18, డిసెంబర్ 2014, గురువారం

నేనొక జీవనదిని

నేనొక జీవనదిని 
--------------------
భావరాజు పద్మిని - 18/12/14

నేనొక జీవనదిని...
సవాళ్ళనే ఎత్తైన కొండల్నీ,
అడ్డంకులనే లోతైన లోయల్ని,
ఒంటిగా తెగించి దాటుకు మళ్ళుతూ,
అంచెలంచెలుగా ముందుకు సాగే...
మౌన సజీవ స్రవంతిని.

కొందరు నన్ను నదీమతల్లి అంటారు...
చెయ్యెత్తి మొక్కి, హారతులు ఇస్తారు...
కొందరు నా మొహమ్మీదే ఉమ్మేస్తారు..
కొందరు నా పైకి రాళ్ళు విసురుతారు...
ఏదీ ఇమ్మని అడగలేదు, అందుకే...
అదైనా ఒకటే, ఇదైనా ఒకటే నాకు.



కొత్తగా వచ్చి చేరతాయ్ కొన్ని పాయలు 
విడిపోయి వెళ్తుంటాయ్ కొన్ని పాయలు 
దుడుగ్గా దూకి నొప్పిస్తాయ్ జలపాతాలు  
వచ్చాయని పొంగను, పోయాయని కుంగను 
పయనమే శ్వాసగా నడిచే పాదచారిని,
గమనమే బాసటై కదిలే బాటసారిని.

దాహార్తి తీర్చినప్పుడు దేవతని,
పైరుకు జీవాన్ని అందిస్తే అన్నపూర్ణని,
ఉద్వేగాల ఉప్పైనై ముంచితే దెయ్యాన్ని,
గుండె మండి ఎండితే మురుగునీటి చెలమని,
ఏదైనా, ఏమన్నా...
చూసే కళ్ళలో తేడా, కాని నేనెప్పుడూ ఒక్కటే !

నేటి 'యూస్ అండ్ త్రో ' తరంలో 
ఏరు దాటేదాకే ఏ బంధమైనా...
మందుల మీద బతికే మనుషుల బంధాలకు కూడా,
ఆ మందుల్లాగే ఇప్పుడు ఎక్ష్పైరీ డేట్లు ఉంటాయేమో!
అందుకే నాలో సుడిగుండాలున్నా గర్భంలోనే దాచి,
గట్టు దాటే ఉద్వేగాలను గుండెలోతుల్లోనే అదిమి,
సాగిపోతూనే ఉంటాను...

నా గమ్యం ఒక్కటే...
ఏ నాటికైనా ఆ విధాత పాదాలు కడిగాలని,
మలినాలని, పాపాలని, ప్రతి జీవ కణాన్ని,
ఆనందంగా మోసుకెళ్ళి ఆయనలో లయమవ్వాలని, 
సంద్రం వంటి ఆయన స్పర్శతో పునీతమవ్వాలని !


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి