3, జులై 2016, ఆదివారం

సాహితీ యుగకర్త

సాహితీ యుగకర్త
---------------------------
భావరాజు పద్మిని - 7/4/2016

కవే కదా అనుకున్నాను.
కానీ...
తెలుగు కవనవన మరందాలను
కోట్లాది మనసులకు పంచిన
నవకావ్య చక్రవర్తి అనుకోలేదు.

పాటలే రాస్తారనుకున్నాను.
కానీ...
మేటి మాటల మూటల్ని
తెలుగునాట నిక్షిప్తం చేసిన
తరగని గని అనుకోలేదు.

భక్తుడేమో అనుకున్నాను.
కానీ...
భారమైన బ్రతుకుల్ని చదివిన
భవబంధాల పసేవిటో తెలిసిన
యోగిపుంగవుడని అనుకోలేదు.

మార్గదర్శి అనుకున్నాను.
కాని...
గాయమైన గుండెల వేదనను
గేయాల పూతతో నివారించే
దార్శనికుడని అనుకోలేదు.


'సిరి వెన్నెలే' కదా, అనుకున్నాను.
కాని...
ఆ వెన్నెల చలువతోనే కవనాల
కలువ అక్షరాలు విరబూయించిన
మహిమాన్వితుడని అనుకోలేదు.

వ్యక్తే కదా అనుకున్నాను.
కాని...
కేవలం అక్షరాల మాయాగారడీతో
ధైర్యం నూరిపోసి కదనుతొక్కించే
మహాదివ్య శక్తివంతుడనుకోలేదు.




ఇప్పుడెందుకో నాకు కళ్ళముందు
ఆ మహనీయుడి విరాట్ స్వరూపం
సమున్నతమైన శిఖరంలా గోచరిస్తోంది.
అరుగో...
ఆ సాహితీ యుగకర్త చుట్టూరా
ఆయన అక్షరాల అస్త్రాలుధరించి,
భక్తితో నమస్కరించే ఏకలవ్యశిష్యులు...
సాహితీ శరసంధానానికి సిద్ధంగా ఉన్నారు.

అడుగడుగునా కలాలు పట్టుకుని,
సుతారంగా మనసుల్ని స్ప్రుశించేందుకు,
సద్భావాలను భవితకు పంచేందుకు,
సమాజ జాడ్యాల్ని సవాలు చేసేందుకు,
అన్యాయాలను చీల్చి చండాడేందుకు,
అక్రమాలను నిగ్గదీసి ప్రశ్నించేందుకు,
మొక్కవోని ధైర్యంతో ముందుకురికే,
వేవేల సాహితీసేన కనిపిస్తున్నారు.

గీతాచార్యుడి కంటే గొప్ప కాదూ...
ఈ సాహితీ భగవద్గీతాచార్యుడు!
అజ్ఞాతంగానే అక్షరోపదేశం చేసి,
తెలుగింటి మనసులెన్నో చెక్కి,
తన ప్రతిబింబాల్ని రూపుదీర్చి,
సాహితీ సమరాంగణం కోసమై,
సర్వత్రా సన్నద్ధం చేసారు.

అందుకే ఈ సాహితీ యుగకర్త,
అక్షరం ఉన్నంత వరకూ...
వేవేల మానససరోవరాల్లో మెరిసే,
'సిరివెన్నెల' పున్నమి చంద్రుడే !

(కొందరి అక్షరాలు చూస్తే, సిరివెన్నెల గారి ఛాయలు కనిపిస్తాయి. అదేవిటో వాళ్ళను అదే సంగతి అడిగితే, 'నేను సిరివెన్నెల గారి వీరాభిమానిని, ఏకలవ్య శిష్యుడ్ని' అంటారు. నేనూ అంతే, ఒక్కో మాటని పాటలో ఎలా రాయచ్చో, విని, నేర్చుకుంటూ ఉంటాను. ఒక్క కృష్ణుడు వేవేల అర్జునులకు గీతోపదేశం చేసినట్టు, సిరివెన్నెల గారు అక్షరోపదేశం చేసారా అనిపిస్తుంది. మౌనంగానే వారు చేసిన ఈ మాయాజాలం తెలుగింట అక్షరాన్ని సుసంపన్నం చేసింది... చిరంజీవిని చేసింది. అందుకే, భక్తితో వారికీ కవితా కానుక.)

1 కామెంట్‌:

  1. అవునండీ, మన గురువు గారు సాహితీ యుగకర్త... ఇది "అక్షర" సత్యం... ఆ మహా మనీషిని తలచుకుంటే చాలు అక్షరామృత సాగరంలో వేవేల మునకలు వేసినట్లు ఉంటుంది...

    గురువు గారిపై కురిపించిన మీ అక్షరాభిషేకం మహాద్భుతం...

    @చైతన్యం
    (అందరిలాగే గురువు గారి ఏకలవ్య శిష్యుడిని)

    రిప్లయితొలగించండి