20, నవంబర్ 2015, శుక్రవారం

సాగిపో నేస్తమా...

సాగిపో నేస్తమా...
-------------------
భావరాజు పద్మిని - 21/11/15

జలపాత ఉరవడి కావాలంటే,
బండరాళ్ళ రాపిడిని తట్టుకోవాలి.
చిన్నవిత్తైనా మొలకెత్తాలంటే
గట్టి తొడుగును ఛేదించాలి.

హరివిల్లు విరియాలంటే,
ఎండా-వానా ఢీ- కొనాలి.
సాగర గాంభీర్యం కావాలంటే,
బడబాగ్నిని లోనే దాచాలి.

తొలకరివై కురియాలంటే,
గుండెల్లో ఆర్ద్రత దాచుకోవాలి.
గడ్డిపువ్వైనా వికసించాలంటే,
ఋతువుల పరీక్షల్లో గెలవాలి.

బురదపానుపు లేనిదే,
పద్మం ఉనికి ఉంటుందా ?
ఎదురుదెబ్బలు తగలనిదే
కుదురైన నడక వస్తుందా ?ఎడారి జాడలు లేకుంటే,
ఒయాసిస్సుకు విలువుందా ?
చీకటి పరదా లేనిదే,
వెన్నెల కానవస్తుందా ?

లోలోన తపన రగలనిదే
సూర్యుడైనా వెలగలేడు.
చెరిసగం చీకటి వెలుగులు
ఈ భూగోళానికే తప్పలేదు.

అందుకే...
అపహాస్యాలే ఆశీర్వాదాలుగా,
అవరోధాలనే సోపానాలుగా,
అడ్డంకులనే ఆహ్వానాలుగా,
అపజయాలనే ఆలంబనగా.
మార్చుకుని...
ప్రతిరోజూ కొత్తపాఠాలు నేర్చుకుని,
సాగిపో నేస్తమా !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి