ఎందుకో మరి...
------------------
భావరాజు పద్మిని
ఎందుకో మరి...
ఒక్కసారి చూస్తే... అంతా మురిసిపోయేవారు
అందమైన వైజాగ్ అంటూ మెచ్చుకునేవారు
నగరానికి అసలు అందం దేనిదో ?
గంభీరమైన సంద్రానిదో...
ఇసుక తిన్నెల వన్నెలదో ...
రాళ్ళతో అలలు చెప్పే ఊసులదో...
ఉదయాస్తమ వేళ నీటిలో
ప్రతిబింబించే వర్ణాల శోభదో...
కొండలపైనుంచి కనిపించే...
తెల్లంచు అలల నీలిసంద్రానిదో ...
తీరాన నల్లజడలాంటి తారు రోడ్డుదో...
దుఃఖమైనా ఆనందమైనా
మాకున్నది ఈ సంద్రమేగా...
మౌనంగా ఓదారుస్తుంది...
మౌనంగా మాతో నవ్వుతుంది...
అలల ఆటతో కేరింతలు కొడుతుంది...
పిల్లగాలులతో స్వాంతన కూరుస్తుంది,
ఎన్ని సార్లు చూసినా విసుగు పుట్టదే !
పిన్నాపెద్దా తారతమ్యాలు ఎంచకుండా
గంభీరంగా, ముగ్ధంగా అమ్మలా చలువగా...
అందరినీ అక్కున చేర్చుకుంటుంది...
ఉన్నట్టుండి ఎందుకో మరి...
కారు మబ్బులు కమ్మేశాయి...
ఈదురుగాలులు చాచి కొట్టాయి...
చెవులు చిల్లులు పడేలా
కుండపోతగా వాన కురిసింది...
సుడిగుండం కడుపున పడగా,
అమ్మ సంద్రం అల్లకల్లోలం అయింది...
పోర్ట్ సిటీ ఛిన్నాభిన్నమయ్యింది..
హుదూద్ విలయం ప్రాణాలు మింగింది
ఇళ్ళు కూలి మన్ను మిగిలింది
వాలిన చెట్లు రోడ్లకు అడ్డుపడ్డాయి
ప్రపంచంతో సంబంధాలు తెగి,
నిరాశ్రయులమై ఎక్కడో శిబిరాల్లో
ఉక్కు నగరంలో గుక్కెడు నీళ్ళకోసం
పట్టెడంతా అన్నం కోసం అల్లాడుతున్నాం...
సింహాద్రి అప్పన్నా !
మా నగరానికి దిష్టి తగిలింది
అమ్మ కనక మాలక్ష్మి ...
ఈ ఊరికి గ్రహణం పట్టింది...
కొండంత దేవుళ్ళు మీరే కాచి,
మీ బిడ్డల్ని అక్కున చేర్చుకోండి.
చావుదెబ్బ నుంచి కోలుకునే
ధైర్యాన్ని ఇచ్చి కాపాడండి !
(వైజాగ్ చాలా సుందర నగరం... హుదూద్ తాకిడికి అల్లాడుతున్న వారిని చూసి, స్పందించి రాసిన కవిత... 14 /10/14 )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి