ప్రకృతి నేర్పే పాఠాలు
*******************
భావరాజు పద్మిని - 01/01/17
మౌనంగానే ఉంటుంది, కానీ...
జీవిత సత్యాల గుప్తనిధి ఇది,
మనసుతో నిశితంగా పరిశీలిస్తే,
ఎన్నో పాఠాలు నేర్పుతుంది,
అందరినీ పోషించే అమ్మ ప్రకృతి.
పల్లవించే సత్తా నీలో ఉంటే,
కొండైనా లోయైనా బండైనా,
తలవంచుకు ఒగ్గి నీకనువుగా,
దారి ఇవ్వాల్సిందేనంటుంది,
తలెత్తుకు నిలబడ్డ చిన్నచిగురు.
ఎన్ని అనుకోని విపత్తులెదురైనా,
ఎన్ని జాడ్యాలు మొదలంటా తొల్చినా,
నువ్వు ధృడంగా స్థిరంగా నిలబడి,
ఆశల చిగురులేస్తున్న లతలకు,
ఆలంబన కమ్మంటుందో వృద్ధ వృక్షం.
ప్రతిధ్వనించే స్వనం నీలో ఉంటే,
గాలి వాటు నీకు వాహికవుతుందని,
కొమ్మ మాటు నీకు వేదికవుతుందని,
కొండ వాలు నీకు వంత పాడుతుందని,
చెబుతుంది కొమ్మమాటు చిన్నిపిట్ట.
దారున్నప్పుడు పయనం గొప్ప కాదని,
బండలనైనా కరిగించే సంకల్పబలంతో,
ఓపికతో ఒరిపిడిని ఓర్చుకుంటూ,
దారిచేసుకుని దాహార్తిని తీర్చమని,
గలగలలతో బోధిస్తుంది సెలయేరు.
నువ్వు బండబారిపోయినా సరే,
కొండకు ఉనికినిచ్చే శకలానివి కమ్మని,
మరో జీవిని ఎదగనిచ్చే సోపానం కమ్మని,
దైవానికి రూపమిచ్చే మూలానివికమ్మని,
అంటుంది బాధలెన్నో మోసిన బండరాయి.
చిక్కుముడిలా పెనవేసుకున్న వనాలు,
మొక్కకి మొక్క ఎన్నడూ అడ్డం కాదని,
ప్రాణి ప్రాణికెన్నడూ అడ్డంకి కాదని,
మరి మనిషికి మనిషే అడ్డమెందుకని,
మీలో తేడాలెందుకని సూటిగా ప్రశ్నిస్తుంది.
అమ్మ చెప్పే పాఠాలు విని ఆచరిస్తే,
అసూయాద్వేషాలన్నీ మరువమా?
అమ్మ పెట్టే అన్నమే ఆధారమైన మనం,
వసుధైక కుటుంబకంలాగా మెలగమా?
ఆటవికుల నుండి మానవులమైన మనం,
ప్రకృతి నేర్పే కనీస పాఠాలు నేర్చేందుకు,
మళ్ళీ అడవితల్లి ఒడిలోకి వెళ్ళాలేమో !
(అద్భుతమైన, దట్టమైన, సహజమైన అహోబిల అడవుల్లో స్వామి దర్శనానికి కొన్ని మైళ్ళు కాలినడకన వెళ్ళినప్పుడు నాలో కలిగిన భావనలు. దృశ్యాలు కూడా అక్కడివే.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి