15, అక్టోబర్ 2014, బుధవారం

నన్నూ బ్రతకనివ్వండి !

నన్నూ బ్రతకనివ్వండి !
 ---------------------
భావరాజు పద్మిని 

నేనే... అబలని...
అమ్మాయిని... ఆడపిల్లని... 
నీ ఉనికికి మూలాన్ని...
నీ ఇంట్లో అమ్మగా, తోబుట్టువుగా,
నీ ఒంట్లో రక్తంగా ప్రవహిస్తోంది నేనే !
అయితే మృగాళ్ళ మధ్య ఎన్నాళ్ళు 
బ్రతికుంటానో... నాకే తెలీదు...
ప్రతీక్షణం జీవన్మరణాల పోరాటమే !

కడుపులోనే ప్రాణం తీస్తారొకరు 
పురిటిలోనే ఎత్తుకు పోతారొకరు 
గొంతులో బియ్యపుగింజ వేస్తారొకరు 
చిట్టి పాపానే పాడుచేస్తారొకరు
అమ్మాయిని అపహరిస్తారొకరు
స్కూల్లో డేగకళ్ళతో వేచిఉంటారొకరు
బెదిరించి లొంగదీసుకుంటారొకరు 
ఎక్కడో మాటువేసి కాటేస్తారొకరు 
ఉద్యోగాల్లో వేధించి పీక్కుతింటారొకరు 
ఇంటికే వచ్చి కత్తితో భయపెడతారొకరు 
ఇంకెక్కడి భద్రత ? ఏదీ నాకు రక్షణ ? 



ఎంతటి గొప్ప సంగతి !
స్త్రీని దేవతగా పూజించే దేశంలో...
స్త్రీని నిలువునా తగలబెడుతున్నారు 
ఆసిడ్ పోసి ఒళ్ళంతా కాల్చేస్తున్నారు 
గొంతు నొక్కి పూడ్చేస్తున్నారు 
గొంతు కోసి పారేస్తున్నారు 
పొడిచి పొడిచి చంపుతున్నారు 
పైశాచికంగా చెరుస్తున్నారు 
ప్రేమో, పెళ్ళో,పగో, కోరికో... 
పేరు ఏదైతే నేమి ?
ఆటవికంగా తీసేది నా ప్రాణమే !

అవున్లే... కామం కమ్మిన వీళ్ళ కళ్ళకు 
పురుటి బిడ్డైనా ,అమ్మాయైనా, అవ్వైనా ఒకటే !
కొలతలే తప్ప మాలో కలతలు కనబడవు 
మాంసపు ముద్దలు, మెరుగులు తప్ప  
మాలోనూ మనసుందని కనబడదు  
మాకంటూ ఆశలు, ఆశయాలు ఉండవా ?
మాకూ జీవించే హక్కు లేదా ?
మొగ్గలోనే త్రుంచి చీల్చి వినోదించే 
మీరూ అసలు మనుషులేనా ?
చట్టాలు మీ చుట్టాలే కదా !
ఇంకెన్నాళ్ళు ఈ బలవన్మరణాలు ?

అన్నా ! బావా ! బాబాయ్ ! తాతా !
జంతువులైనా తమ జాతినే చంపవు 
పాము కూడా పామును కరవదు...
పులి పులిని వేటాడి పీక్కు తినదు ...
క్రూర జంతువులకైనా లేని కక్ష్య ...
రక్తమాంసాలు పీల్చే కర్కశత్వం ...
అణువణువూ చీల్చే కఠినత్వం 
విసిరి పారేసే కిరాతకత్వం ... 
మనుషుల్లో ఉండడం సిగ్గుచేటు !
ఇకనైనా మేల్కోండి ... ఆలోచించండి...
మమ్మల్ని బ్రతకనివ్వండి !

(ఎన్ని చట్టాలు వచ్చినా... రోజురోజుకూ ఆడపిల్లల స్థితి దయనీయంగా మారుతోంది... ఈ కవిత చదివి, ఒక్క రాతి మనసు మారినా... ఈ అక్షరాలు ధన్యమైనట్టే... ఆలోచించండి... మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే ఆడపిల్లల్ని మీ పిల్లల్లా ఆదరించి కనిపెట్టుకు ఉండండి...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి