21, జూన్ 2013, శుక్రవారం

ప్రకృతి సందేశం

ప్రకృతి సందేశం 

పుట్టే ప్రతీ ప్రాణినీ...
హృదయభాషతో స్వాగతిస్తూ,
అభేధ భావంతో ఆదరిస్తూ,
తన కళలతో మురిపిస్తూ,
నిర్మలంగా ప్రేమిస్తూ,
నిశ్శబ్దంగా వోదారుస్తూ,
ఆత్మీయంగా ఆదరించే....అమ్మ ప్రకృతి.

ప్రతి రోజూ...
ప్రశాంత శుభోదయాన,
చుర్రున మండే మధ్యాహ్నాన,
మలయసమీరపు సాయంత్రాన,
వెన్నెల చలువల రాతిరిలోన,
కోటి రంగులు అద్దుకుని,
వినూత్నంగా విస్మయపరిచే...భావ ప్రకృతి.

చూసే కళ్ళకు మనసుంటే...
కటిక చీకటిలో- కోటి తారల్ని
నల్ల కోయిలలో- తీపి రాగాల్ని,
మందే ఎండల్లో- హరివిల్లు రంగుల్ని,
కొండ లోయల్లో- సెలయేటి పరవళ్ళని,
అనుభూతి కుంచెతో- గుండెపై చిత్రించి,
స్నిగ్ధంగా నవ్వే.....ముగ్ధ  ప్రకృతి.



యుగయుగాలుగా...
ఎన్నో చరితల పుటల్ని,
ఎన్నో రహస్య గాధల్ని,
ఎన్నో మధుర జ్ఞాపకాల్ని,
ఎన్నో ప్రకృతి వైపరీత్యాల్ని,
తనలోనే ఇముడ్చుకున్న....నిగూడ ప్రకృతి.

మౌనంగా ఉంటూనే,
ఎగసే అల అలవక తప్పదని,
విరిసే పువ్వు వదలక తప్పదని,
కురిసే చినుకు ఇగరక తప్పదని,
పుట్టిన జీవి గిట్టక తప్పదని,
చెప్పకనే చెప్పే..........నిర్వేద ప్రకృతి.

ఉన్నట్టుండి హటాత్తుగా,
తనపై జరిగే విధ్వంసాన్నివోర్వలేనట్టు,
వరదలతో ముంచెత్తి వేసి,
భూకంపాలతో మూలాలు పెకిలించి,
సునామీలతో ఉక్కిరిబిక్కిరి చేసి, 
ప్రమాదాలతో పోట్టనబెట్టుకుని,
భీబత్సంగా ప్రతిఘటించే....విలయ ప్రకృతి.

ప్రకృతి ఇచ్చే మౌన సందేశం...
ఎన్ని మెరుగులున్నా...వొదిగి ఉండాలని,
నిండు కుండలా- తొణక కూడదని,
మౌనంగానే- మమత పంచాలని,
ప్రేమకు లొంగని- ప్రాణి లేదని,
తను మన అధీనంలో కాదు---
మనం తన అధీనంలో ఉన్నామని.

స్పూర్తి

స్పూర్తి 
(పద్మిని భావరాజు , 21/6/2013)
-----------------------------------------

గలగల పారే సెలయేరు నీవు,
బండరాళ్ళు నీ గమనాన్ని ఆపలేవు.

తళతళ మెరిసే తారవు నీవు,
నీలిమబ్బులు నిన్ను దాచలేవు.

కిలకిల రావాల తీపి కోకిల నీవు,
కొమ్మమాటులు నీ గొంతు నొక్కలేవు.

జలజల రాలే తొలకరిజల్లువు నీవు,
సుడిగాలి తెర నిన్ను అడ్డుకోలేదు.

సలసల కాగే సూర్యుడు నీవు,
అరచేతిని అడ్డుపెట్టి నిరోధించలేరు.



నేస్తమా,
అసూయలు నీవు ఎదుగుతున్నవని సూచిస్తాయి,
అపనిందలు నిన్ను మరింత గట్టిపడేలా చేస్తాయి ,
అడ్డంకులు నిన్ను విజయానికి చేరువ చేస్తాయి.

మన సంకల్పబలమే మనకు అండ...
తీరానికి బలంగా డీ కొట్టితే ,
రెట్టింపు వేగంతో  లేస్తుంది కెరటం.
గోడకు బంతిని బలంగా విసిరితే, 
ఆ విసురుకే విసుగు పుట్టిస్తుంది బంతి.
బలమయిన సునామీ తర్వాతయినా,
ప్రశాంతంగానే ఉంటుంది ప్రకృతి.
ఇవన్నీ మనకు సహజ స్పూర్తి. 

లే, ఉదయభానుడి తొలి కిరణంలా,
శరత్కాలపు నిండు పున్నమిలా,
చిన్ని రెక్కల మిణుగురులా,
నీ మనసు దీపపు వెలుగులతో,
మళ్ళి లోకానికి నీ ప్రత్యూష కిరణాలు పంచు. 
 
 

14, జూన్ 2013, శుక్రవారం

ఇన్నాళ్ళూ ఎక్కడ దాచిందో...

ఇన్నాళ్ళూ ఎక్కడ దాచిందో... 
-----------------------------------


ఇన్నాళ్ళూ ఎక్కడ దాచిందో,
పుడమికాంత తన గర్భంలో,
నిద్రాణమై ఉన్న అనంతజీవ జాలాన్ని...

చినుకు తడి తగలగానే, ఒక్కసారిగా...

ఎన్ని చినుకులో అన్ని పులకలు,
ఎన్ని పులకలో అన్ని మొలకలు,
ఎన్ని మొలకలో అన్ని కులుకులు,
తమ అస్తిత్వాన్ని చూపే తొలి చిగురులు . 

ఆకుఆకులో ముత్యాలు పోదిగినట్టు,
మిలమిలా మెరిసేటి వాన చినుకులు . 
పిల్లగాలి కమ్మటి కొంటె ఊసులకి,
పరవశంగా తలలూపే చిగురుటాకులు. 
తుమ్మెదల ఝుంకార నాదానికి,
మధువులందించే లేత విరిబాలలు. 
తడిసిన మట్టి వలపు సుగంధాన్ని,
నలుదిశలా మోసుకెళ్ళే తెమ్మెరలు. 

ప్రకృతి పచ్చ చీర కట్టినట్టు,
ఆమని అలవోకగా నవ్వినట్టు,
అడుగడుగునా కొత్తదనం,
మదిని మీటే నవ లావణ్యం. 

ఇన్నాళ్ళూ ఎక్కడ దాచిందో,
పుడమికాంత ఇంతటి అందం,
మైమరపించే వన మరందం . 

పద్మిని భావరాజు.
14/06/2013. 



 

6, ఏప్రిల్ 2013, శనివారం

ఉషోదయం

ప్రతి ఉదయం..

అందమయిన ఉషోదయపు మత్తు నుండి
రెప్పలు విచ్చుకోకముందే...

చల్లటి మలయ సమీరం, అమ్మ మమతలా,
ఆప్యాయంగా స్పృశిస్తుంది.

చీకటి చీల్చుకుని , నులి వెచ్చని ఉదయ కిరణం,
కంటి పాపలో వెలుగుతుంది.

ఎన్నెన్ని వర్ణాలో అందంగా అలికిన ఆకాశం,
రమ్యంగా కనుల విందు చేస్తుంది.

విశ్రమించిన చిన్ని గువ్వలన్నీ రెక్కలు విప్పుకుని,
కలకూజితాలతో సందడి చేస్తాయి.

ఆకు ఆకులో నవ జీవం... పువ్వు పువ్వులో కొత్త పరిమళం..
మబ్బు మబ్బులో చైతన్యం.. అణువణువునా నవ రాగం.

ప్రతి ఉదయం... ఒక కొత్త పుట్టుక.
ప్రతి గమనం.... జీవ నదీ ప్రవాహం..
నిన్నటి నీరు ఇవాళ ఉండదు..
నిన్నటి రంగులు ఇవాళ లేవు...

తిరిగి రాని నిన్న గురుతులే వెతక్క,
నిన్నటి కలతలే పులుముకు తిరక్క,
మనసారా ఈ క్షణాన్ని ఆస్వాదించు.


25, ఆగస్టు 2012, శనివారం

తొలకరికి స్వాగతం!


తొలకరికి స్వాగతం! 







మబ్బూ మబ్బూ ఆకాశంలో అల్లుకుని,




నింగికి అందాల నీలి ముసుగు కప్పితే,




మెరుపుతీగల జిలుగు వెలుగులతో,



ఇదిగో, నే వస్తున్నా, అనే సంకేతంతో,



ఎదలోని ఆర్ధ్రతని చినుకులుగా కురిపిస్తే,



నేల, ఆ అమృత ప్రణయ వాహినిని--



ఆత్రంగా అందుకుని, భద్రంగా పొదువుకుని,



తన పులకింతను మట్టివాసనగా మార్చి,



చల్లటి మలయ సమీరంతో పంపితే--



చంచలగా పురివిప్పిన ప్రతి మనసు,



మధురంగా స్పందించి, పరవశిస్తూ ఆహ్వానిస్తుంది,



తొలకరికి స్వాగతం!

10, ఏప్రిల్ 2012, మంగళవారం

నిరీక్షణ



నిరీక్షణ 


అలకు తెలుసు......

ఎంత ఎగసి అలసినా, ఆకాశాన్ని అందుకోలేదని.

చకోరికి తెలుసు.....

చంద్రుడిని ఎంత ప్రేమించినా చేరుకోలేదని.

నెమలికి తెలుసు.....

ఎంత పురివిప్పి నాట్యమాడినా, మేఘాన్ని తాకలేదని .

కోయిలకు తెలుసు,

ఎంత ఆర్తిగా పాడినా, వసంతం తనకోసం ఆగదని.

అయినా నిరీక్షణ....


ఏదో ఒక రోజు...

సునామి వచ్చినప్పుడయినా  అల ఆకాశాన్ని అందుకోగలదని,

వెన్నెల కిరణాలనయినా త్రాగి  చకోరి వలపు పండించుకోవాలని, 


వెండి వానలో తడిసయినా నెమలి మనసు నిండుకోవాలని,


ప్రతి వసంతానికై నిరీక్షిస్తూ, పాడుతూ, కోయిల గొంతు మూగబోవాలని.


నిరీక్షణ ఆశగా, శ్వాసగా  కడతేరిపోవాలని.



9, ఏప్రిల్ 2012, సోమవారం

రాతి మనసు


రాతి మనసు 


ప్రియా...

అకాల వసంతానివై వచ్చావు,

అనంత శిశిరాన్ని మిగిల్చావు.

ఉదయ భాస్కరునిలా వచ్చావు,

చిక్కటి నిశీధి మిగిల్చావు.

పున్నమి వెన్నెలవై  వచ్చావు,

అమావాస్య చంద్రుడై కనుమరుగయ్యావు.

ప్రియా..

బండరాతిలోని నీటి లాంటి నీ మనసు, 

నీ హృదయాన్ని తడపదు- మరెవ్వరి దాహం తీర్చదు.

నీటి మీది రాత లాంటి నీ ప్రేమ,

నీకూ అర్ధం కాదు -రాసే చేతికి మమత పంచదు.

నీ కోసం ఆరాటం, ఎండమావి.

నీ ప్రేమ కోసం నిరీక్షణ, వృధాప్రయాస.