కలానికీ కులముంటుందా ?
----------------------------------
కవిత -రచన : భావరాజు పద్మిని (12/3/14 )
వాగ్దేవి ముద్దుబిడ్డలం మనం
అక్షర సుగంధాలు ఆఘ్రాణిస్తాం
పదాల మధుధారలు గ్రోలుతాం
భావాల వనమాలలు అల్లుతాం
ఎన్నో మనసుల్ని స్పందింపచేస్తాం.
ధీర చరిత మనందరికే సొంతం
లోకానికి ఎదురొడ్డి ధిక్కరిస్తాం
తెగించి అసలు నిజాలు వెల్లడిస్తాం
కలం కదిలించి కర్తవ్యబోధ చేస్తాం
పాలకులకు ప్రజాగళం వినిపిస్తాం.
చేయూతైనా,చైతన్యమైనా సులభమే!
మార్పులైనా, మేల్కొల్పులైనా సాధ్యమే!
విన్నపమైనా, విప్లవమైనా సుగమమే!
చరిత్ర పుటల్ని తిరగరాయడం తధ్యమే!
నిజమే, కత్తి కంటే పదునైనది కలమే !
కాని,
కలమిప్పుడు కొత్తరంగులు పులుముకుంది,
కులం, మతం, జాతి, ప్రాంతం, పక్షపాతం,
రాజకీయమనే వివక్ష వర్ణాలు అలుముకుంది.
'విభజించి పాలించామనే' సూత్రాన్ని నేర్చుకుంది,
తన అస్తిత్వాన్ని కాసులకు అమ్ముకుంటోంది.
మనకు ఎందుకీ విభేదాలు ?
కలానికీ కులముంటుందా ?
మనందరిదీ ఒకే కులం...
రవిగాంచని లోతుల్ని సైతం,
చూసి ఆవిష్కరించే కవికులం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి