8, అక్టోబర్ 2014, బుధవారం

శ్రీగురుని చరణాలు

శ్రీగురుని చరణాలు - గేయం 
----------------------------------
భావరాజు పద్మిని - 08/10/2014

శ్రీగురుని చరణాల భజియించు మనసా !
శ్రీధరుడే శరణని స్మరియించు మనసా !

గురు రూపమున నుండు సకల దేవతలు 
గురు వాక్కున నుండు సకల మంత్రాలు 
గురు పాదుకలనుండు సకల తీర్థాలు 
గురునెరింగిన జన్మధన్యమే మనసా !

గురు వరద హస్తమే భవరోగహరణం 
గురు రక్ష కవచమే ఆపన్నివారణం 
గురు కృపా దృష్టియే భవసాగర తరణం 
గురుసేవతో నీవు తరియించు మనసా !

గురు దర్శనమే నీకు శుభదాయకం 
గురు బోధలే నీకు మధు సేవనం 
గురు నామమే నీకు శుభ తారకం  
గురు సన్నిధే సిసలైన పెన్నిధే మనసా !



6, అక్టోబర్ 2014, సోమవారం

నిన్ను చేరాలని...

నిన్ను చేరాలని...
---------------------
(భావరాజు పద్మిని – 06 .10. 2014 ) 

నేనే... యువరాజు ఖుర్రం ను...
అక్బర్ ముద్దుల మనవడిని..
జహంగీరు ప్రియ పుత్రుడిని ...
ఉగ్గుపాలతో పాలన ఔపాసన పట్టాను 
'ప్రపంచపు రాజు ' నని పేరు పొందాను 
చక్రవర్తిని అయిన నా పరిపాలనం ...
మొఘల్ సామ్రాజ్యానికి స్వర్ణ యుగం .

నీవు... అర్జుమంద్ బాను బేగం..
19 వ ఏట నన్ను పెళ్ళాడావు.
నా అర్ధాంగివి,అర్దానివి నీవే అయ్యావు
పాలనలో,మంత్రాంగంలో అండగా నిలిచావు 
రూపం, సుగుణం, యుక్తితో మురిపించావు 
మహలుకే మేటిగా విజ్ఞులనే మెప్పించావు 
'ముంతాజ్ మహల్' గా పేరు పొందావు 


నా కోసం 14 సార్లు నీ ప్రాణం పణంగా పెట్టావు 
14 వె సారి 30 గంటల ప్రసవ వేదన...
చూడలేక నా గుండె లోతుల్లో అరణ్యరోదన ...
ఎన్ని దానాలు చేసామో, ఎన్నిమార్లు ప్రార్ధించామో,
గాలిలో దీపంలా నీ ప్రాణం కొట్టుమిట్టాడుతుండగా 
'అద్భుత సౌధాన్ని' సమాధిగా కట్టించమన్నావు
నీ ఆత్మదీపం నన్ను వీడి అల్లాహ్ ను చేరుకుంది.



రాజస్తాన్ నుండి వచ్చిన తెల్లటి పాలరాయిలో 
28 రకాల రత్నాలు, రత్నఖచితాలు పొదిగారు 
బుఖరా ,సిరియా, పర్షియా, శిల్పులు పిలువబడ్డారు 
అహర్నిశలూ మలచి, ఖురాన్ మంత్రాలు చెక్కారు
37 మంది సృజనాత్మక బృందం మేలి వన్నెలద్దారు
20 వేల శ్రామికుల 22 ఏళ్ళు చెమటోడ్చి కష్టించారు 
పర్షియన్ హిందూ ఇస్లాం శైలితో నగిషీలు దిద్దారు 
అత్యంత సుందరమైన సమాధికి ఆకృతి నిచ్చారు.

వెన్నెల్లో వెండి వెలుగులతో ,
వేకువలో పసిడి జిలుగులతో,
మలిసంధ్యలో నారింజ వన్నెతో,
వానలో జలతారులా మెరుస్తూ,
నల్లటి యమున అలల చిత్రంపై,
తెల్లటి మేఘంలా దోబూచులాడుతూ ,
రమ్యమైన పాలరాతి ప్రేమ సౌధం,
చరిత్ర పుటల్లో ప్రేమ మందిరమయ్యింది. 

కాని, 
మన మూడో కొడుకే ముక్కంటి అయ్యాడు,
ఆగ్రా కోట మిద్దె గదిలో నన్నునిర్బందించాడు.
అనారోగ్యంతో, అసహాయతతో ఉండిపోయాను...
కిటికీ సందుల్లోంచి నా చూపంతా నీవైపే...
చార్ బాగ్  మధ్యన ప్రేమ సౌధం వంక చూస్తూ,
ప్రేమకే నిర్వచనంగా నిలిచిన నిన్నే తలుస్తున్నాను.

జానేమన్...
ఈ లోకంలో రాతి మనసుల తాకిడికి,
ఎంతో మంది సజీవ సమాధుల్లా బ్రతుకుతారు .
కానీ నువ్వు...
బ్రతుకే ఒక నందనవనం చేసావు..
గతించినా ప్రేమకు అమరత్వాన్ని ఇచ్చావు.
తాజ్ మహల్ లో గొప్పతనమంతా , 
మిరుమిట్లు గొలిపే నైపుణ్యానిది కాదు,
మేలి ముత్యం వంటి నీ ఆత్మశక్తిది.

అందుకే...
నీ సమాధి పైనే దృష్టి పెట్టి 
తుది శ్వాస విడుస్తున్నా...
ఎడబాసిన నిన్ను చేరాలని...
ప్రేమ సౌధంలో ఏకమై నిలవాలని...

( తాజ్ మహల్ పై , షా జహాన్ జీవితంపై ,అనేక కధనాలు, వివాదాలు ఉన్నాయి. అయినా అది విశ్వానికి ఒక ప్రేమ సౌధం... వారి గాధకు అక్షర రూపం ఇవ్వాలనే ఈ చిన్ని ప్రయత్నం ...)







31, జులై 2014, గురువారం

ఉన్నవాడికి ఏవిటయ్యా పెట్టేది ?

ఉన్నవాడికి ఏవిటయ్యా పెట్టేది ?
-----------------------------------------
భావరాజు పద్మిని 
31/7/14 

చాలీచాలని బట్టలు, మాసిన మొహాలు 
కారే ముక్కులు, అట్టలుకట్టిన జుట్టు,
చెట్టుక్రింద బతుకులు, మట్టిలో పోర్లాటలు
కడుపునిండా ఆకలి, కంటినిండా ఆశలు...

జీనా యహాన్ మర్నా యహాన్ 
ఎండకు ఎండి, వానకు తడిసి,
చలికి ఒణికి, క్షణక్షణం జడిసి,
భావాలు, ఉద్వేగాలు, నవ్వులు, 
ఏడుపులు, స్నేహాలు, ప్రేమలు,
పట్టెడు మెతుకులకి కొట్లాటలు,
అన్నీ చెట్టు కింద చిట్టి గూటిలోనే...

దైవంలా ఎవరో ఒకరు వస్తారని,
తృణమో ఫణమో ఇస్తారేమోనని,
మట్టి కొట్టుకుపోయిన చేతులనిండా,
ఆ పూటకు ఏదో నింపుతారని,
వచ్చిందే అంతా పంచుకుతినాలని,
ఆశనిరాశల ఊగిసలాట...
ఏ పూటకు ఆ పూటే ఆకలివేట.



వాళ్ళు దారిద్ర నారాయణులని,
వాళ్ళను చూసి చీదరించుకోకు.
మనలాంటి మనుషులే వాళ్ళూనూ!
బీదరికం తాండవించే బ్రతుకులైనా,
ఆ మసి చేతులే నీకు అక్షయపాత్ర!

ఆ చేతులు పరమాత్మవని మర్చిపోకు,
దానం చేసే అవకాశం ఇస్తున్నాయవి నీకు,
నీ హృదయంలోని దయను పరీక్షిస్తున్నాయి.
పైనున్న నీ చెయ్యి చేసే దానం ఆయనకే!
చిన్న రొట్టెముక్క పెట్టినా పుణ్యఫలం నీకే! 
  
గుప్పెడు మెతుకుల కోసం 
గంపెడు పిల్లలు కొట్లాడడం 
ఎంతటి దయనీయం...
మానవత్వానికే అవమానం.
వారానికోసారైనా వెళ్లి దానం చెయ్యి...
అవిగో ఆ మట్టి చేతులు పిలుస్తున్నాయి...
భవతి భిక్షాం దేహి ! అయ్యా, దర్మం చెయ్యండి !


నేస్తమా,
సొంత లాభం కొంత మాని...
పార్టీలు, డాబుల పేరుతో,
ఉన్నవాళ్ళకు కుక్కడం మాని,
లేని వాళ్ళను అన్వేషించు.
వండి వడ్డించి, ప్రేమగా పంచు.
కడుపు నిండిన వాళ్ళ దీవెనలు...
నీ బ్రతుకును కళకళ లాడిస్తాయి.
నీ మనసుకు వెలలేని తృప్తి కలిగిస్తాయి.

అప్పుడు నీకు తెలుస్తుంది...
అవధూత వెంకయ్యస్వామి 
మాటల్లోని తియ్యటి అంతరార్ధం... 

"ఉన్నవాళ్ళకేమిటయ్యా పెట్టేది ?
వెళ్లి లేనివాళ్ళకు పెట్టు..."

ఇచ్చుటలో ఉన్నహాయి...
వేరెచ్చటనూ లేదోయి లేదోయి.

15, జూన్ 2014, ఆదివారం

ఆటవిడుపు - మేలుకొలుపు

ఆటవిడుపు - మేలుకొలుపు 
-----------------------------------

సమాజం మొత్తం బాగుండాలి నుంచి,
నా కుటుంబం బాగుండాలి అనే దాకా...
భార్యాభర్తలమిద్దరం బాగుండాలి నుంచి,
నేను బాగుంటే చాలు అనే దాకా,
మనిషి తిరోగమనం మొదలయ్యకా...

అదేవిటో బ్రతుకుల్లో చెప్పలేని వెలితి,
నాలుగు గోడల మధ్యా జైలు జీవితం, 
పంచభూతాలకు దూరంగా కృత్రిమత్వం, 
చుట్టూ అందరూ ఉన్నా ఒంటరితనం,
మనసుల్లో ఇదీ అని చెప్పలేని నైరాశ్యం.

అందుకేనేమో...
అలసినప్పుడు ఆటవిడుపు కోరుకుంటాం.
అమ్మ ఒడిని వెతుక్కుంటూ వెడతాం.
చల్లటి పిల్లగాలిని, పచ్చటి చెట్లని, 
నవ్వే పువ్వుల్ని, వినీలాకాశాన్ని, 
స్వేచ్చా విహంగాల్ని, చెరువు గట్టునీ,
కొండా కోనల్ని, సంధ్యవేళ మెరిసే తారల్ని,
ఆత్రంగా వెతుక్కుంటూ వెళ్లి ఆశ్రయిస్తాం.




తరతమ భేదాలు చూపదు కదా ప్రకృతి,
పేదాగొప్ప చూసి లాలించదుగా తన జగతి,
అందుకే అందరినీ సమానంగా ఆహ్వానిస్తుంది,
ఒక్కో ప్రాణిని ఆత్మీయంగా ఆదరిస్తుంది,
పుడమితల్లి ప్రేమైకహృదితో పొదువుకుంటుంది.

అలవోకగా చల్లటి చిరుజల్లులతో అభిషేకిస్తుంది,
నీరెండతో వాననీటి తడిని ఆరబెడుతుంది,
మలయసమీరపు దుస్తులు తొడుగుతుంది,
హరివిల్లు వర్ణాలతో నింగి గొడుగు పడుతుంది,
పచ్చిక బయళ్ళ పాన్పుపై పవళింపచేస్తుంది,
కొమ్మల ఊయలూపి అమ్మలా జోలపాడుతుంది.
ఇది నీ నిజమైన నెలవంటూ గుర్తుచేస్తుంది.

అలసిన మనసులు కొత్త ఊపిరి పోసుకుంటాయి,
రెక్కలు కట్టుకు స్వేచ్చా విహంగాల్లా ఎగురుతాయి,
చేపపిల్లల్లా చెంగుచెంగున నీటి అలలపై తేలుతాయి,
దీనంగా వచ్చిన మొహాలు దివ్యంగా వెలుగుతాయి,
వడిలిన వదనాల్లో నవ్వుల పున్నములు పూస్తాయి, 
ఆటవిడుపుకు వచ్చి మేలుకొలుపు పొందుతాయి.

అహాలు, దర్జాలు, దర్పాలు వదిలి, ఆటపాటల్లో తేలి,
వందేళ్ళ వృద్ధుల్లా వచ్చి, నెలల పసికందుగా మారి,
కేరింతలు కొడుతూ ఉత్సాహంగా వెళ్ళే తన బిడ్డల్ని,
అపురూపంగా మరోమారు కళ్ళారా చూసుకుని,
మళ్ళీ మళ్ళీ రమ్మంటూ మెల్లిగా విన్నవించి,
తృప్తిగా నిట్టూరుస్తూ పంపుతుంది తల్లి ప్రకృతి.

మళ్ళీ తను స్తబ్దంగా, మౌనంగా, నిర్మలంగా మారి,
మునుపటి సౌందర్యం, గాంభీర్యం, ముగ్ధత్వంతో,
తాను సేదదీర్చాల్సిన మరో జీవికై చూస్తుంటుంది,
వెళ్దామా మరి ఆ అమ్మ ఒడికి, మనందరి గుడికి ?
మనం మరచిన హరిత ఉద్యానవనపు సవ్వడికి ? 
మరొక్కసారి మన తొలి తప్పటడుగుల సందడికి ?
వెళ్ళొద్దామా మరి ?

(నిన్న చండీగర్ లోని సుఖ్నా లేక్ కు వెళ్లినప్పుడు కలిగిన అనుభూతికి ... అక్షరరూపం ఈ కవిత . )
భావరాజు పద్మిని,
15/6/14.

14, జూన్ 2014, శనివారం

నేనొక భావ సంద్రాన్ని...

నేనొక భావ సంద్రాన్ని...
-----------------------------

నేనొక భావ సంద్రాన్ని...
తలపుల అలలెగసే సాగరాన్ని.

ఆకాశంలో తళుక్కున మెరిసే,
అక్షర నక్షత్రాల పాలపుంతల్ని,
జ్ఞాపకాల మబ్బుల చాటున,
దోబూచులాడే ఊహల జాబిల్లిని,
ఆరాధనగా చూస్తుంటాను.


పున్నమి వెన్నెల వెలుగులో, 
నిండిన మనసుతో ఆహ్వానించే,
అంతరంగపు పిలుపును చూసి,
ఆనందతరంగాలతో ఉప్పొంగిపోతాను.
హృదయలయల్ని హృద్యంగా పలికిస్తాను. 


ముత్యపు చిప్పవంటి చిన్నిగుండెలో,
పదిలంగా దాచుకున్న అనుభూతులను,
ఉద్వేగపు అలలపై ఊగే ఆలోచనలకు,
తియ్యటి అక్షరాల తళుకులు అద్ది,
పసిడి పదాల నురగలు పొదిగి,
లయల్ని, హోయల్ని,కలగలిపి,
ఇసుక తిన్నెల కాగితాలపై రాసేస్తాను.
 
ఏ కధల నదులు, ఏ కవితాఝరులు,  
ఏ జీవన స్రవంతులు, ఏ కావ్యకన్యకలు, 
నాలో కలవాలని ఉరికి వచ్చినా,
చేతులు చాచి వాకిట నిలిచి,
మనసారా రమ్మంటూస్వాగతిస్తాను.
వాటి వర్ణాలన్నీ సంతరించుకుంటాను,
వేవేల మధురిమల్ని ఆస్వాదిస్తాను.

అయితే...
వడి, వేగం, ఉప్పొంగే నేను,
నిశ్చల, గంభీర సాగరం వంటి నేను,
ఒక్క అక్షరం గుండె తలుపు తడితే...
అలలతో పాదాలు కడిగి అభిషేకిస్తాను.
ఒక్క భావం నిలువెల్లా స్పందింపచేస్తే,
చెమ్మగిల్లిన కళ్ళతో ఆవిరౌతాను.
ఆర్ద్ర మేఘాన్నయ్యి మౌనంగా వర్షిస్తాను,
అక్షరసరస్వతికి ఆగి మోకరిల్లుతాను.
వేణినై, వీణనై, వాణికి దాసోహమంటాను.

భావరాజు పద్మిని 
14/6/14.



27, మే 2014, మంగళవారం

// పసిడి వసంతం //

// పసిడి వసంతం //

ఏడాదికి ఓ సారైనా నువ్వు వస్తావని,
వసంతాల పులకలు తీసుకోస్తావని,
తరువెల్లా తపనతో ఎదురుచుస్తుంటాను.

మోడైనా, బీడైనా, ఎండినా, వడిలినా 
నువ్వు వస్తావన్న ఆశతో జీవిస్తాను.
నిలువెల్లా నిన్ను నింపుకోవాలని,
అణువణువునా అలముకోవాలని,
మౌనమునిలా తపస్సు చేస్తుంటాను.

నువ్వు రాగానే...
నాలోని జీవాన్ని నీతో కలిపేస్తాను,
ఒళ్ళంతా వేవేల పూలు పూసుకుని,
బంగారు గొలుసుల్లో నిన్ను బంధిస్తాను.
ఆకులో, పువ్వులో,కొమ్మలో,రెమ్మలో 
నిన్నే చూసుకుని మురిసిపోతాను.

మన సంగమం...
పులకింతల పసిడి పూలు పూస్తుంది,
వనానికి స్వాగత తోరణాలు కడుతుంది,
సుమ దళాల విరివాన కురిపిస్తుంది,
చూసే కళ్ళలో ఆహ్లాదం నింపుతుంది,
మనసుల వాకిట ముగ్గులు పెడుతుంది.

వచ్చినట్టే వెళ్ళిపోతావు నువ్వు...
నిరీక్షణలో మునిగిపోతాను నేను...
ప్రేమ పూలై పండే క్షణం కోసం...
వలపు వెల్లువెత్తే తరుణం కోసం..
పసిడి వసంతం కోసం ...
ఎదురుచూస్తూనే ఉంటాను.

భావరాజు పద్మిని 
27/5/14.


(గోల్డెన్ చైన్ ట్రీ - ఏడాదికి ఓ సారి వసంతంలో పూసే ఈ చెట్టు, బంగారు రంగు గొలుసు పూలతో నయనమనోహరంగా ఉంటుంది. ఉదయం ఈ చెట్టును చూసినప్పుడు మనసులో కలిగిన భావనలకు అక్షర రూపం ఈ కవిత )


12, మార్చి 2014, బుధవారం

కృష్ణవేణి

కృష్ణవేణి 
రచన : భావరాజు పద్మిని 
ఎక్కడో సన్నగా పుడుతుంది,
కేరింతలతో మురిపిస్తుంది,
గలగలా మువ్వల సవ్వడి చేస్తుంది,
చకచకా పరుగులు తీస్తుంది,
రాళ్ళల్లో కూడా సడిని కలిగించే 
తన ప్రతీ కదలికా అపురూపమే!
ఆమె వన్నెల పరికిణీ కల కన్యక, 
బాలిక.... కన్నవారి కన్నుల వేడుక!

క్రమంగా గమన వేగం తగ్గుతుంది,
ఆటుపోట్లతో లోతు పెరుగుతుంది,
సుడిగుండాలు తట్టుకుంటుంది,
దిశ మారుస్తూ, ఒడ్డును కోస్తూ,
వంపుల మలుపులు తిరుగుతూ, 
కొత్త పాయలు కలుపుకుంటూ,
ఆమె మనోహర మందగమన ప్రౌఢ, 
జవరాలు అత్తింటి ఇల్లాలౌతుంది !

ఇప్పుడామె నదీమతల్లి, కల్పవల్లి,
పేగు తెంచి కొత్త ఊపిరి పోస్తుంది,
ప్రేమపంచి దారి చూపుతుంది,
తన పాయలు విడివడి పోతుంటే,
నిండు మనసుతో దీవిస్తుంది,
తన జన్మ సఫలమని భావించి,
తియ్యని జ్ఞాపకాల ఇసుక మేటలతో,
తృప్తిగా మలిమజిలీకై పయనిస్తుంది,
ఆమె,బ్రతుకు బువ్వ తృప్తిగా తిన్నఅవ్వ !

అవును....
నదీ గమనంలా , స్త్రీ జీవితంలోనూ 
మూడు దశలు ఉంటాయి  ....
ఆమె వివక్త , తరుణి , మందాకిని.
అలల దారంతో పున్నమి పూలు అల్లి,
మమతల జీవధారగా సాగే కృష్ణవేణి .

(కృష్ణవేణి = ఒక నది, నల్లని జడ కల స్త్రీ. వివక్త = స్త్రీ, పవిత్రమైనది... నదీ గమనంలో మూడు దశలు ఉంటాయి... అలాగే స్త్రీ జీవితంలో కూడా... అనే ఊహ ఈ కవితకు ప్రేరణ )
భావరాజు పద్మిని
8/3/14.