4, ఏప్రిల్ 2015, శనివారం

మూడు చక్రాల బండి

మూడు చక్రాల బండి
------------------------
భావరాజు పద్మిని - 4/4/15 

మూడు చక్రాల బండి ... అదే ఇప్పుడు...
మూడుకాళ్ళ ఈ ముదుసలికి ఆలంబన...

ఊహతెలియనప్పుడు అమ్మ చూపింది నాకు,
గమ్మత్తుగా మోగే దీని గంటే నా గిలకయ్యింది,
గిరగిర తిరిగే చక్రాలు నా ఆటబొమ్మలయ్యాయి,
ఆడి ఆడి అలసిన నన్ను, జోకొట్టి నిద్రపుచ్చేది.
అమ్మకు దీటైన మరో అమ్మలా ఆదరించేది.

తాగుడుకు బానిసైన తండ్రి హఠాత్తుగా చనిపోతే,
ఇదే రిక్షా ఆయన చివరి యాత్రకు రధమయ్యింది.
ఎలా బతకాలో తెలియక ఏడుస్తున్న అమ్మకు,
నా చిట్టికాళ్ళ బలంతో తొక్కే రిక్షా దారిచూపింది,
పెరుగకనే కరిగే కండల శక్తే మా ఆధరామయ్యింది.

మండే ఎండలో కాసిన్ని కాసులకోసం చూస్తుంటే,
వేచివేచీ విసిగిన తనువును పరిచే పానుపయ్యింది. 
ఉన్నట్టుండి జడివాన కురిస్తే, నాకు గొడుగయ్యింది.
ఒణికే చలిలో ముడుచుకుపొతే, వెచ్చని తోడయ్యింది.
ఈదురుగాలికి ఎదురీదుతుంటే, నాకు నీడయ్యింది.
బేరాలాడే దొరల్ని చూసి, నాతో ఇదీ నవ్వుకునేది.నాతో పాటు ఎందరు అతిధులో దీనికి...
బోసి నవ్వుల పాపలు, ఆటపాటల పిల్లలు,
రిక్షా అంతా నిండే సేట్ లు, బక్కచిక్కిన పేదలు,
కాలుకదలని వృద్ధులు, బడలిన ఉద్యోగులు,
ఇంటిపనితో విసిగిన ఇల్లాళ్ళు... ఇలా... 
బరువు మోయలేనివారిని ఇదే మోసింది.
అడుగు వెయ్యలేని వారిని గమ్యం చేర్చింది.

నా పెళ్ళికి ఇదీ ముస్తాబయ్యింది...
నా భార్యను స్వాగతించే పల్లకీ అయింది,
మా అచ్చట్లూ ముచ్చట్లకు వేదికయ్యింది.
మా పాపలకు ఊయలై ఓలలాడించింది.
ఎదిగే అవసరాలకు మా జీవిక అయ్యింది.
అదేమిటో, నా ఆకలీ తెలుసు దీనికి...
కడుపు మాడుతుంటే ఓదార్చి దారి చూపేది.

రెక్కలొచ్చిన పిల్లలు రివ్వున ఎగిరిపోతే,
అమ్మ, ఆలి గాలిలో కలిసిపోతే...
ఇక నాకు మిగిలిన తోడూనీడ ఇదే !
కాలంతో మనిషీ పరిగెడుతుంటే...
నాలాగే ఇదీ పనిలేక మూలపడింది.
ఎప్పుడో కాలగర్భంలో నేను,
కీలు విరిగి ఇదీ, కలిసిపోతామని తెలుసు.

అయినా, 
పిడికెడు గుండెనిండా గంపెడు జ్ఞాపకాలు...
వాటిని రిక్షా నిండా రాశిగా పోసుకుని నేను...
పేదల రధం ఎక్కే పెద్దల కోసం నిరీక్షిస్తూ...
మమ్మల్ని, ఇంకా ఎవరైనా గమనిస్తారని....
కాసేపైనా పలకరిస్తారని, మాతో వస్తారని,
ఎక్కడో ఒకమూల చేరి ఎదురుచూస్తున్నాం...
ఆశే శ్వాసగా మార్చుకుంటూ బ్రతుకుతున్నాం.
మాతో వస్తారా మరి ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి