16, మే 2017, మంగళవారం

ఉమ్మెత్తవనంలో మథువు


నేస్తమా... నాకు తెలుసు...

నువు ఉమ్మెత్త వనంలో మధువుకై అన్వేషించే తుమ్మెదవని.

ఇక్కడ ఆకులు, కొమ్మలన్నీ లోలోన దాగున్న కలుషానికి,
తెల్లటి పొరను కప్పుకుని నవ్వుతుంటాయి.

ఇక్కడ పూలన్నీ తెల్లగా, స్వచ్ఛంగానే కనిపిస్తాయి...
కాని కొన్ని ముళ్ళ కాయల్ని కాస్తాయి.

గాలికి ఊగుతూ పచ్చగా ఉన్నవాటికి గాయాలు చేస్తాయి
వేళ్ళ నుండి కొనల దాకా విషం నింపుకుని నిగనిగలాడుతుంటాయి.

కానీ... నువ్వు నేర్పుగల వైద్యుడివైతే...
ఈ విషాన్నే నీ స్పూర్తిని పెంచే ఔషధంలా మార్చుకోగలవు.
పడగొట్టాలనే ప్రయత్నాలని నీ గెలుపుతో చాచికొట్టగలవు.

నీ ప్రయాణంలో, అన్వేషణలో అలసినపుడు,
నన్ను తల్చుకో...
నువ్వు వెతికే మధువును కాకపోవచ్చు,
కానీ నీ దాహార్తిని తీర్చే చినుకునవుతాను.
సోలిన నీ రెక్కల వడిని పెంచే గాలివాటునవుతాను.
నీ ప్రతి మజిలీలో అండగా నిలిచే ఆత్మబంధువునవుతాను.

20, ఏప్రిల్ 2017, గురువారం

ప్రేమ ఋతువులు

ప్రేమ ఋతువులు
--------------------------
భావరాజు పద్మిని - 20/4/17

నిలువెల్లా పరిమళించే నీ తలపులే,
ఈ వసంతంలో విరులతో జతచేరి,
తెమ్మరతో నా విరహాన్ని నీకు విన్నవించనీ!

శ్వాసలో డోలలూగే నీనామమే
ఈ గ్రీష్మ తాపంతో కలిసి ఆవిరై,
నీ ఊపిరిలో చేరి ప్రతిధ్వనించనీ!

నీ లలిత స్పర్శకోసం తపించే మనసు,
ఆర్ధ్రమై, నిండు మేఘమై, వర్షమై కురిసి,
నీ హృదయసీమను ఆసాంతం తడపనీ !

నువ్వు దూరంగా ఉన్నావని తెలిసినా,
నీతో ఉన్నట్లే జీవించే ప్రతి క్షణమూ,
నీలో శరత్ కాల పూర్ణచంద్రికలై వెలగనీ!


నీ స్మృతితో సంపన్నమయ్యే క్షణాలన్నీ,
కదలనని మొరాయించి హిమబిందువులై,
ఈ హేమంతంలో మంచుతెరలై నిన్ను కమ్ముకోనీ!

నీ నిరీక్షణలో యుగాలైన క్షణాలన్నీ
శిశిర మౌనరాగాల ధూళిని నింపుకుని,
ఏ గోధూళివేళో నీ పాదాలను తాకనీ!

వసంతం ధరణి నాసాంతం సింగారించాకా,
గ్రీష్మతాపంగా భువి తన విరహాన్ని విన్నవిస్తే,
వర్షమై దివి వలపులు కురిపిస్తుందని,
ఆ వలపు పంట శరత్ చంద్రికలై కళలొలుకుతుందని,
తుషారమై హేమంతలో ముగ్ధంగా ఘనీభవించి,
శిశిరంలో రాలిన ఆకుల రావాల్లో పాడుతుందని,
కావ్యాల్లో చదివాను కానీ...

వలపు తలపుల విరులే వసంతమని,
కణకణమున కవోష్ణజ్వాలలే గ్రీష్మమని,
భారమైన ఎదలో కురిసే జాలే వర్షమని,
అనురాగదీప్తమైన కలయికే వెన్నెలని, 

నిలచిపోయి నీహారికలైన నిముషాలే హేమంతమని, 
నీ విరహంలో రాలే నిరాశల ఆకులే శిశిరమని, 
ఇంతగా నిన్ను ఆరాధించాకేగా తెలిసింది! 
ఈ కృష్ణారాధిక తృష్ణ దీర్చవా కృష్ణా!

5, మార్చి 2017, ఆదివారం

గాజు బొమ్మ

గాజు బొమ్మ
భావరాజు పద్మిని - 5/3/17

కనులముందు వేవన్నెల ప్రకృతి శోభ పల్లవించ
తెరలనేమి చూస్తావు? తెరచిచూడు మనసును.

చిరుజల్లుల స్వాతివాన భువికెల్లను తృష్ణదీర్చ
పరవశించి పరికించక, యంత్రముతో యాతనేల ?

చిట్టిపాప బోసినగవు రారమ్మని దరికిపిలువ
అందుకొనక ఆదమరచి మీటలతో ఆటలేల?

నీకోసమె కాచుకున్న ప్రేమమూర్తి పలకరించ
కన్నెత్తైనా చూడక పొరలనేవొ కదపనేల?



వేకువ పాఠాలు మరచి, సందెల సందళ్ళు విడిచి,
పక్షుల కలరవము వినక, వెన్నెల వగలన్ని కనక,
అలల గలగలలు వలదని, పిల్లగాలులను పొమ్మని,
శాంతిలేదు మనసుకంటు, సాంత్వనకై పరుగులేల?

బొమ్మలు ప్రతిరూపాలు, నకలు కాని అసలు కావు !
త్రిశంకు స్వర్గమెపుడు స్వర్గానికి సాటిరాదు !
ప్రకృతిమాత ఒడినిచేర్చి లాలించగ స్వాగతించ
నిరసించి తెలియరాని తపనలతో రగులుటేల?

తాకలేని అనుభూతుల గాజుబొమ్మ స్మార్ట్ ఫోన్
ప్రకృతి ప్రతికృతి కాదది, మమతల మరిపించలేదది !
సంఘజీవి మనిషి నేడు బెంగ జీవి కాకముందె
స్పందించే మధురజగతి సవ్వడివిను నేస్తమా !



15, ఫిబ్రవరి 2017, బుధవారం

మేరా భారత్ మహాన్ !

మేరా భారత్ మహాన్ !
-------------------------
భావరాజు పద్మిని – 16/2/17

నీ సుఖం కోసం ప్రార్ధించడం గొప్ప కాదు, కానీ
‘సర్వేజనా సుఖినోభవంతు’ అని నిత్యం ప్రార్ధించడం గొప్ప !
నీ ఒక్కడి క్షేమాన్ని కోరడం గొప్ప కాదు, కానీ,
‘లోకాస్సమస్తా సుఖినోభవంతు’ అని హోమాలు చెయ్యడం గొప్ప !
నిత్యం ఈ నినాదాలు మార్మ్రోగే వేదభూమి నాది !
దైవం ఎంచుకుని మళ్ళీ మళ్ళీ పుట్టే కర్మభూమి నాది !

బలముండడం గొప్ప కాదు, కానీ...
అనవసరంగా బలాన్ని ప్రదర్శించకపోవడం గొప్ప !
బలహీనులకు దాన్ని చూపి లొంగదీసుకోకపోవడం గొప్ప !
ఎంత బలమున్నా సంయమనం పాటించడం గొప్పలకే గొప్ప !
మా బలాలు ఏవిటనేగా మీ ప్రశ్న !



శ్రీహరి అమ్ములపొది మా ‘శ్రీహరి’ కోట !
అణ్వస్త్రాలైనా క్షిపణులైనా ఉపగ్రహాలైనా,
దిగ్గజాలకు దీటుగా తయారుచేసే సత్తా మాది!
నవ శకానికి ఘనంగా నాంది పలుకుతూ,
ఒక్క దెబ్బతో నూట నాలుగు ఉపగ్రహాలను ,
అంతరిక్షంలో అమర్చిన మేధోసంపత్తి మాది !
‘ఔరా!’ అని దేశాలన్నీ దిమ్మేరపోగా,
రికార్డులన్నీ బద్దలుకొట్టే దూకుడు మాది !

సమాచార బదిలీకి ఇన్సాట్ లు - విద్య కోసం ఎడ్యు సాట్ లు
సముద్ర అధ్యయనానికి ఓషన్ సాట్ లు - ఉగ్రవాద నియంత్రణకు రి సాట్ లు
భూమి అధ్యయనానికి ఐ.ఆర్.ఎస్. లు - అంతరిక్ష అధ్యయనానికి మెట్ సాట్ లు
చంద్రుడి పరిశోధనకు చంద్రయాన్ – మంగళ గ్రహ శోధనకు మంగళ్ యాన్
నావిగేషన్ కోసం ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్ లు – ప్రకృతి శోధనకు స్కాట్ సాట్ లు
మెరికల వంటి మా విద్యార్ధులు చేసిన – జుగ్ను, స్టూడ్ సాట్, యూత్ సాట్ లు
కిలో నుంచి రెండువేల కిలోల వరకు – అనేక నానో పికో సాటి లైట్ లు
ప్రయోగమే కాదు ఉపసంహారమూ వచ్చని చెప్పింది ఎస్.ఆర్.ఇ. సాటిలైట్ !

ఖగోళ శాస్త్రజ్ఞుడు ‘ఆర్యభట్టు’ ను మరువం !
అతన్ని అనుసరించిన ‘భాస్కర 1’ నూ మరువం !
అసువులు బాసిన ‘కల్పనా చావ్లా’ నూ మరువం !
సాంకేతికత, సంప్రదాయం కలవడం ఎంత మనోహరం !
అందుకే అస్త్రాలకు చిరస్మరణీయమైన పేర్లు పెట్టుకుంటాం !
ఆర్యభట్ట, భాస్కర, రోహిణి ,కల్పన, సరళ్ వంటివి ఇందులో కొన్ని.


విశ్వమంతా మా నిఘా వ్యాపించి ఉంది !
ప్రపంచమంతా మా ప్రతిభను కొనియాడుతోంది !
మాలో కొత్త ఊపిరిని భరతజాతి నింపుతూనే ఉంది.
అజ్ఞాత యోగులు మమ్మల్ని శక్తివంతం చేస్తుంటారు.
‘మిస్సైల్ మాన్’ ఇచ్చిన స్పూర్తితో సాగుతూనే ఉంటాం.
మహనీయమైన ఈ భారతం కోరి కలహాలు తెచ్చుకోదు,
కాని... దయ తొలగిన నాడు దయనీయం మీ స్థితి ,
మాతో తలపడే ముందు ‘తస్మాత్ జాగ్రత్త !’

(భారతజాతి సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ISRO శాస్త్రవేత్తలకు ఈ కవిత అంకితం )
****

14, ఫిబ్రవరి 2017, మంగళవారం

ఆ క్షణంలో

ఆ క్షణంలో
---------------
భావరాజు పద్మిని - 15/2/17

ఉదయాన్నే...

మంచుతెరలు కమ్మి, మసకబారినట్లున్న అంతరంగంలోకి,
వెలుగు రేఖల్లా నీ తలపులు పరచుకుంటాయి.

ఆ వేడికి కరిగే ఒక్కొక్క మంచుతెరా, తుషారబిందువై ,
నా హృదయకమలాన్ని ముద్దాడుతుంది.

లాలిత్యంతో చుంబించిన స్పర్శలోని మాధుర్యానికి,
సుప్తావస్తలో ఉన్న నాడులన్నీ మేల్కొంటాయి.



తుమ్మెదల ఝుంకారంలా తియ్యని స్వనమేదో,
నరనరాలన్నింటినీ చైతన్యవంతం చేస్తుంది.

విప్పారిన నయనాలు మధుర భావ గర్భితాలై ,
నీ కలల కాటుకనే మళ్ళీ దిద్దుకుంటాయి.

ఊపిరిలో వ్యాపించే నీ ఊహల కాంతి రేఖలు
నాకోసం నువ్వున్నావన్న సంగతిని గుర్తుచేస్తాయి.

ఆ క్షణంలో నా వెలుపలా లోపలా సూర్యోదయమే,
జగతిలోని ప్రతి రేణువూ నీ ప్రతిరూపమై భాసిస్తుంది !

అప్పుడే వ్యక్తిగా లేచిన నేను శక్తిగా మారతాను,
నీవిచ్చే ఆలంబనతో సరికొత్త జన్మనెత్తి సాగుతాను.



17, జనవరి 2017, మంగళవారం

కొన్ని నవ్వులు... (కవిత)

కొన్ని నవ్వులు... (కవిత)
పద్మిని భావరాజు.(11 /8/13 )

కొన్ని నవ్వులు...
పెదాలు విచ్చుకునీ విచ్చుకోనట్టు,
ప్లాస్టిక్, మొహమాటం నవ్వులు.

కొన్ని నవ్వులు...
మనసులోని విషపు ఆలోచనలని,
కప్పేసే, పెదవి విరుపు నవ్వులు.

కొన్ని నవ్వులు...
అవసరాన్ని గడుపుకోవడానికి,
వచ్చే,నవజాత అవసరార్ధం నవ్వులు.

కొన్ని నవ్వులు...
అసూయను కప్పిపుచ్చుకునే,
మెచ్చుకోలు, కపటపు నవ్వులు.

కొన్ని నవ్వులు...
గెలవలేక,ఏడవలేక నవ్వే,
నిస్సహాయపు నవ్వులు.
ఇన్ని నవ్వుల మధ్య నా అన్వేషణ దేనికోసం?



ఆత్మ స్వచ్చతను,
మనసు అద్దంపైకి,
మనసు అద్దం నుంచీ,
పెదవి హరివిల్లు పైకి,
పరావర్తనం చెందించి,
ఏడు రంగులు కలిసిన,
ఆత్మ అద్భుత చిత్రాన్ని,
ఎదుటివారి కళ్ళలో మెరిపించే,
మనోహరమైన నవ్వులకోసం.

చూసాను... ఆ నవ్వులను...
పసిపాపల బోసి నవ్వుల్లో.
తల్లిదండ్రుల నిస్వార్ధ ప్రేమలో,
అండగా నిలిచే ఆత్మీయుల్లో,
గురుమూర్తి వాత్సల్య వదనంలో.

కళ్ళలో మెరిసే ఆ నవ్వులకు,
తారలు దిగదుడుపు.
విరుల తేనెల ఆ నవ్వులే,

నాకు ప్రతీరోజూ మేలుకొలుపు.

16, జనవరి 2017, సోమవారం

మరో ఉదయం

మరో ఉదయం
------------------
భావరాజు పద్మిని - 17/1/2015

మలిపోద్దులో సంజె చీకట్లు కమ్మితే,
వెలుగు తలఒగ్గి ఓడినట్లు కనిపిస్తుంది.
చీకటి ముసుగులో మునిగిన జగతి,
మరుగునపడి, మౌనంగా విశ్రమిస్తుంది.

అయితేనేం ?
నీలో సడలని సంకల్పబలం ఉంటే...
మరో ఉదయానికై వేచి చూస్తూనే...
చీకట్లోనే పున్నమిలా పుయ్యచ్చు,
నిశీధిలో నక్షత్రంలా తళుక్కుమనచ్చు,
మిణుగురులు మిలమిలా మెరవచ్చు.

చీకటి అంటే ఓటమి సమయం కాదు,
లోలోని జ్ఞానజ్యోతిని దర్శించే తరుణం ,
నీలోని కాంతి రేఖలకు మరో పార్శ్వం ,
తీరుమార్చి మెరిసేందుకు ఇంకో అవకాశం !


రేయిలో సంయమనం పాటిస్తూ నడిస్తే,
వచ్చే ఉదయం మరింత ప్రకాశవంతం !
తడబడే అడుగులే తీరైన నడకలయ్యే,
బంగారు భవితకు సరికొత్త సోపానం .

పద నేస్తమా,
మరో ఉదయం పిలుస్తోంది...
కలల ద్వారాలు తెరిచి స్వాగతిస్తోంది.
అందుకుని అనుసరించి, ఆస్వాదిద్దాం,
మరో కొత్త అధ్యాయానికి తెర తీద్దాం !
చరిత్రలో మనకంటూ చెదరని ముద్రవేద్దాం !