17, డిసెంబర్ 2013, మంగళవారం

పున్నాగ వాన

పున్నాగ వాన
----------------


సంజె వేళ...

అప్పుడే కనులు విప్పుతున్న 
ముగ్ధ పున్నాగ పూబాలలు 
గాలికి లయబద్ధంగా ఊగుతూ, 
సుగంధాన్ని నింపుతున్నాయి....

లేతాకుపచ్చ కాడ, తెల్లటి రేకలు 
మధ్య పచ్చటి పుప్పొడి వన్నెలు  
నాజూకైన నవదళ పరిమళాలు 
యెంత అందం తమలో....

ఈ అందం తమలో నింపింది ఎవరు ?
తమకు జీవం పోసింది  ఎవరు ?
పడిపోకుండా ఒడిసి పట్టింది ఎవరు ?
ఆత్రంగా చుట్టూ పరికించి చూసాయి...

పచ్చగా ఆకులతో నిండుగా అమ్మ, 
ధృడంగా తమను పొదువుకుంది అమ్మ,
ఆకులతో లాలనగా నిమిరింది అమ్మ,
తరువెల్లా పులకిస్తూ నవ్వింది అమ్మ....

యెంత హాయి అమ్మ ఒడిలో
యెంత చలువ అమ్మ స్పర్శలో 
యెంత మాధుర్యం అమ్మ మమతలో 
ఒదిగి ఒదిగి వెచ్చగా నిదురించాయి...

సూర్యోదయం అయ్యింది....
రాలిపోతున్న తమను ఆపేందుకు 
అమ్మ మనసు పడే ఆవేదన
కొనఊపిరితో నైనా నిలబెట్టాలని 
తల్లి తరువు తీరని యాతన 
తలక్రిందులుగా వేళ్ళాడుతూ 
తల్లితావి తెంచుకు రాలబోతూ 
తమను జాలిగా చూస్తున్న 
అమ్మను ఇలా ఓదార్చాయి...

ఎక్కడకు వెళతామమ్మా ?
నీ పాదాల చెంతకేగా...
మాలో నీ ఊపిరి నింపి,
జన్మనిచ్చిన నీ పాదాలను 
తనివి తీరా అభిషేకిస్తాం.
నీ కళ్ళముందే  కనుమూస్తాం,
మళ్ళీ నీ ఒడిలోనే జన్మించి 
నీ ప్రేమగంధం పంచుతాం,
ఇంతకంటే మాకేమి కావాలి ?

మౌనంగా తలూపింది అమ్మ,
రాలిపోతున్న తన పూబాలలను దీవిస్తూ...
చివరిసారిగా పూబాలల తనువు నిమిరింది..




అలుపెరుగని కుంచె

అలుపెరుగని కుంచె 
-------------------------

ఇవాళ...
ప్రతీ తెలుగు గుండెకూ పండుగే!
ప్రతీ గుండె ముంగిటా దివ్వెలే !

ఇవాళ ...
తెలుగింటి బొమ్మల బ్రహ్మ పుట్టినరోజు!
తెలుగు బొమ్మ ఒక రూపాన్ని పొందినరోజు!

భావగర్భితమైన కాటుక కళ్ళు,
బారెడు పొడవైన నల్లని వాల్జెడ ,
చక్కటి ముక్కు, చెక్కిన శిల్పం,
చీరలో అచ్చతెలుగు ముగ్ధ లావణ్యం...
'సొగసు చూడ తరమా ?' 
'చూసి మరువగలమా ?'

అలకల కులుకులు- రుసరుస విసురులు 
తొలితొలి వలపులు -సిగ్గుల మొలకలు 
నవరసాలు,నాట్యాలు - అష్ట విధ నాయికలు,
ఎన్ని వంపులో ఆ కుంచెకి...
ఎన్ని రంగులో ఒంపుఒంపుకీ!

దేవతలకు సైతం జీవం పోసిన కుంచె,
అలవోకగా పురాణగాధలు మలచిన కుంచె,
కధలెన్నో గీతల్లో నింపి చెప్పిన కుంచె,
ముఖచిత్రాలతో విచిత్రాలు చేసిన కుంచె!

కదిలే బొమ్మలు, కదలని బొమ్మలు,
'బాపురే' అనిపించే బాపు నాయికలు,
నాయికలకు దీటైన నవ నాయకులు,
ఎన్ని పాత్రలో రూపుదిద్దిన చేతులు,
ఎంతకూ అలుపెరుగని కుంచె చేనేతలు,  
తెలుగు మదిలో చెరగని పాదముద్రలు.

మాకు మీరిచ్చే సందేశం... అని అడిగితే...

నువ్వేపని చేస్తున్నా సరే,
ఎన్నడూ నీ వెన్ను తట్టుకోకు 
దొరికినదే చాలని రాజీ పడకు 
నిరంతర కృషిని నిలిపివెయ్యకు 
'కృషితో నాస్తి దుర్భిక్షం...' 
ఇదే గెలుపుకు రాచమార్గం !

(భావరాజు పద్మిని - 15.12.2013... బాపు గారికి అంకితం )





21, జూన్ 2013, శుక్రవారం

ప్రకృతి సందేశం

ప్రకృతి సందేశం 

పుట్టే ప్రతీ ప్రాణినీ...
హృదయభాషతో స్వాగతిస్తూ,
అభేధ భావంతో ఆదరిస్తూ,
తన కళలతో మురిపిస్తూ,
నిర్మలంగా ప్రేమిస్తూ,
నిశ్శబ్దంగా వోదారుస్తూ,
ఆత్మీయంగా ఆదరించే....అమ్మ ప్రకృతి.

ప్రతి రోజూ...
ప్రశాంత శుభోదయాన,
చుర్రున మండే మధ్యాహ్నాన,
మలయసమీరపు సాయంత్రాన,
వెన్నెల చలువల రాతిరిలోన,
కోటి రంగులు అద్దుకుని,
వినూత్నంగా విస్మయపరిచే...భావ ప్రకృతి.

చూసే కళ్ళకు మనసుంటే...
కటిక చీకటిలో- కోటి తారల్ని
నల్ల కోయిలలో- తీపి రాగాల్ని,
మందే ఎండల్లో- హరివిల్లు రంగుల్ని,
కొండ లోయల్లో- సెలయేటి పరవళ్ళని,
అనుభూతి కుంచెతో- గుండెపై చిత్రించి,
స్నిగ్ధంగా నవ్వే.....ముగ్ధ  ప్రకృతి.



యుగయుగాలుగా...
ఎన్నో చరితల పుటల్ని,
ఎన్నో రహస్య గాధల్ని,
ఎన్నో మధుర జ్ఞాపకాల్ని,
ఎన్నో ప్రకృతి వైపరీత్యాల్ని,
తనలోనే ఇముడ్చుకున్న....నిగూడ ప్రకృతి.

మౌనంగా ఉంటూనే,
ఎగసే అల అలవక తప్పదని,
విరిసే పువ్వు వదలక తప్పదని,
కురిసే చినుకు ఇగరక తప్పదని,
పుట్టిన జీవి గిట్టక తప్పదని,
చెప్పకనే చెప్పే..........నిర్వేద ప్రకృతి.

ఉన్నట్టుండి హటాత్తుగా,
తనపై జరిగే విధ్వంసాన్నివోర్వలేనట్టు,
వరదలతో ముంచెత్తి వేసి,
భూకంపాలతో మూలాలు పెకిలించి,
సునామీలతో ఉక్కిరిబిక్కిరి చేసి, 
ప్రమాదాలతో పోట్టనబెట్టుకుని,
భీబత్సంగా ప్రతిఘటించే....విలయ ప్రకృతి.

ప్రకృతి ఇచ్చే మౌన సందేశం...
ఎన్ని మెరుగులున్నా...వొదిగి ఉండాలని,
నిండు కుండలా- తొణక కూడదని,
మౌనంగానే- మమత పంచాలని,
ప్రేమకు లొంగని- ప్రాణి లేదని,
తను మన అధీనంలో కాదు---
మనం తన అధీనంలో ఉన్నామని.

స్పూర్తి

స్పూర్తి 
(పద్మిని భావరాజు , 21/6/2013)
-----------------------------------------

గలగల పారే సెలయేరు నీవు,
బండరాళ్ళు నీ గమనాన్ని ఆపలేవు.

తళతళ మెరిసే తారవు నీవు,
నీలిమబ్బులు నిన్ను దాచలేవు.

కిలకిల రావాల తీపి కోకిల నీవు,
కొమ్మమాటులు నీ గొంతు నొక్కలేవు.

జలజల రాలే తొలకరిజల్లువు నీవు,
సుడిగాలి తెర నిన్ను అడ్డుకోలేదు.

సలసల కాగే సూర్యుడు నీవు,
అరచేతిని అడ్డుపెట్టి నిరోధించలేరు.



నేస్తమా,
అసూయలు నీవు ఎదుగుతున్నవని సూచిస్తాయి,
అపనిందలు నిన్ను మరింత గట్టిపడేలా చేస్తాయి ,
అడ్డంకులు నిన్ను విజయానికి చేరువ చేస్తాయి.

మన సంకల్పబలమే మనకు అండ...
తీరానికి బలంగా డీ కొట్టితే ,
రెట్టింపు వేగంతో  లేస్తుంది కెరటం.
గోడకు బంతిని బలంగా విసిరితే, 
ఆ విసురుకే విసుగు పుట్టిస్తుంది బంతి.
బలమయిన సునామీ తర్వాతయినా,
ప్రశాంతంగానే ఉంటుంది ప్రకృతి.
ఇవన్నీ మనకు సహజ స్పూర్తి. 

లే, ఉదయభానుడి తొలి కిరణంలా,
శరత్కాలపు నిండు పున్నమిలా,
చిన్ని రెక్కల మిణుగురులా,
నీ మనసు దీపపు వెలుగులతో,
మళ్ళి లోకానికి నీ ప్రత్యూష కిరణాలు పంచు. 
 
 

14, జూన్ 2013, శుక్రవారం

ఇన్నాళ్ళూ ఎక్కడ దాచిందో...

ఇన్నాళ్ళూ ఎక్కడ దాచిందో... 
-----------------------------------


ఇన్నాళ్ళూ ఎక్కడ దాచిందో,
పుడమికాంత తన గర్భంలో,
నిద్రాణమై ఉన్న అనంతజీవ జాలాన్ని...

చినుకు తడి తగలగానే, ఒక్కసారిగా...

ఎన్ని చినుకులో అన్ని పులకలు,
ఎన్ని పులకలో అన్ని మొలకలు,
ఎన్ని మొలకలో అన్ని కులుకులు,
తమ అస్తిత్వాన్ని చూపే తొలి చిగురులు . 

ఆకుఆకులో ముత్యాలు పోదిగినట్టు,
మిలమిలా మెరిసేటి వాన చినుకులు . 
పిల్లగాలి కమ్మటి కొంటె ఊసులకి,
పరవశంగా తలలూపే చిగురుటాకులు. 
తుమ్మెదల ఝుంకార నాదానికి,
మధువులందించే లేత విరిబాలలు. 
తడిసిన మట్టి వలపు సుగంధాన్ని,
నలుదిశలా మోసుకెళ్ళే తెమ్మెరలు. 

ప్రకృతి పచ్చ చీర కట్టినట్టు,
ఆమని అలవోకగా నవ్వినట్టు,
అడుగడుగునా కొత్తదనం,
మదిని మీటే నవ లావణ్యం. 

ఇన్నాళ్ళూ ఎక్కడ దాచిందో,
పుడమికాంత ఇంతటి అందం,
మైమరపించే వన మరందం . 

పద్మిని భావరాజు.
14/06/2013. 



 

6, ఏప్రిల్ 2013, శనివారం

ఉషోదయం

ప్రతి ఉదయం..

అందమయిన ఉషోదయపు మత్తు నుండి
రెప్పలు విచ్చుకోకముందే...

చల్లటి మలయ సమీరం, అమ్మ మమతలా,
ఆప్యాయంగా స్పృశిస్తుంది.

చీకటి చీల్చుకుని , నులి వెచ్చని ఉదయ కిరణం,
కంటి పాపలో వెలుగుతుంది.

ఎన్నెన్ని వర్ణాలో అందంగా అలికిన ఆకాశం,
రమ్యంగా కనుల విందు చేస్తుంది.

విశ్రమించిన చిన్ని గువ్వలన్నీ రెక్కలు విప్పుకుని,
కలకూజితాలతో సందడి చేస్తాయి.

ఆకు ఆకులో నవ జీవం... పువ్వు పువ్వులో కొత్త పరిమళం..
మబ్బు మబ్బులో చైతన్యం.. అణువణువునా నవ రాగం.

ప్రతి ఉదయం... ఒక కొత్త పుట్టుక.
ప్రతి గమనం.... జీవ నదీ ప్రవాహం..
నిన్నటి నీరు ఇవాళ ఉండదు..
నిన్నటి రంగులు ఇవాళ లేవు...

తిరిగి రాని నిన్న గురుతులే వెతక్క,
నిన్నటి కలతలే పులుముకు తిరక్క,
మనసారా ఈ క్షణాన్ని ఆస్వాదించు.