12, ఏప్రిల్ 2016, మంగళవారం

అంబరాన్నంటిన సంబరం

అంబరాన్నంటిన సంబరం
------------------------------
భావరాజు పద్మిని - 12/4/06

ఒక మౌనప్రభాతం...
కలల వాకిళ్ళను మూసి,
మనసు కన్నులు తెరిచి,
ప్రకృతి ముంగిట నిలిచాను.

ఝుమ్మని చుట్టేసింది...
తుంటరి మలయసమీరం.
సంపెంగల వాసనేమో,
తనతో మోసుకొచ్చింది.
అలా వెళ్లివద్దాం రా, అంటూ
నన్నూ తనతో తీసుకుపోయింది .

అలా వెళ్ళిన నేను...

రాత్రంతా వెన్నెల తరగల్లో తడిసిన
కొబ్బరాకులలో గుసగుసగా మారాను.

పూల రెక్కల సింహాసనంపై దర్జాగా కూర్చున్న
హిమబిందువులో ఇంద్రధనసై మెరిసాను.



విరితేనెల మధురిమలన్నీ మౌనంగా దోచే,
భ్రమర నాదంలో చేరి రవళించాను.

పచ్చని పచ్చిక తివాసీని సుతారంగా తాకి,
గడ్డిపూల సోయగాలలో ఒదిగిపోయాను.

ఎక్కడో కొండ లోయల్లో ప్రతిధ్వనించే
శుకపికాల కలరవాల్లో కరిగిపోయాను.

నింగికెగసే గువ్వల రెక్కల్లోని ఆశగా మారి,
దిగంతాల వైశాల్యాన్ని సవాలుచేసాను.

మేఘాల గుండెల్లో బరువైన రాగాన్నై,
కొండల్నిఢీకొని చినుకుగా నేలకు జారాను.

జలజలా జాలువారే జలపాత గీతికలో,
నేనూ ఒక బిందువునై పరుగులుతీసాను.

నదుల గుండెల్లో వలపుసడినై,
సంద్రపు అలల్లో తెలినురుగునై,
ఇసుక తిన్నెలతో ఊసులాడుతూ,
గ్రీష్మ తాపానికి మళ్ళీ ఆవిరయ్యాను.
మలయపవనంలో కలిసి తేలిపోయాను.

అరె...
నేనింకా ఇక్కడే ఉన్నానా?
అయితే...
రవాన్నై, వనాన్నై, స్వనాన్నై,
రాగాన్నై, గీతాన్నై, నాదాన్నైన,
ఈ సందడంతా, ప్రకృతి లాలిత్యానికి,
అంబరాన్నంటిన నా సంబరానిదా?
అవునంటూ, మేనుతాకిన సమీరం,
మళ్ళీవెళ్దాం వస్తావా, అంది చిలిపిగా!

(సమస్త సృష్టిని మైమరపింపచేసే ముగ్ధప్రకృతికి ఈ కవిత అంకితం...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి