అప్పుడెప్పుడో నువ్వు నా కడుపులో
తొలిసారి కలుక్కుమని కదలగానే,
నాలో నా ప్రాణం ఊపిరిపోసుకుంటోందని,
నన్ను "అమ్మ"ను చేస్తుందని మురిసిపోయాను.
నా కలలపంటగా నువ్వొచ్చావు,
నా ప్రేమనంతా చనుబాలుగా అందించాను,
నాకోసం నవ్వితే, నిలువెల్లా పులకించాను,
నువ్వు తొలి సారి మ్మ, మ్మ మ్మా...అంటే,
ప్రపంచాన్ని జయించినంత ఆనందించాను.
నీ ముద్దు మాటలు, బుడిబుడి అడుగులు,
నీ వడివడి పరుగులు, దాగుడుమూతలు,
కాలం ఎలా గడిచిపోయిందో తెలీదు...
నీ రాకతో నా లోకమే మారిపోయింది.
నీకు జలుబు చేసినా, జ్వరం వచ్చినా,
దెబ్బతగిలినా, బొప్పికట్టినా, నొప్పిపెట్టినా,
నీ కంటి నీరు ఉప్పెనై నన్ను ముంచేసేది.
నీ కోసం వెయ్యి దేవుళ్ళకు మ్రొక్కేదాన్ని,
ప్రతి క్షణం నీ మేలు కోసం తపించేదాన్ని.
ఒక్కగానొక్క బిడ్డ సంతోషంగా ఉండాలని,
నేనెంత బాధపడ్డా కనబడకుండా తిరిగేదాన్ని.
ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి,
రేపోమాపో మా బిడ్డ ఇంజనీర్ అనే లోపే,
చేతికి అందివచ్చిన నిన్ను దీవించే లోపే,
నాకు చెప్పకుండా అడుగెయ్యని నువ్వు,
అందనంత దూరం వెళ్ళిపోయావట....
పదిహేనురోజులు ఆశనిరాశల ఊగిసలాట,
నువ్వు బ్రతికేఉంటావన్న వెర్రి ఆశ...
నువ్వు తిరిగి రావాలన్న తీరని కాంక్ష,
అది కూడా ఇవాళ కొట్టుకుపోయింది,
నీ శవం దొరకగానే అమ్మ చచ్చిపోయింది.
ఇక ఏం మిగిలిందని నాకు...
నా లోకమంతా శూన్యం,నా బ్రతుకంతా చీకటి.
గుండెలవిసేలా ఏడ్చినా బాధ తీరదు,
నువ్వులేవన్న నిజం నా మనసు నమ్మదు.
సుడులు తిరిగేబాధతో నా గుండె ఆగిపోదే ?
నా ఊపిరి తీగలు తెగిపోయినా ప్రాణం పోదే ?
హే భగవాన్ ! ఒక్క క్షణం...
నా బిడ్డ ప్రాణం బదులు నా ప్రాణం ఇవ్వమంటే,
ఆనందంగా ఇచ్చేసేదాన్ని...
ఎందుకు నీకు మనుషులంటే ఇంత అలుసు?
కడుపుకోత ఏమిటో కన్నపెగుకే తెలుసు.
నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డే పోయాకా,
ఇక నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ?
నన్ను తీసుకుపో... తీసుకుపో...
*************************************************
అమ్మా ! ఏడవకమ్మా !
నేను ఎక్కడికీ పోలేదు, ఇదిగో చూడు,
నా చేతులతో నిన్ను అల్లుకుంటున్నా,
అమ్మా, అమ్మా, అని గొంతెత్తి పిలుస్తున్నా...
అయినా...నువ్వు చూడలేవు, వినలేవు.
ఆనందంగా కేరింతలు కొడుతున్న నన్ను,
నీటి ఉప్పెన ఒక్కపట్టున ముంచేసింది,
ఆ క్షణంలో నువ్వు, నీ నవ్వు గుర్తొచ్చాయి,
ఊపిరితిత్తులలోకి నీళ్ళు నిండుతుంటే,
కొడిగట్టే దీపంలా ప్రాణం కొట్టుకుంటుంటే,
చివరి ఆశతో అమ్మా,అమ్మా అంటూ వేదన,
జాలి, దయ చూపని విధిచేతిలో అరణ్యరోదన.
మరణం చేతిలో నేను ఓడిపోయానమ్మా...
అయినా నిన్ను చూడాలని, మాట్లాడాలని,
నీ ఒళ్లో తలపెట్టుకు పడుకోవాలని,
నా ఆత్మ వడివడిగా నీ వద్దకు వచ్చింది.
నీ ప్రక్కనే ఉన్నా, నీ కన్నీళ్లు తుడవలేను,
నీ దుఃఖం చూస్తున్నా, ఓదార్చలేను.
నీకొకటి తెలుసామ్మా ?
చివరి క్షణంలో నేను పడ్డ నరకయాతన,
నిన్ను చూసి ఇప్పుడు ప్రతీ క్షణం పడుతున్నా,
పగలనకా రాత్రనకా కుమిలే నిన్నుచూసి,
నిముషానికోసారి చచ్చిపోతున్నా...
నీ వేదన చూడలేక, నా ఆత్మ క్షోభిస్తోంది.
మా అమ్మ, ఎప్పటిలా నవ్వుతూ ఉండాలి,
వికసించిన పద్మంలా, విరగాసిన వెన్నెలలా,
అల్లరి కెరటంలా ,అందరి తల్లోనాలుకలా ఉండాలి.
ఎన్ని జన్మలెత్తినా ఈ అమ్మ కడుపునే పుట్టాలి.
ఇదే నా కోరిక...
నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా...
ఇదివరకు నువ్వూ, నేనూ ఇద్దరం,
ఇప్పుడు నీలోనే నేను, నువ్వు నవ్వితే నవ్వుతా,
ఏడిస్తే ఏడుస్తా, నువ్వు తింటే నేనూ తింటా.
నీకు తోడుగా, నీడగా నీవెంట నేనుంటా.
ఒక్కోసారి మనిషి హృదయ వైశాల్యం పెంచేందుకు,
దేవుడిలా పరీక్షిస్తాడేమో !
పోయిన నీ బిడ్డ దగ్గరే ఆగద్దమ్మా,
అమ్మ లేని ఎందరో బిడ్డల్ని అక్కున చేర్చుకో,
వాళ్ళ నవ్వుల్లో నన్ను చూసుకో...
సేవాభావంతో వేదన కరిగించుకో,
అందరికి తిరిగి అమ్మవైన నిన్నుచూసి,
నాకు ఆత్మశాంతి కలుగుతుంది.
ఏ మనిషి పయనమైనా ఇంతేనమ్మా..
“ తమసోమా జ్యోతిర్గమయ “
అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుకు...
భావరాజు పద్మిని,
22/06/2014.