9, జులై 2016, శనివారం

ఓ బొమ్మ ఆత్మకధ

ఓ బొమ్మ ఆత్మకధ 
---------------------------
భావరాజు పద్మిని- 13.2.16


నేనొక బొమ్మనే...
జీవం లేని దారాల ముద్దనే...
కానీ, నాకే మాటలొస్తే,
నా కధను చెబుతాను వింటారా?

ఏవేవో దూది పింజలు వడికి
మెత్తని తోలులో కూరి, కుట్టి,
గాజు కళ్ళు, ముక్కు అతికి,
గొలుసులతో ముస్తాబు చేసి,
నన్నేదో అంగడి గదికి పంపారు.

ఒక పాప పిలిస్తే తెలిసింది ...
నన్ను టెడ్డీ బేర్ అంటారట.
మరి నాకంటే ముద్దుగా ఉన్న
పాపేమో పింకీ అట.
తనంత ఎత్తున్న నన్ను,
కొనేదాకా మారం చేసింది.
నాకూ సంతోషమేగా...
నాకో అమ్మ దొరికింది.
బొమ్మకు పాపే అమ్మ కదా!



చాలా బొమ్మలు ఉన్నాయక్కడ,
వాటిలో నేనూ ఒక మూలన.
ఎప్పుడో ఆడేందుకు తీసినా, 
వేరే బొమ్మలతో పోటీనే నాకు.
ఒకరోజు పాలగ్లాసు ఒలికింది,
నా పేరు డర్టీ బేర్ అయ్యింది.
అప్పటిదాకా నా అందాన్ని,
అందరికీ చూపి మురిసిన పాప,
నన్ను తాకడమే మానేసింది.

పాప పుట్టినరోజు వచ్చింది
కొత్త బొమ్మల కొండ మధ్య
నేనో దిష్టి బొమ్మనయ్యాను.
మర్నాడు ఓ బీద బాబుకు 
నన్ను కానుకగా ఇచ్చేసారు,
బాధగా పాపనొదిలి వెళ్ళాను.

అదొక చిన్న పూరిగుడిసె...
అదేవిటో, అసలు బొమ్మలే లేవక్కడ .
ఒక్కగానొక్క బొమ్మనని యెంత అపురూపమో !
స్నానం చేయించేసారు, మళ్ళీ మెరిసిపోసాగాను,
నన్ను చూసిన బాబు కళ్ళూ మెరిసాయి. 
బాబుకు నేనే లోకం ...
పాలు త్రాగే దగ్గరినుంచి, పడుకునే దాకా !
నాకూ పెట్టమంటూ నన్ను చూపేవాడు, 
రోజంతా నాతో మాట్లాడుతూ ఉండేవాడు, 
ఎక్కడికి వెళ్ళినా నన్నూ తీసుకువెళ్ళేవాడు, 
నామీద ఎక్కి కూర్చుని, గుర్రం ఆట ఆడేవాడు, 
నామీదే వాలిపోయి, నిద్రపోయేవాడు, 
మళ్ళీ లేవగానే, నాకోసమే వెతుక్కునేవాడు, 
మాసిపోడం, మళ్ళీ స్నానం చేయించడం...

నల్లబడిపోతున్నాను... 
కుట్లు ఊడిపోయి, దూది బైటికొస్తోంది 
అయినా నా అందంతో వాడికి పనిలేదు 
అవే ఆటలు, అదే ప్రేమ, అవే కబుర్లు. 
పింకీ మనసు మినరల్ వాటర్ అయితే,
మలినాలు ఎన్నున్నా అంటని,
గంగానది వంటిది బాబుమనసు.

నాకు తెలిసిపోతోంది...
నా ప్రాణాలు గాల్లో కలవబోతున్నాయి. 
నాలోని దూదంతా క్రమంగా ఎగిరిపోతోంది. 
కాని, నానుంచి విడివడే ప్రతి దూదిపింజ, 
బాబు ప్రేమతో తడిసినదే !
పుట్టిన ప్రతి ప్రాణి కోరుకునేది ప్రేమేనట !
కణకణమూ ప్రేమతో రాగరంజితమవడమే,
జన్మకు సార్ధకత అని అంటారట !నిజమేనా?
అయితే, నా జన్మా తరించినట్లేగా...
తృప్తిగా లోకానికి వీడ్కోలు పలుకుతూ,
చెత్త మంటల్లో చెత్తగా కాలిపోతూ...
బాబు జ్ఞాపకాలతో హాయిగా వెళ్ళిపోతున్నాను.

( అపురూపంగా చిన్నారులు చూసుకునే బొమ్మలకు ప్రేమతో అంకితం...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి