చిట్టి దేవత
-------------
భావరాజు పద్మిని - 6/4/16
ఏ దివిలో తిరిగే దేవతో,
చిట్టితల్లిగా మా ఇంటికొచ్చింది.
గుప్పిట నా వేలును ఒడిసిపట్టింది
కనులు తెరిచి నన్ను పలకరించింది.
బోసి నవ్వులతో మనసు మీటింది.
ఆ క్షణమే...
తనతో నా బాల్యాన్ని వెనక్కుతెచ్చింది.
హమ్మో, ఇంకెన్ని పనులో నాకు..
అనుక్షణం నా పాలబొమ్మ ఊసే,
చిలుక పలుకులు వినాలన్న ఆశే,
లేలేత స్పర్శకు పులకించాలన్న ధ్యాసే!
తన అడుగులో అడుగై పరుగెత్తాలని,
తన ఆటలకు బొమ్మనై అలరించాలని,
తన బాధలో కన్నీరై కరిగిపోవాలని,
తన నవ్వులలో వెన్నెలై విరియాలని,
తన మాటల మూటల్లో మునగాలని,
కోరిందల్లా తన దోసిట్లో పొయ్యాలని,
కొత్తవాళ్లోస్తే, కాలికి చుట్టుకుపోతుంది,
ఎత్తుకు ఊరేగించమని మొరాయిస్తుంది,
అన్నం పెట్టమని, అందకుండా దాక్కుంటుంది,
నిద్దర్లో ఉంటే, మీసాలు లాగి నవ్వేస్తుంది,
నా కళ్ళజోడు పెట్టుకుని కవ్విస్తుంది,
అలసిసొలసి నా గుండెలపై నిద్రపోతుంది,
నన్ను హత్తుకుని నిలువునా పులకలౌతుంది.
ముంగిట్లో నా చిన్నారి జాబిలి,
మురిపిస్తూ సందడి చేస్తుంటే,
తననే చూసుకు బ్రతికే నాన్నకు,
ఇంకేం కావాలి చెప్పండి?
ఇంటికో చిట్టిదేవత ఉంటే...
దైవమే చిన్నబోతారేమో!
ఆ భయంతోనే చిన్నిపాపల్ని,
త్వరత్వరగా ఎదిగిస్తారేమో కదూ !
అయినా,
మళ్ళీ ఈ పాపే అమ్మగా మారుతుంది,
మరో ఇంట్లో, మరో చిట్టిదేవత అవతరిస్తుంది.
భూతలం స్వర్గాన్నితలపించాలనేమో,
ఇంటికో చిట్టిదేవత వెలుస్తూనే ఉంటుంది.
(నిన్న పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్తే, ఉంగరాలజుట్టున్నఓ చిన్నారి కనిపించింది. అది వాళ్ళ అన్నను దింపేందుకు వచ్చింది. నన్నుచూడగానే, నాన్న కాలిని అల్లుకుపోయింది. వాళ్ళ నాన్నను ఎత్తుకోమని, మనసారా హత్తుకుని, మురిసిపోయింది. ఈ కవిత, దీనికి ప్రేరణగా నిలిచిన ఆ చిట్టితల్లికి అంకితం.)
చాలా బాగుంది మీ కవిత
రిప్లయితొలగించండినా FB లో పోస్టు చేస్తున్నాను
అభ్యంతరం ఉంటే తెలియజేయండి