15, జూన్ 2014, ఆదివారం

ఆటవిడుపు - మేలుకొలుపు

ఆటవిడుపు - మేలుకొలుపు 
-----------------------------------

సమాజం మొత్తం బాగుండాలి నుంచి,
నా కుటుంబం బాగుండాలి అనే దాకా...
భార్యాభర్తలమిద్దరం బాగుండాలి నుంచి,
నేను బాగుంటే చాలు అనే దాకా,
మనిషి తిరోగమనం మొదలయ్యకా...

అదేవిటో బ్రతుకుల్లో చెప్పలేని వెలితి,
నాలుగు గోడల మధ్యా జైలు జీవితం, 
పంచభూతాలకు దూరంగా కృత్రిమత్వం, 
చుట్టూ అందరూ ఉన్నా ఒంటరితనం,
మనసుల్లో ఇదీ అని చెప్పలేని నైరాశ్యం.

అందుకేనేమో...
అలసినప్పుడు ఆటవిడుపు కోరుకుంటాం.
అమ్మ ఒడిని వెతుక్కుంటూ వెడతాం.
చల్లటి పిల్లగాలిని, పచ్చటి చెట్లని, 
నవ్వే పువ్వుల్ని, వినీలాకాశాన్ని, 
స్వేచ్చా విహంగాల్ని, చెరువు గట్టునీ,
కొండా కోనల్ని, సంధ్యవేళ మెరిసే తారల్ని,
ఆత్రంగా వెతుక్కుంటూ వెళ్లి ఆశ్రయిస్తాం.




తరతమ భేదాలు చూపదు కదా ప్రకృతి,
పేదాగొప్ప చూసి లాలించదుగా తన జగతి,
అందుకే అందరినీ సమానంగా ఆహ్వానిస్తుంది,
ఒక్కో ప్రాణిని ఆత్మీయంగా ఆదరిస్తుంది,
పుడమితల్లి ప్రేమైకహృదితో పొదువుకుంటుంది.

అలవోకగా చల్లటి చిరుజల్లులతో అభిషేకిస్తుంది,
నీరెండతో వాననీటి తడిని ఆరబెడుతుంది,
మలయసమీరపు దుస్తులు తొడుగుతుంది,
హరివిల్లు వర్ణాలతో నింగి గొడుగు పడుతుంది,
పచ్చిక బయళ్ళ పాన్పుపై పవళింపచేస్తుంది,
కొమ్మల ఊయలూపి అమ్మలా జోలపాడుతుంది.
ఇది నీ నిజమైన నెలవంటూ గుర్తుచేస్తుంది.

అలసిన మనసులు కొత్త ఊపిరి పోసుకుంటాయి,
రెక్కలు కట్టుకు స్వేచ్చా విహంగాల్లా ఎగురుతాయి,
చేపపిల్లల్లా చెంగుచెంగున నీటి అలలపై తేలుతాయి,
దీనంగా వచ్చిన మొహాలు దివ్యంగా వెలుగుతాయి,
వడిలిన వదనాల్లో నవ్వుల పున్నములు పూస్తాయి, 
ఆటవిడుపుకు వచ్చి మేలుకొలుపు పొందుతాయి.

అహాలు, దర్జాలు, దర్పాలు వదిలి, ఆటపాటల్లో తేలి,
వందేళ్ళ వృద్ధుల్లా వచ్చి, నెలల పసికందుగా మారి,
కేరింతలు కొడుతూ ఉత్సాహంగా వెళ్ళే తన బిడ్డల్ని,
అపురూపంగా మరోమారు కళ్ళారా చూసుకుని,
మళ్ళీ మళ్ళీ రమ్మంటూ మెల్లిగా విన్నవించి,
తృప్తిగా నిట్టూరుస్తూ పంపుతుంది తల్లి ప్రకృతి.

మళ్ళీ తను స్తబ్దంగా, మౌనంగా, నిర్మలంగా మారి,
మునుపటి సౌందర్యం, గాంభీర్యం, ముగ్ధత్వంతో,
తాను సేదదీర్చాల్సిన మరో జీవికై చూస్తుంటుంది,
వెళ్దామా మరి ఆ అమ్మ ఒడికి, మనందరి గుడికి ?
మనం మరచిన హరిత ఉద్యానవనపు సవ్వడికి ? 
మరొక్కసారి మన తొలి తప్పటడుగుల సందడికి ?
వెళ్ళొద్దామా మరి ?

(నిన్న చండీగర్ లోని సుఖ్నా లేక్ కు వెళ్లినప్పుడు కలిగిన అనుభూతికి ... అక్షరరూపం ఈ కవిత . )
భావరాజు పద్మిని,
15/6/14.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి