22, ఏప్రిల్ 2016, శుక్రవారం

ప్రాయమెరుగని పసిపాప

ప్రాయమెరుగని పసిపాప
----------------------------
భావరాజు పద్మిని - 23/04/16

పాట పాడేందుకు ఆవిడ పుట్టడంకాదు,
పాటే ఆవిడకోసం పుట్టినట్లు ఉంటుంది.
అందుకేనేమో దైవం ఆవిడ తనువుకేగాని,
గొంతుకు ప్రాయం పెట్టడం మర్చిపోయారు.

పసిపాపలా మాట్లాడి మురిపిస్తుంది,
ప్రౌఢలా గొంతులో వలపునొలికిస్తుంది,
విరహిణిలా మనసును నలిపేస్తుంది,
ప్రణయినిలా స్వరంతోనే కవ్విస్తుంది,
వెల్లువలా 'వెన్నెల్లో గోదార'వుతుంది,
ముదుసలిలా మారి అలరిస్తుంది,
భక్తురాలిగా భగవంతుడిని కరిగిస్తుంది,
సంగీత యోధులకే సవాలవుతుంది.

ఏ రాగాన్నైనా సొంతం చేసుకుంటుంది,
ఏ భావాన్నైనా ప్రాణంతో నడిపిస్తుంది,
ఏ భాషైనా సొంతం చేసుకుపలికేస్తుంది,
కధకు, ఎదకు, వ్యధకు, నటనకు,
గణపతిప్రతిమను చేసిన జగదంబలా,
ఆలంబనగా జీవంపోసే స్వరాంబ ఈమె.
భామలా, బామ్మలా, పసిబొమ్మలా,
పసిడి మనసుతో అందరినీ దోచుకుంది.

'రామ ప్రసాదమైన' ఈ అమ్మజానకి,
రాముని కొలువులో అరుణకమలమై,
రాముడు జానకిలో లయమవగానే,
తన మనసురంగు వలువల్నిధరించింది.
అవునండీ! ఈ అమ్మ మనసు తెలుపు,
స్వచ్చతకు ప్రతిరూపమీ శ్వేతకమలం.
అందుకే అంతా అయ్యారీమెకు దాసోహం.



తియ్యగా మధురవంలా పలుకరిస్తూ,
గలగల గోదారిలా నిండుగా నవ్వుతూ,
సమభావనతో అందరినీ ఆదరిస్తూ,
ఎదిగినా ఒదిగిఉండడమే తత్వమని,
ఆచరణతో నడవడి చూపించింది.
పెట్టే పెద్దచెయ్యితో మౌనగీతంలా,
ఎందరినో అజ్ఞాతంగా ఆదుకుంది.

ఓంకారమే గానమని నమ్మింది కనుక,
పాటను దైవంగా ఆరాధించింది కనుక,
ఆస్తమానైనా సవాలు చెయ్యగలిగింది.
కష్టాలు ఎదురైనా పాటను వదలద్దని,
గానం గాయకుల మనసు ఆర్ద్రతతో,
శ్రోతల గుండెను తడిపే ప్రాణదీపమని,
కొత్త తరానికి గొప్ప సందేశమిచ్చింది.

సారస్వతాన్ని,స్వరంతో సర్వస్వాన్ని,
గెలుచుకున్నఈ ప్రత్యక్ష సరస్వతి...
ముత్యానికి ముస్తాబెందుకనేమో,
పద్మానికి "భూషణం" వద్దనేసింది.
"అజాత శత్రువ"ని పేరుపొంది,
గుండెగుండెను గెల్చుకున్నఈమె,
గొప్ప పెన్నిధులున్నమహారాణి !

పాటతోనే సమ్మోహితుల్ని చేసే,
మా తెలుగింటి వసంతపు"స్వరరాణి"
నిండునూరేళ్ళు నవ్వుతూ జీవించాలని,
స్వరంతో మనసుసంతకాలు చేసి,
పాటను చిరంజీవిగా దీవించాలని,
ప్రతిమనసు ఆశిస్తూ అభినందిస్తోంది,
పుట్టినరోజు శుభాకాంక్షలు కోకిలమ్మ!


('కలైమామాణి' తెలుగింటి కోకిలమ్మ 'జానకమ్మ' కు పుట్టినరోజు సందర్భంగా భక్తితో అంకితం.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి