12, సెప్టెంబర్ 2015, శనివారం

కలం చెక్కిన శిల్పం

కలం చెక్కిన శిల్పం 

- భావరాజు పద్మిని - 12/9/15 

శిల్పం చెక్కాలంటే... ఉలే ఉండాలేమో,
కాని... శిలవంటి నా మనసుని,
భావోద్వేగాల ఉప్పెనతో తడిపిన 
కలమే నన్ను కవయిత్రిగా మలిచింది.

ముందు నేనూ రాతివంటి నాతినే !
ఎప్పుడో కదిలే మేఘాలు వర్షిస్తే,
పురివిప్పిన మనసు చంచలై ఆడేది.
ఆర్ద్రమైన గుండెపై వర్షపు చారికలు 
బండపై నీటి గుర్తుల్లా మిగిలిపోయేవి.

అప్పుడెప్పుడో అరాచాకాల్ని చూసి,
బండగుండెలోతుల్లోని నీటి ఊట,
లావాలా మరిగేది, లోలోనే రగిలేది.
అసహాయత, ఆవేశం ఎన్నాళ్ళకో,
చల్లారి మళ్ళీ బండబారిపోయేవి.

విచిత్రమైన కొందరి నడత చూసి,
చాటుగా పగలబడి నవ్వేదాన్ని,
తల్చుకుని, పంచుకుని నవ్వి,
ఆ జ్ఞాపకాలన్నీ మనసుపెట్టెలోనే,
భద్రంగా గుట్టుగా నిక్షిప్తమైపోయేవి.

కాని కాలం చేసిన గాయాలవల్లో,
మాటలు విసిరిన తూటాలవల్లో,
మనుషుల్లో చచ్చిన మనసువల్లో,
అంతరాత్మలో ఉన్న అగ్నిపర్వతం,
బద్దలై భావాల లావా పై కెగసింది,
నువ్వూ మనిషివేనని గుర్తుచేసింది.


రాయాలన్న కసికి కలం తోడైంది,
దహించే తపనకు ఆజ్యం పోసింది,
ఎగసిన భావపరంపర అక్షరాలై,
పదాలై, వాక్యాలై, కవితలై, కధలై,
పద్యాలై, పురుడు పోసుకుంది.

ఇప్పుడు...
వెయ్యి ఆలోచనల విహంగాలు, 
కలం పట్టగానే రెక్కలు విప్పుతాయి,
గువ్వలై ఏ గుండె గూటినో స్పృశిస్తాయి,
స్పందించిన మనసులు శాశ్వతంగా,
నాక్కూడా కాస్త చోటిచ్చి సత్కరిస్తాయి.

నిజమే...
చివరికి కలమే నాకు చెప్పింది,
కలమే అసలు గుట్టు విప్పింది,
స్పందించే మనసుంటే, ప్రతివ్యక్తి,
ఒక కలం చెక్కిన శిల్పం కాగలడని.

అలా...
మరికొన్ని శిల్పాల్ని చెక్కుదాం రమ్మని,
ప్రోత్సాహంతో వారి రెక్కలు విప్పమని,
చరిత్రలో కొత్త శిల్పాలకు రూపుదిద్ది,
తనకు గురుదక్షిణగా సమర్పించమని,
మౌనంగానే చెవిలో మనవి చేసింది. 
'కలం చెక్కిన శిల్పాల'వుదాం రండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి