నిన్ను చేరాలని...
---------------------
(భావరాజు పద్మిని – 06 .10. 2014 )
నేనే... యువరాజు ఖుర్రం ను...
అక్బర్ ముద్దుల మనవడిని..
జహంగీరు ప్రియ పుత్రుడిని ...
ఉగ్గుపాలతో పాలన ఔపాసన పట్టాను
'ప్రపంచపు రాజు ' నని పేరు పొందాను
చక్రవర్తిని అయిన నా పరిపాలనం ...
మొఘల్ సామ్రాజ్యానికి స్వర్ణ యుగం .
నీవు... అర్జుమంద్ బాను బేగం..
19 వ ఏట నన్ను పెళ్ళాడావు.
నా అర్ధాంగివి,అర్దానివి నీవే అయ్యావు
పాలనలో,మంత్రాంగంలో అండగా నిలిచావు
రూపం, సుగుణం, యుక్తితో మురిపించావు
మహలుకే మేటిగా విజ్ఞులనే మెప్పించావు
'ముంతాజ్ మహల్' గా పేరు పొందావు
నా కోసం 14 సార్లు నీ ప్రాణం పణంగా పెట్టావు
14 వె సారి 30 గంటల ప్రసవ వేదన...
చూడలేక నా గుండె లోతుల్లో అరణ్యరోదన ...
ఎన్ని దానాలు చేసామో, ఎన్నిమార్లు ప్రార్ధించామో,
గాలిలో దీపంలా నీ ప్రాణం కొట్టుమిట్టాడుతుండగా
'అద్భుత సౌధాన్ని' సమాధిగా కట్టించమన్నావు
నీ ఆత్మదీపం నన్ను వీడి అల్లాహ్ ను చేరుకుంది.
రాజస్తాన్ నుండి వచ్చిన తెల్లటి పాలరాయిలో
28 రకాల రత్నాలు, రత్నఖచితాలు పొదిగారు
బుఖరా ,సిరియా, పర్షియా, శిల్పులు పిలువబడ్డారు
అహర్నిశలూ మలచి, ఖురాన్ మంత్రాలు చెక్కారు
37 మంది సృజనాత్మక బృందం మేలి వన్నెలద్దారు
20 వేల శ్రామికుల 22 ఏళ్ళు చెమటోడ్చి కష్టించారు
పర్షియన్ హిందూ ఇస్లాం శైలితో నగిషీలు దిద్దారు
అత్యంత సుందరమైన సమాధికి ఆకృతి నిచ్చారు.
వెన్నెల్లో వెండి వెలుగులతో ,
వేకువలో పసిడి జిలుగులతో,
మలిసంధ్యలో నారింజ వన్నెతో,
వానలో జలతారులా మెరుస్తూ,
నల్లటి యమున అలల చిత్రంపై,
తెల్లటి మేఘంలా దోబూచులాడుతూ ,
రమ్యమైన పాలరాతి ప్రేమ సౌధం,
చరిత్ర పుటల్లో ప్రేమ మందిరమయ్యింది.
కాని,
మన మూడో కొడుకే ముక్కంటి అయ్యాడు,
ఆగ్రా కోట మిద్దె గదిలో నన్నునిర్బందించాడు.
అనారోగ్యంతో, అసహాయతతో ఉండిపోయాను...
కిటికీ సందుల్లోంచి నా చూపంతా నీవైపే...
చార్ బాగ్ మధ్యన ప్రేమ సౌధం వంక చూస్తూ,
ప్రేమకే నిర్వచనంగా నిలిచిన నిన్నే తలుస్తున్నాను.
జానేమన్...
ఈ లోకంలో రాతి మనసుల తాకిడికి,
ఎంతో మంది సజీవ సమాధుల్లా బ్రతుకుతారు .
కానీ నువ్వు...
బ్రతుకే ఒక నందనవనం చేసావు..
గతించినా ప్రేమకు అమరత్వాన్ని ఇచ్చావు.
తాజ్ మహల్ లో గొప్పతనమంతా ,
మిరుమిట్లు గొలిపే నైపుణ్యానిది కాదు,
మేలి ముత్యం వంటి నీ ఆత్మశక్తిది.
అందుకే...
నీ సమాధి పైనే దృష్టి పెట్టి
తుది శ్వాస విడుస్తున్నా...
ఎడబాసిన నిన్ను చేరాలని...
ప్రేమ సౌధంలో ఏకమై నిలవాలని...
( తాజ్ మహల్ పై , షా జహాన్ జీవితంపై ,అనేక కధనాలు, వివాదాలు ఉన్నాయి. అయినా అది విశ్వానికి ఒక ప్రేమ సౌధం... వారి గాధకు అక్షర రూపం ఇవ్వాలనే ఈ చిన్ని ప్రయత్నం ...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి