21, ఏప్రిల్ 2016, గురువారం

తోట మూగవోయింది

తోట మూగవోయింది
-------------------------
భావరాజు పద్మిని- 21/4/16

ఆ రెండు చేతుల స్పర్శ మాకింకా గుర్తే...
నిమ్నమైన గడ్డిని, ఉన్నతమైన వృక్షాల్ని,
భేదభావం లేకుండా తాకిన చేతులవి...
సృష్టికి ప్రతిసృష్టి చేసే మరోబ్రహ్మ వంటి,
పచ్చదనాన్ని పాతే కృషీవలుడి చేతులవి...
మీరంతా ఏవో భాషలు గొప్పవంటారు కానీ,
మా మౌనాన్ని కూడా చదివిన చేతులవి...

ఎక్కడో తుప్పల్లో పడున్న మమ్మల్నిపీకి,
భద్రంగా పొదువుకుని తెచ్చిన చేతులవి...
ఎదిగేందుకు తగినంత స్థలం చూపి,
లోతుగా మట్టిలో నాటిన చేతులవి...
నారుపోసిన వాడే నీరు పొయ్యాలని,
అనుక్షణం కాపాడుకున్న చేతులవి...

చీడపీడలు, వేరు పురుగులు మమ్మల్ని
నిలువెల్లా తొలిచేందుకు ప్రయత్నిస్తే,
తనకే చీడపట్టినట్లు దిగులుపడిపోయి,
మందులతో చికిత్స చేసిన చేతులవి...
కలుపుమొక్క మా సారాన్ని పిండుతుంటే,
పెకిలించి, తృప్తిగా నిట్టూర్చిన చేతులవి...కొమ్మకో రెమ్మ వేస్తూ ఎదుగుతుంటే,
లేతాకుల్లో లేనవ్వుల్నినిమిరిన చేతులవి...
అప్పుడో ఇప్పుడో ఓ పువ్వు పూస్తే,
అపురూపంగా తడిమి మురిసిన చేతులవి...
భూమిని దున్ని, ఎరువులు తెచ్చివేసి,
తన చేతికి ఆశుద్ధాన్ని అలముకుని,
మాకు కొత్తఊపిరి పోసిన చేతులవి...

ప్రకృతి సవాళ్ళను మొండిగా ఎదుర్కుంటూ,
జీవకోటికి ఊపిరి పొయ్యమన్న చేతులవి...
అందరూ మాలో పైనున్నవసంతాన్నిచూస్తే,
లోలోని దాహార్తిని మౌనంగానే గమనించి,
కడుపు నిండేదాకా నీళ్ళు పట్టిన చేతులవి...
వేలెడంత మేము ఆకాశమంత ఎదిగితే,
మామధ్య మహారాజులా దర్పంగా తిరుగుతూ,
నిండు మనసుతో దీవించిన చేతులవి...

అన్నదానం గొప్పదని చెబుతుంటారు...
మరి మాకు, మావల్ల మీకు ఊపిరి పోసి,
రుధిరాన్నిహరితంగా మార్చి తరించాడు...
చమటోడ్చి పట్టెడు మెతుకులు తిన్నాడు...
అలుపెరుగని అలలా ఆ నిత్యశ్రామికుడు
చివరి క్షణందాకా పనిచేస్తూనే ఉన్నాడు.
తాను మౌనంగానే నిష్క్రమించాడు...

అమ్మ లేని అనాధల్లా, అల్లాడుతూ,
కదలలేని మేము, మా నెచ్చెలి చెట్లూ,
ఆ ఆత్మశాంతికై మౌనం పాటిస్తున్నాము.
మేఘమా, ఆ ఆర్తితీరేలా కరుణించి వర్షించు,
మేము తలంటు పోసుకుని, శుద్ధమవ్వాలి.
మూగవోయిన తోట చక్రవాకం పాడుతోంది.
పనే దైవమని నమ్మిన ఆ పుణ్యాత్ముడ్ని,
అక్కున జేర్చుకోమని దైవాన్నిఅర్ధిస్తున్నాము.
మళ్ళీ జన్మంటూ ఉంటే, మేమే అతనిగా పుట్టి,
అతనిలో హరితనందనాన్ని నింపిచూస్తూ,
ఋణం తీర్చుకోవాలని ప్రార్ధిస్తున్నాము.


(నిన్నటిదాకా తోటలో ఆరోగ్యంగా పనిచేసుకున్న మా ఫ్లాట్స్ తోటమాలి, నిన్నహఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మాకీ వసంతాన్ని పంచి తాను శిశిరంలో పండుటాకులా రాలిన అతనికి కృతజ్ఞతాపూర్వక అశ్రునయనాలతో ఈ కవిత అంకితం... ఒక్కక్షణం... కవిత రాసి సరిపెట్టేసారా, అనకండి. కుటుంబానికి నా వంతుగా కాస్త ధనసాయం చేసాను... అంతకు మించి... రోజూ శివాలయం శుభ్రం చేసి, అభిషేకానికి నీళ్ళుపెట్టి, క్రింద పడ్డ నీళ్ళను తుడిచి వస్తాను. ఒకవేళ ఇందులో పుణ్యం ఏదైనా ఉంటే... అదీరోజుకి మా తోటమాలి ఆత్మకు ప్రసాదించమని, అతనికి ఉత్తమ జన్మ కలిగించేలా కరుణించమని, ఆ శివుడిని వేడుకున్నాను. అంతా ఆయన దయ. )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి