17, డిసెంబర్ 2013, మంగళవారం

పున్నాగ వాన

పున్నాగ వాన
----------------


సంజె వేళ...

అప్పుడే కనులు విప్పుతున్న 
ముగ్ధ పున్నాగ పూబాలలు 
గాలికి లయబద్ధంగా ఊగుతూ, 
సుగంధాన్ని నింపుతున్నాయి....

లేతాకుపచ్చ కాడ, తెల్లటి రేకలు 
మధ్య పచ్చటి పుప్పొడి వన్నెలు  
నాజూకైన నవదళ పరిమళాలు 
యెంత అందం తమలో....

ఈ అందం తమలో నింపింది ఎవరు ?
తమకు జీవం పోసింది  ఎవరు ?
పడిపోకుండా ఒడిసి పట్టింది ఎవరు ?
ఆత్రంగా చుట్టూ పరికించి చూసాయి...

పచ్చగా ఆకులతో నిండుగా అమ్మ, 
ధృడంగా తమను పొదువుకుంది అమ్మ,
ఆకులతో లాలనగా నిమిరింది అమ్మ,
తరువెల్లా పులకిస్తూ నవ్వింది అమ్మ....

యెంత హాయి అమ్మ ఒడిలో
యెంత చలువ అమ్మ స్పర్శలో 
యెంత మాధుర్యం అమ్మ మమతలో 
ఒదిగి ఒదిగి వెచ్చగా నిదురించాయి...

సూర్యోదయం అయ్యింది....
రాలిపోతున్న తమను ఆపేందుకు 
అమ్మ మనసు పడే ఆవేదన
కొనఊపిరితో నైనా నిలబెట్టాలని 
తల్లి తరువు తీరని యాతన 
తలక్రిందులుగా వేళ్ళాడుతూ 
తల్లితావి తెంచుకు రాలబోతూ 
తమను జాలిగా చూస్తున్న 
అమ్మను ఇలా ఓదార్చాయి...

ఎక్కడకు వెళతామమ్మా ?
నీ పాదాల చెంతకేగా...
మాలో నీ ఊపిరి నింపి,
జన్మనిచ్చిన నీ పాదాలను 
తనివి తీరా అభిషేకిస్తాం.
నీ కళ్ళముందే  కనుమూస్తాం,
మళ్ళీ నీ ఒడిలోనే జన్మించి 
నీ ప్రేమగంధం పంచుతాం,
ఇంతకంటే మాకేమి కావాలి ?

మౌనంగా తలూపింది అమ్మ,
రాలిపోతున్న తన పూబాలలను దీవిస్తూ...
చివరిసారిగా పూబాలల తనువు నిమిరింది..
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి