"ప్రకృతి మాత ప్రత్యేక సంచికకు" ప్రకృతి మాత బొమ్మ వేసి ఇవ్వాలా ? ఇంతకీ ఆవిడ ఎలా ఉంటుంది మేడం, అని అడిగారు మా ఆర్టిస్ట్ నాగేంద్రబాబు గారు. వెంటనే ఈ కవిత పుట్టింది.
ప్రకృతి మాత
----------------
భావరాజు పద్మిని - 11/3/16
మెరిసే తారల మకుటము బెట్టి
నీలవేణులను కురులుగ జుట్టి
నెలవంకను సిగాపూవుగ కట్టి
తెలిమబ్బుల రెక్కలనే జుట్టి
మెలికల దారుల పాపిట గట్టి
నీటి చెలమలను చెవులుగ చుట్టి
మంచుతెరల పరదాగా గట్టి
అలరుచుండునీ వెన్నెల పట్టి
సూర్యబింబమే తిలకము కాగా
వానవిల్లు కనుబొమలే కాగా
జీవకోటియే కన్నులు కాగా
సూదిమల్లెలే నాసిక కాగా
పగడపు కాంతులె పెదవులు కాగా
చీకటి చెక్కిట దిష్టిచుక్కగా
వెలుగు మోముదీ వేకువ రాణి
హిమశంఖములే కంఠము నలరెను
తరువుల కొమ్మలె కరములాయెను
శ్వేతగిరులు చనుమెరుగులై నమరెను
కోనల వంపులు నడుమున జారెను
లతలూతీగలు కొకగ మారెను
పంచభూతములె పావడాయెను
కదిలెడి మెరుపీ వన్నెల బోణి
తొలకరి వానల గంధము దాల్చును
మంచు ముత్యముల ముక్కెరబెట్టును
సీతాకోకల గాజుల తొడుగును
దీవులదెచ్చి వడ్డాణము జుట్టును
మిణుగురులమరిన అందెలు గట్టును
సంజె అరుణిమల పారాణి తీర్చును
వర్షఋతువు తడి కురులను జారును
గ్రీష్మ తాపమే నిట్టూర్పులనలరును
శిశిర ఛాయలే అలసిన కలుగును
వసంతశోభలె నవ్వుల విరియును
హేమంతము తొలివలపుల కురియును
శరత్ చలువలె మనసున నింపును
ఋతువుల అతివీ సరసిజలోచని
ఉనికియె తాను ఊపిరి తాను
మనను ధరించెడి మాతయె తాను
అన్ని జీవులకు అమ్మయె తాను
కరుణను జూచిన ప్రేమయె పొంగును
క్రోధము జెందిన విలయమె బుట్టును
ప్రకృతి మాత సమతుల్యతను
పరిరక్షించుటే మన కర్తవ్యమ్ !
ఆలోచించి అడుగులు వేద్దాం
తనచల్లని నీడనె సేదదీరుదాం !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి