21, నవంబర్ 2015, శనివారం

గెలుపొక లెక్కా ?

గెలుపొక లెక్కా ?
--------------------------
భావరాజు పద్మిని - 22/11/15 

ఎప్పుడైనా ఉదయాన్ని గమనించారా ?
రాత్రంతా చీకటితో పోరాడి,
కొన ఊపిరిని  కూడదీసుకుని,
చావో రేవో తేల్చుకోవాలని,
ఆఖరిపోరు కోసం సిద్ధమైన,  
సైనికుడిలా ఉంటుంది నాకు.

కాస్తంత గెలుపు ఛాయలు కనబడగానే,
తనలోని వెలుగనే చైతన్యాన్ని ...
కొండాకోనల్లో, చేట్టూచేమల్లో,
నదీనదాల్లో, నట్టడవుల్లో,
సృష్టిలోని అణువణువునా నింపి,
తృప్తిగా చూసుకుని నిట్టూరుస్తుంది.

నీటి అలలల్లో వేయి తళుకులై,
తనను చూసుకుని మురిసిపోతుంది.
చిగురుటాకుపై మంచుబిందువులో,
హరివిల్లై అనేక రంగులతో ప్రభవిస్తుంది.
మబ్బులమాటున దోబూచులాడుతూనే,
మౌనంగా జగతిలో వ్యాపిస్తుంది.


చీకట్లనే చీల్చడమే కాదు, 
మంచు తెరల్నీ కరిగిస్తుంది.
అంధకారంలో ఉన్న జగతికి,
అదే చెయ్యిపట్టి దారి చూపుతుంది.

తన ఆత్మజ్యోతిని వెలిగించుకుని,
ఇతరులకి వెలుగులు పంచగల,
ప్రతివ్యక్తీ ఒక కాంతి పుంజమే,
కదిలే ఉదయభానుడి తేజమే.
ఒక్క గెలుపుతోనే వెలుతురు ఆగదు,
మరోరోజు మరో పోరాటానికీ సిద్ధం.

వెలుతురు మనకు ఆదర్శమైతే,
ప్రతిరోజూ కొత్త పుట్టుకే అనుకుని,
మనలో చైతన్యాన్ని నింపుకుని,
చివరిదాకా ప్రయత్నిస్తూనే ఉంటే,
ఒక్క గెలుపుతో అడుగు ఆగిపోక,
మరలా సాగుతూ ప్రయత్నిస్తే,
గెలుపొక లెక్కా ?
పదండి నేస్తాలూ...
వెలుతురులా ప్రభవిద్దాం,
వేకువలా మనసుల్లో వ్యాపిద్దాం.

2 కామెంట్‌లు:

  1. అభ్భ..ఎంత గొప్ప భావ వ్యక్తీకరణండీ..పద్మినీగారు..మీ పదకవిత నన్ను ముగ్ధుడ్ని చేసింది..ఓటమి కోరలలలో చిక్కి విలవిలలాడే ఎందరికో మీ కవిత ఒక వెలుగు బాట..

    రిప్లయితొలగించండి