14, జూన్ 2014, శనివారం

నేనొక భావ సంద్రాన్ని...

నేనొక భావ సంద్రాన్ని...
-----------------------------

నేనొక భావ సంద్రాన్ని...
తలపుల అలలెగసే సాగరాన్ని.

ఆకాశంలో తళుక్కున మెరిసే,
అక్షర నక్షత్రాల పాలపుంతల్ని,
జ్ఞాపకాల మబ్బుల చాటున,
దోబూచులాడే ఊహల జాబిల్లిని,
ఆరాధనగా చూస్తుంటాను.


పున్నమి వెన్నెల వెలుగులో, 
నిండిన మనసుతో ఆహ్వానించే,
అంతరంగపు పిలుపును చూసి,
ఆనందతరంగాలతో ఉప్పొంగిపోతాను.
హృదయలయల్ని హృద్యంగా పలికిస్తాను. 


ముత్యపు చిప్పవంటి చిన్నిగుండెలో,
పదిలంగా దాచుకున్న అనుభూతులను,
ఉద్వేగపు అలలపై ఊగే ఆలోచనలకు,
తియ్యటి అక్షరాల తళుకులు అద్ది,
పసిడి పదాల నురగలు పొదిగి,
లయల్ని, హోయల్ని,కలగలిపి,
ఇసుక తిన్నెల కాగితాలపై రాసేస్తాను.
 
ఏ కధల నదులు, ఏ కవితాఝరులు,  
ఏ జీవన స్రవంతులు, ఏ కావ్యకన్యకలు, 
నాలో కలవాలని ఉరికి వచ్చినా,
చేతులు చాచి వాకిట నిలిచి,
మనసారా రమ్మంటూస్వాగతిస్తాను.
వాటి వర్ణాలన్నీ సంతరించుకుంటాను,
వేవేల మధురిమల్ని ఆస్వాదిస్తాను.

అయితే...
వడి, వేగం, ఉప్పొంగే నేను,
నిశ్చల, గంభీర సాగరం వంటి నేను,
ఒక్క అక్షరం గుండె తలుపు తడితే...
అలలతో పాదాలు కడిగి అభిషేకిస్తాను.
ఒక్క భావం నిలువెల్లా స్పందింపచేస్తే,
చెమ్మగిల్లిన కళ్ళతో ఆవిరౌతాను.
ఆర్ద్ర మేఘాన్నయ్యి మౌనంగా వర్షిస్తాను,
అక్షరసరస్వతికి ఆగి మోకరిల్లుతాను.
వేణినై, వీణనై, వాణికి దాసోహమంటాను.

భావరాజు పద్మిని 
14/6/14.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి