29, ఆగస్టు 2016, సోమవారం

వర్షావతరణం

వర్షావతరణం
---------------------
భావరాజు పద్మిని - 30/8/16

గాఢపు మబ్బులు గగనము కమ్మెను
మరలక తప్పని సూర్యుడు దాగెను
ఆర్తిగ సెగలతొ అవని వేచెను
గాలుల సవ్వడి సేదను దీర్చెను
ఎప్పుడెప్పుడని ఎదసడి అడిగెను
తొలకరి తపనలు తీర్చే తరుణం !

జీవుల కన్నులు మింటినె జూచెను
తూనీగల రొదలు రాకను జెప్పెను
పురులు విప్పుకుని నెమళ్ళు ఆడెను
కప్పలు బెకబెక సందడి జేసెను
పక్షులు గూటిన గుట్టుగ దాగెను
నీటి ముత్యముల నడిగెను నయనం !

ధనధనధనధన ఉరుములు ఉరిమగ
మిలమిలమిలమిల మెరుపులు మెరవగ
జలజలజలజల చినుకులు రాలగ
తడిసిన మట్టి సుగంధము రేగగ
మనసు మనసునా పులకలు పూయగ
ఇలను వెలసె నవ వర్షావతరణం !

కొబ్బరాకుల చిటపట జల్లు
చిట్టి పిట్టల కువకువ జల్లు
కొండకోనల రవళించే జల్లు
ఎండన బంగరు జిలుగుల జల్లు
వెన్నెలలో జలతారుల జల్లు
స్వాతి చినుకుగా మారెడి ముత్యం
కోటి వన్నెలతొ కులికెడి మురిపెం !



వాన చినుకులా వన్నె దొంగలా?
పూవుల మధువుల గ్రోలుచు రాలెను
తరువుల ఓషధులన్నీ తడిమెను
పడతుల వంపుల నిగ్గులు తేల్చెను
పక్షుల గొంతుల లోతులు తాకెను
జగతిన కణకణమును మెరిపించెడి
తుషారముల వాసంత విలాసం !

ఎదిగిన మనసున దాగిన బాల్యము
వేసిన ముసుగుల వలిచి వేసెను
పసిడి పసితనమును వెలికి తీయుచు
పన్నా పడవల సొబగుగ ఆడెను
గొడుగుల దాగినా తడిపే సరసం
ఆత్మ లోతులను తడుమునువర్షం !

నింగికి నేలకు వంతెన వేసెను
సప్త వర్ణముల సొగసులు పోయెను
మంచుగ గిరులకు మకుటము బెట్టెను
వడగళ్ళతొ తెలి పూలే పూచెను
రంగుల రంగరించుకు చేసెను
సోలిన జగమున సందడినాట్యం!

సంద్రము నుండి ఎగసిన నీరే
లవణము వీడి జలజల కురిసెను
మన్నూమిన్నూ కలుపుతు ముంచెను
వేసవి గాడ్పులు తీర్చుచు మురిసి,
వాగులవంకల నదులను గూడి,
తిరిగి సంద్రమున కలియుట చోద్యం !

వాన చినుకుల తడియుట తప్పట
రోగాములన్నీ చెంత చేరునట !
రైను డాన్సుల ఎగురుట ఒప్పట ?
మురికి నీట సయ్యాటలు మేలట !
నవీన పోకడల నటనలు నమ్మక
తడిసి పొందుమా మరియొక జన్మం !

***

21, ఆగస్టు 2016, ఆదివారం

//అడ్డుగోడలు//

//అడ్డుగోడలు//
------------------
భావరాజు పద్మిని - 22/816

వేయి కనుల వెన్నెలకి - వర్ణమేదొ వెతుకులాట
కోటి గుండెల హర్షానికి - కులమేదని కుమ్ములాట
పల్లవించు పయనానికి - తల్లివేరు తవ్వులాట
'సింధువైన' బిందువమ్మ - మేఘమేదో తెలపాలట !
రాకెట్టుల కాలంలో, ఓ మనిషీ నీ పయనం ఎటు?

విశ్వమంతా - దేశమంటూ, రాష్ట్రమంటూ, జిల్లా అంటూ,
మండలాలు, పట్టణాలు, పల్లెలుగా విభజించి...
కులాలని, మతాలని, ప్రాంతాలని, జాతులనీ,
తలవెంట్రుక చీలినట్టు చీలిపోవు తరుణాన...
మనిషేక్కడ మరుగాయెనో మరి,
మనిషిని మనిషిగ చూసే...
మనసెక్కడ మరుగాయెనో ?

నీకింతే గాలంటూ, నీకింతే నీరంటూ,
నీకింతే నేలంటూ, నీకింతే తిండంటూ,
కులానికో జగాన్ని, మనిషికింత ముక్కను
గిరిగీసుకునిచ్చాడా, భువిని మనకు విధాత ?



బారెడు దేహంలో, బండెడు మాంసానివి,
యెర్రని రక్తం పారే, సప్తధాతు సౌధానివి,
ఎక్కువేమి తక్కువేమి ఎన్నడూ లేదిక్కడ !
ఉన్నవెన్ని వన్నెలైన వెంటరావు నీతోన,
ప్రాణముంటె శివానివి, లేకపోతె శవానివి
కాలే కట్టెకు కులాలు ఎన్నద్దిన ఒకటేలే !
గూగులమ్మ వేట మాని, గుండెలోన వెతుక్కో !


ఒక్కగొంతు కేక జతగ మరిన్ని కూడి కేరింత,
ఒక్క అడుగు నడకైతె మరిన్ని కలిపి కొత్తబాట,
ఒంటిగొచ్చి ఒంటరిగా వెళ్ళిపోవు జీవితాన,
ఒంటరితనమును తీర్చే ఆసరాయె జనమంతా !
గీసుకున్న గిరులు నిన్ను కుంచించే తరుణాన,
కళ్ళు తెరవకుంటే, కడకు నిన్నూ విభాజిస్తారోయ్,
కట్లు తెంచుకోవోయ్, నీ కుటుంబమే ఈ జగమంతా!

మానవతే మన మతం, కలుపుగోలు మన కులం,
సేవ కొరకె జీవితం, సమతే మన సుగంధం,
మమత పంచుకుంటు పొతే మనుగడ ఇక మధువనే !
స్వార్ధమంటు వీడి చూడు స్వర్గముంది భువిలోనే !
అడ్డుగోడ కూల్చి చూడు అందరుంది నీలానే !
నిన్ను నువ్వు నెగ్గి చూడు అంతా ఇక నీలోనే !