్తుంది సెలయేరు.


నువ్వు బండబారిపోయినా సరే,
కొండకు ఉనికినిచ్చే శకలానివి కమ్మని,
మరో జీవిని ఎదగనిచ్చే సోపానం కమ్మని,
దైవానికి రూపమిచ్చే మూలానివికమ్మని,
అంటుంది బాధలెన్నో మోసిన బండరాయి.


చిక్కుముడిలా పెనవేసుకున్న వనాలు,
మొక్కకి మొక్క ఎన్నడూ అడ్డం కాదని,
ప్రాణి ప్రాణికెన్నడూ అడ్డంకి కాదని,
మరి మనిషికి మనిషే అడ్డమెందుకని,
మీలో తేడాలెందుకని సూటిగా ప్రశ్నిస్తుంది.


అమ్మ చెప్పే పాఠాలు విని ఆచరిస్తే,
అసూయాద్వేషాలన్నీ మరువమా?
అమ్మ పెట్టే అన్నమే ఆధారమైన మనం,
వసుధైక కుటుంబకంలాగా మెలగమా?
ఆటవికుల నుండి మానవులమైన మనం,
ప్రకృతి నేర్పే కనీస పాఠాలు నేర్చేందుకు,
మళ్ళీ అడవితల్లి ఒడిలోకి వెళ్ళాలేమో !


(అద్భుతమైన, దట్టమైన, సహజమైన అహోబిల అడవుల్లో స్వామి దర్శనానికి కొన్ని మైళ్ళు కాలినడకన వెళ్ళినప్పుడు నాలో కలిగిన భావనలు. దృశ్యాలు కూడా అక్కడివే.)